న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో శుక్రవారం నుంచి రైలు టికెట్ల బుకింగ్ పునఃప్రారంభం కానుందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ఇంటర్నెట్ సరిగ్గా అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లోనూ కామన్ సర్వీస్ సెంటర్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన మరికొన్ని రైల్వే స్టేషన్లలోనూ రెండు, మూడు రోజుల్లో టికెట్ బుకింగ్ కౌంటర్లు ప్రారంభం కానున్నాయన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కౌంటర్ల వద్ద జనం గుమికూడరాదన్నదే తమ లక్ష్యమని, ఇందుకు అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
త్వరలోనే మరిన్ని రైళ్లను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జూన్ 1వ తేదీ నుంచి నడిచే 200 ఏసీ, నాన్ ఏసీ రైళ్ల కోసం గురువారం బుకింగ్స్ ప్రారంభమైన రెండున్నర గంటల్లోనే 4 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి దాకా 2,050 శ్రామిక్ రైళ్ల ద్వారా 30 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించినట్లు తెలిపారు. శ్రామిక్ రైళ్ల విషయంలో పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలు తమ కార్మికులు సొంతూళ్లకు చేరుకునేందుకు సహకరించాలన్నారు. రైల్వే శాఖ ఇప్పటిదాకా 225 స్టేషన్లలో ఉన్న 5 వేల బోగీలను కోవిడ్–19 కేర్ సెంటర్లుగా మార్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment