Konkan Railway
-
ట్రాక్‌మ్యాన్ సమయస్ఫూర్తి.. రైలుకు తప్పిన పెను ప్రమాదం
న్యూఢిల్లీ: ట్రాక్‌మ్యాన్ సమయస్ఫూర్తి వల్ల పెద్ద రైలు ప్రమాదం తప్పింది. కొంకణ్ రైల్వే డివిజన్ పరిధిలోని కుమటా, హొన్నావర్ మధ్య రైల్వే లైన్లో పట్టాల మధ్య వెల్డింగ్ తొలగిపోయింది. శుక్రవారం విధుల్లో ఉన్న ట్రాక్‌మ్యాన్ మహదేవ్.. ట్రాక్ జాయింట్లో వెల్డింగ్ పోయి ఉండటాన్ని గమనించాడు.అయితే అదే మార్గంలో తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తుండటాన్నిఆపడానికి మహదేవ్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరగా పట్టాల వెంట పరుగులు తీయడంతో గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు.. అతడి సమయస్ఫూర్తిని అభినందించారు. నగదు బహుమతి అందిచారు. -
విశేషాలు: ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్
భారత రైల్వేలో మరో అద్భుత నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. చీనాబ్ నదిపై ఈఫిల్ టవర్ కన్నా ఎత్తయిన బ్రిడ్జ్ నిర్మితమవుతోంది. భారత ఇంజనీరింగ్ గొప్పదనాన్ని ఈ రైల్వే బ్రిడ్జ్ మకుటంగా నిలవనుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిందని మార్చ్‌లో ప్రారంభానికి సిద్ధమైందని కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ ట్విటర్ వేదికగా చెప్పారు. కశ్మీర్ ప్రాంతానికి రైల్వే లైన్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రైల్వే మార్గం వేస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కౌరీ ప్రాంతంలో ఉన్న చీనాబ్ నదిపై ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కత్రా, బనిహాల్ ప్రాంతాలను ఈ బ్రిడ్జ్ కలపనుంది. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 1,178 అడుగుల ఎత్తులో బాంబు పేలుళ్లు, భూకంపాలకు తట్టుకునేలా ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్ 63 ఎంఎం పరిమాణంలో ఉన్న స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా మీటర్లు ఎక్కువ. ‘మౌలిక సదుపాయాల కల్పనలో అద్భుతం. చీనాబ్ నదిపై స్టీల్ బ్రిడ్జ్ భారత రైల్వే నిర్మాణంలో మరో మైలు రాయి కాబోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది’ అని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ ట్వీట్ చేశారు. ఉద్దంపూర్-శ్రీనగర్- బరాముల్లా రైల్వే మార్గం (111 కిలోమీటర్లు)లో ఈ బ్రిడ్జ్ నిర్మితమవుతోంది. కశ్మీర్ లోయ ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా ఈ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది. ఇది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిర్మాణం చేపడుతున్నారు. 2004లో 1.315 కిలోమీటర్ల ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. చీనాబ్ నది ప్రవాహానికి 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నారు. గంటకు 90 కిలోల వేగంతో వీచే గాలులను కూడా ఈ బ్రిడ్జ్ తట్టుకుని నిలబడుతుంది. నిర్వహణకు సెన్సార్ ఏర్పాటుచేశారు. 120 ఏళ్ల వరకు ఈ బ్రిడ్జ్ చెక్కు చెదరకుండా ఉంటుందని తెలిపారు. దీని నిర్మాణ వ్యయం మొత్తం రూ.12,000 కోట్లు అని తెలుస్తోంది. Infrastructural Marvel in Making: Indian Railways is well on track to achieve another engineering milestone with the steel arch of Chenab bridge reaching at closure position. It is all set to be the world's highest Railway bridge 🌉 pic.twitter.com/yWS2v6exiP — Piyush Goyal (@PiyushGoyal) February 25, 2021 -
22 నుంచి డబుల్ డెక్కర్
సాక్షి, ముంబై: డబుల్ డెక్కర్ రైలు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొంకణ్ వాసుల కల ఈ నెల 22 నుంచి సాకారం కానుంది. గణేష్ ఉత్సవాలకు కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికులకు ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలు ఎంతో దోహదపడనుంది. రైలు రిజర్వేషన్ టికెట్లు కేవలం ఇంటర్నెట్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యం రైల్వే యాజమాన్యం కల్పించింది. కొంకణ్ రైల్వే అధికారులు ఈ రైలుకు 02005 నంబర్ కేటాయించారు. ఈ నెల 22,24,26,28,30, సెప్టెంబర్‌లో 1,3,5,7,9 తేదీల్లో ముంబైలోని లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ -కొంకణ్‌లోని కర్మాలి స్టేషన్ల మధ్య ఈ హాలిడే స్పెషల్ ట్రెయిన్‌ను నడపనున్నారు. కుర్లా టెర్మినస్ నుంచి ఈ రైలు ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 4.30 గంటలకు కర్మాలి చేరుకుంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 02006 నంబర్ కేటాయించారు. ఈ నెల 23,25, 27,29,31 తేదీల్లో, సెప్టెంబర్‌లో 2,4,6,8,10 తేదీల్లో కర్మాలి నుంచి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 5.30 గంటలకు కుర్లా టెర్మినస్‌కు చేరుకుంటుంది. ఇందులో ఒక ఏసీ క్యాంటిన్ బోగీ ఉండగా ఎనిమిది ఏసీ డబుల్ డెక్కర్ చెయిర్ కార్లు, రెండు జనరేటర్ బోగీలు, ఒక గార్డు బోగీ ఉంటుంది. డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి రావడంవల్ల ఈ ఉత్సవాల్లో ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే కొంకణ్ వాసులకు కొంతమేర ఊరట లభించినట్లయిందని రైల్వే సేఫ్టీ కమిషనర్ చేతన్ బక్షి అన్నారు. -
కొంకణ్‌కు డబుల్ డెక్కర్ రైలు
సాక్షి, ముంబై: కొంకణ్ ప్రయాణికులకు గణేష్ ఉత్సవాల సమయంలో డబుల్ డెక్కర్ ఏసీ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు నడపాలా... వద్దా... అనే దానిపై కొద్ది రోజులుగా సెంట్రల్ రైల్వే, చీఫ్ సేఫ్టీ కమిషనర్ల మధ్య జరుగుతున్న వాగ్వాదానికి ఎట్టకేలకు తెరపడింది. దీంతో గణేశ్ ఉత్సవాల సమయంలో స్పెషల్ ట్రెయిన్‌గా నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ అనుమతినిచ్చారు. వారానికి మూడు సార్లు మాత్రమే ఈ రైలు నడపనున్నారు. ఈ రైలు లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ నుంచి బయలుదేరి కొంకణ్ రీజియన్‌లోని కర్మాళి వరకు పరుగులు తీయనుంది. ప్రతీ బోగీలో 120 మంది వరకు కూర్చోవచ్చు. ఇందులో బెర్తులు ఉండవు. ఉదయం ఐదు గంటలకు కుర్లా టెర్మినస్ నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు కర్మాళి చేరుకుంటుంది. ఇదిలాఉండగా, ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలును కొంకణ్ రైల్వే మార్గంపై నడిపే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం డబుల్ డెక్కర్ ఏసీ రైలు భోపాల్-నవీ ఢిల్లీల మధ్య నడుస్తోంది. అందులోని 10 బోగీలను సెంట్రల్ రైల్వే తీసుకుంది. ఇందులో స్వల్ప మార్పులు చేసి కొంకణ్ రైల్వే మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ మార్గం అత్యధిక శాతం కొండ ప్రాంతం మీదుగా ఉంది. అనేక సొరంగాలు, ఎత్తై వంతెనలు చాలా ఉన్నాయి. ఎట్టకేలకు ఇది సఫలీకృతం కావడంతో రైల్వే సేఫ్టీ కమిషనర్ జారీచేసే సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉండగా, గణేష్ ఉత్సవాలకు ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. అందుకు రైల్వే శాఖ అదనంగా రైళ్లు నడుపుతుంది. ఎమ్మెస్సార్టీసీ కూడా తమవంతుగా అదనపు బస్సులు నడుపుతుంది. అయినప్పటికీ అవి ఎటూ సరిపోవు. ఉత్సవాల సమయంలో రెగ్యూలర్‌గా నడిచే రైళ్లతోపాటు స్పెషల్ ట్రెయిన్లకు కూడా రిజర్వేషన్ బుకింగ్ రెండు నెలల ముందే పూర్తయిపోయాయి. దీన్నిబట్టి ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉత్సవాల సమయంలో నడిపే ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు మంచి స్పందన లభిస్తుందని రైల్వే సేఫ్టీ కమిషనర్ చేతన్ బక్షి ఆశాభావం వ్యక్తం చేశారు. -
కొంకణ్ రైల్వే ‘ప్రత్యేక’ రికార్డు!
సాక్షి, ముంబై: ప్రత్యేక రైళ్లు నడిపి అదనపు ఆదాయాన్ని గడించడంతో కొంకణ్ రైల్వే ఈ సంవత్సరం చరిత్ర సృష్టించింది. ఏడాది కాలంలో ఏకంగా 844 ప్రత్యేక రైళ్లను నడిపి రికార్డు సృష్టించిందని కొంకణ్ రైల్వే ప్రజాసంబంధాల అధికారి వైశాలి పతంగే చెప్పారు. గత సంవత్సరం ఇదే కాలవ్యవథిలో 537 ప్రత్యేక రైళ్లు నడిపి 12 లక్షలకుపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం నడిచిన రెగ్యూలర్ రైళ్లకు అదనంగా 1,724 బోగీలు జోడించింది. ఇలా అదనంగా బోగీలు జోడించడం, ప్రత్యేక రైళ్లు నడపడం ద్వారా కొంకణ్ రైల్వేకు నవంబర్ వరకు రూ. 237.15 కోట్లు ఆదాయం అదనంగా వచ్చిందని పతంగే తెలిపారు. గతసంవత్సరం రూ.226 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. పండుగల సీజన్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని ముంబై నుంచి వివిధ రాష్ట్రాలకు, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపడం, అవసరమైతే అదనంగా బోగీలు జోడించడం పశ్చిమ, సెంట్రల్, కొంకణ్ రైల్వే మార్గాలకు ఆనవాయితీగా వస్తోంది. కాని పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలతో పోలీస్తే కొంకణ్ రైల్వే మార్గంలో ప్రయాణికుల తాకిడి అత్యధికంగా ఉంటుందని అదనంగా నడిపిన ప్రత్యేక రైళ్ల సంఖ్యను బట్టి స్పష్టమవుతోంది. రైల్వే పరిపాలన విభాగం వేసవి కాలంలో వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. కాని కొంకణ్ రైల్వే మాత్రం పండుగల సీజన్లో, గణేశ్ ఉత్సవాలు, దేవీ నవరాత్రుల సమయంలో 15 రోజుల పాటు ప్రత్యేక రైళ్లు నడిపి అదనపు ఆదాయాన్ని గడిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు ఏకంగా 844 ప్రత్యేక రైళ్లు నడిపి రైల్వే చరిత్రలో రికార్డు సృష్టించిందని ఆమె వెల్లడించారు.