సాక్షి, ముంబై: ప్రత్యేక రైళ్లు నడిపి అదనపు ఆదాయాన్ని గడించడంతో కొంకణ్ రైల్వే ఈ సంవత్సరం చరిత్ర సృష్టించింది. ఏడాది కాలంలో ఏకంగా 844 ప్రత్యేక రైళ్లను నడిపి రికార్డు సృష్టించిందని కొంకణ్ రైల్వే ప్రజాసంబంధాల అధికారి వైశాలి పతంగే చెప్పారు. గత సంవత్సరం ఇదే కాలవ్యవథిలో 537 ప్రత్యేక రైళ్లు నడిపి 12 లక్షలకుపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం నడిచిన రెగ్యూలర్ రైళ్లకు అదనంగా 1,724 బోగీలు జోడించింది. ఇలా అదనంగా బోగీలు జోడించడం, ప్రత్యేక రైళ్లు నడపడం ద్వారా కొంకణ్ రైల్వేకు నవంబర్ వరకు రూ. 237.15 కోట్లు ఆదాయం అదనంగా వచ్చిందని పతంగే తెలిపారు. గతసంవత్సరం రూ.226 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. పండుగల సీజన్‌లో రద్దీని దృష్టిలో ఉంచుకొని ముంబై నుంచి వివిధ రాష్ట్రాలకు, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపడం, అవసరమైతే అదనంగా బోగీలు జోడించడం పశ్చిమ, సెంట్రల్, కొంకణ్ రైల్వే మార్గాలకు ఆనవాయితీగా వస్తోంది. కాని పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలతో పోలీస్తే కొంకణ్ రైల్వే మార్గంలో ప్రయాణికుల తాకిడి అత్యధికంగా ఉంటుందని అదనంగా నడిపిన ప్రత్యేక రైళ్ల సంఖ్యను బట్టి స్పష్టమవుతోంది. రైల్వే పరిపాలన విభాగం వేసవి కాలంలో వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. కాని కొంకణ్ రైల్వే మాత్రం పండుగల సీజన్‌లో, గణేశ్ ఉత్సవాలు, దేవీ నవరాత్రుల సమయంలో 15 రోజుల పాటు ప్రత్యేక రైళ్లు నడిపి అదనపు ఆదాయాన్ని గడిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు ఏకంగా 844 ప్రత్యేక రైళ్లు నడిపి రైల్వే చరిత్రలో రికార్డు సృష్టించిందని ఆమె వెల్లడించారు.
కొంకణ్ రైల్వే ‘ప్రత్యేక’ రికార్డు!
Published Mon, Dec 30 2013 5:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement