రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధమైనా.. రైలు టికెట్! | Train ticket to be sold after chart preparation done | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధమైనా.. రైలు టికెట్!

Published Mon, May 30 2016 7:29 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM

రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధమైనా.. రైలు టికెట్! - Sakshi

రిజర్వేషన్‌ చార్ట్‌ సిద్ధమైనా.. రైలు టికెట్!

సాక్షి, హైదరాబాద్: రైలు రిజర్వేషన్ చార్ట్ విడుదలయ్యాక కూడా టికెట్లు అమ్మే వెసులుబాటును రైల్వే ప్రారంభించింది. చార్ట్ విడుదలయ్యాక ఆ రైలులు బెర్తులు ఖాళీగా ఉంటే అంతమేర టికెట్లను జారీ చేస్తారు. ఇంతకాలం ఒకే చార్టు జారీ చేసే విధానం ఉండగా, ఇప్పుడు రెండు చార్టులు సిద్ధం చేసే విధానాన్ని ప్రారంభించింది. నష్టాల నివారణ కసరత్తులో భాగంగా ఇటీవల రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇప్పటికే ఇది అమలులోకి వచ్చినప్పటికీ దీనిపై ప్రయాణికుల్లో అవగాహన లేకపోవటంతో ఖాళీ టికెట్లు అమ్ముడుకావటం లేదు. దీంతో దీనిపై ప్రయాణికులకు తెలిసేలా ప్రచారం చేయాలని నిర్ణయించింది. అరగంట ముందు వరకు అవకాశం... రైలు బయలుదేరటానికి కనీసం నాలుగు గంటల ముందు చార్టు విడుదలవుతోంది.

ఆ రైలులో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్నవారి వివరాలను బెర్తుల నెంబరుతో ఇందులో ప్రకటిస్తారు. చార్టు విడుదలైన వెంటనే టికెట్ల రిజర్వేషన్ నిలిచిపోతుంది. కానీ అప్పటికీ రైలులో కొన్ని బెర్తులు ఖాళీగా ఉంటే.. అవి అలాగే మిగిలిపోతున్నాయి. దీంతో రైల్వేకు నష్టం వాటిల్లటమే కాకుండా, ప్రయాణికులు ప్రత్యామ్నాయాల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో కొత్త విధానాన్ని రైల్వే ప్రారంభించింది. నాలుగు గంటల ముందు చార్టు విడుదలయ్యే సమయానికి బెర్తులు ఖాళీగా ఉంటే... రైలు బయలుదేరటానికి అరగంట వరకు వాటి కి సంబంధించిన రిజర్వేషన్ టికెట్ కొనేందుకు వెసులుబాటు కల్పించింది. ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. వాటిని చూసి ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్‌లు రిజర్వ్ చేసుకోవచ్చు.

ఇక కొన్ని రైళ్లలో కొన్ని స్టేషన్లు దాటిన తర్వాత బెర్తు ఖాళీ అవుతుంది. అలాంటి వాటి టికెట్లను ఆయా స్టేషన్‌లలోని కౌంటర్‌లలో కూడా విక్రయిస్తున్నారు. ఉదా.. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా నర్సాపూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో.. విజయవాడ వరకు ఓ బెర్తు రిజర్వు అయి ఉంటుంది. విజయవాడ తర్వాత అది ఖాళీ అవుతుంది. కొత్త విధానం అమలులోకి రాకముందు అలాంటి ఖాళీలు అలాగే ఉండిపోయేవి. ఇప్పుడు విజయవాడలో ఆ టికెట్‌ను రైలు బయలు దేరటానికి అరగంట ముందు వరకు విక్రయిస్తారు.

ఎమర్జెన్సీ కోటా కింద టికెట్లు బుక్ చేసుకున్న సందర్భాల్లో కూడా.. కొన్ని స్టేషన్‌ల తర్వాత గాని కొన్ని స్టేషన్ల ముందు వరకు గాని ఆ బెర్తు ఖాళీగా ఉంటుంది. అలాంటివి కూడా బుక్ చేసుకోవచ్చు. ఉదా.. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరు నుంచి ఎమర్జెన్సీ కోటా కింద బెర్తు రిజర్వ్ అయితే,,, గుంటూరు వరకు ఆ బెర్తు ఖాళీగా ఉంటుంది. అలాంటి ఖాళీలను కూడా రైలు బయలుదేరటానికి అరగంట ముందు వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ విషయంలో అవగాహన లేకపోవటంతో అలాంటి ఖాళీ బెర్తులతోనే రైళ్లు నడుస్తున్నాయి. అరగంట ముందు తుది జాబితా సిద్ధం చేసి దాన్ని నేరుగా టీసీలకు అందజేస్తారు. వాటిని బోగీ వెలుపల అతికించరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement