జనరల్ బోగీలో వెళ్లే ప్రయాణికులకు నిత్యం రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద ఎదురౌతున్న పెద్ద సమస్య. ఈ సమస్యకు ఇక ఓ ప్రత్యేక యాప్‌తో చెక్ పెట్టింది రైల్వే శాఖ. ఇప్పటివరకూ రైల్వేలో ఆన్‌లైన్ టికెట్ విధానం రిజర్వేషన్ ప్రయాణానికి మాత్రమే పరిమితమయ్యింది. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే విధానాన్ని ఇకపై జనరల్ టికెట్‌కు విస్తరించారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఆధ్వర్యంలో అన్ రిజర్వ్‌డ్ టికెట్ సిస్టమ్ (యూటీఎస్) యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్ ద్వారా జీపీఎస్ అనుసంధానం ఉన్న అన్ని మొబైల్స్ నుంచి ప్రతి ఒక్కరూ క్షణాల్లో జనరల్, ప్లాట్‌ఫాం, సీజన్, టికెట్లను పొందే వెసులుబాటును రైల్వే అధికారులు కల్పించారు. ఈ యాప్ వినియోగం టికెట్ పొందే విధానంలో కొన్ని నిబంధనలు/షరతులను మాత్రం ప్రయాణికులు తప్పక పాటించాల్సి ఉంది.
– మెరకముడిదాం (చీపురుపల్లి)
క్షణాల్లో జనరల్ టికెట్
ఈ యాప్ ఉపయోగించి పాసింజర్, ఫాస్ట్ పాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ తదితర రైళ్లలో క్షణాల్లో జనరల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ పెద్దలకు ఎవరికైనా టికెట్ బుక్ చేస్తే వారి వద్ద సెల్‌ఫోన్ లేని పక్షంలో బుకింగ్ ఐడీ నంబరు, మొబైల్ నంబర్ చెబితే కౌంటర్ వద్ద పేపర్ టికెట్ పొందే అవకాశం ఉంది.
యాప్ డౌన్‌లోడింగ్ ఇలా
► ఈయాప్‌ను ఆండ్రాయిడ్, విండోస్, ఐఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
► గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి యూటీఎస్ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
► మొబైల్ నంబర్‌ను, ఓ పాస్‌వర్డును వ్యక్తిగత వివరాలలో ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, ఓటరు, డ్రైవింగ్ లైసెన్స్ పాన్, స్టూడెంట్ ఐడీ తదితర కార్డులు, కార్డుకు సంబంధించిన ఏదో ఒక నంబర్‌ను ఈ యాప్‌లో నమోదు చేసుకొని ఇన్‌స్టాల్ చేయాలి.
యాప్ ద్వారా సౌకర్యాలు
► ఆర్–వాలెట్, పేటీఎం, నెట్‌బ్యాంకింగ్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
► రైల్వేకు సంబంధించిన ఆర్–వాలెట్ ద్వారా టికెట్ బుక్ చేసుకొంటే 5 శాతం రాయితీ లభిస్తుంది.
► అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలోనూ బుకింగ్ కార్యాలయంలో రూ.100 నుంచి రూ.10,000 వరకూ ఈవాలెట్ రీచార్జి చేసుకొనే సౌకర్యం ఉంది.
► తరచూ ప్రయాణించే వారు క్విక్ బుకింగ్ ఆప్షన్‌ను ఎంచుకొని టికెట్లను తొందరగా పొందవచ్చు.
ప్రత్యేకతలు
► రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద చాంతాడంత క్యూలో నిల్చుని అవస్థలు పడే అవసరం ఇక లేకుండా ఇంటినుంచి బయల్దేరి రైల్వేస్టేషన్‌కు చేరేలోపే స్మార్ట్‌ఫోన్ ద్వారా యూటీఎస్ యాప్ నుంచి టికెట్‌ను పొందవచ్చు.
► ఈ యాప్ ద్వారా దక్షణ మధ్య రైల్వే పరిధిలోని ఏ యూటీఎస్ స్టేషన్ నుంచైనా సీజన్ ప్లాట్‌ఫాం, జనరల్ టెకెట్లను తీసుకోవచ్చు.
► ఒకేసారి నాలుగు టికెట్లను బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పించారు.
► షో టికెట్ ఆప్షన్ ద్వారా టీటీఈకి వివరాలను చూపించి ప్రయాణం చేయవచ్చు.
నిబంధనలు
► ప్రయాణం టికెట్లను రైలు ఎక్కేందుకు 3 గంటలు ముందుగా బుక్ చేసుకోవాలి.. అంటే టికెట్ బుక్ చేసిన 3 గంటల్లోపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ యాప్ పనిచేయదు.
► రైల్వేస్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలోపు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవచ్చు.
► స్టేషన్లో కాలుమోపాక, రైల్ ప్లాట్‌ఫాం, ట్రాక్‌ల వద్ద నుంచి టికెట్ల బుకింగ్ సాధ్యం కాదు.
► ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోవాలంటే స్టేషన్‌కు 15 మీటర్ల దూరం నుంచి 2 కిలోమీటర్ల లోపున్న వారు అర్హులు.
► సీజన్ టెకెట్‌ను అయితే గడువు తేదీకి 10 రోజుల ముందే బుక్ చేసుకోవలసి ఉంటుంది.
► పేపర్ టికెట్ కావాలంటే బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి మొబైల్ నంబర్, బుకింగ్ ఐడీని చెప్పి పొందవచ్చు.
► రైలులో ప్రయాణించేటప్పుడు నెట్ సదుపాయం లేకున్నా, చేతిలో ప్రింటెడ్ టికెట్ లేకున్నా, చెకింగ్‌కు వచ్చే టీసీకి క్యూఆర్ కోడ్, కాల్ చెక్ ఆప్షన్‌లోకి వెళ్లి బుకింగ్ వివరాలను చూపవచ్చు.
► ఈ సమయంలో ప్రయాణికుడి ఐడీ కార్డు తప్పనిసరిగా టీసీకి చూపాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment