
న్యూఢిల్లీ: సాధారణ రైళ్లలో ప్రయాణానికి జూన్ 30వ తేదీ వరకు బుక్ చేసుకున్న రైలు టికెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ గురువారం ప్రకటించింది. సాధారణ ప్రయాణికుల రైళ్లను జూన్ మాసాంతం వరకు నడిపే అవకాశం లేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మే 1న ప్రారంభించిన శ్రామిక్ స్పెషల్ రైళ్లు, మే 12న ప్రారంభించిన ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయని పేర్కొంది. మెయిల్/ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్లలో ప్రయాణానికి లాక్‌డౌన్ కంటే ముందు, లాక్‌డౌన్ సమయంలో జూన్ 30 వరకు బుక్ చేసుకున్న టికెట్లు రద్దవుతాయని, ప్రయాణికులకు టికెట్ మొత్తాన్ని వెనక్కి ఇవ్వనున్నట్లు తెలియజేసింది. ఈ–టికెట్ల కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లోనే రీఫండ్ పొందవచ్చు. లాక్‌డౌన్ నేపథ్యంలో సాధారణ రైళ్ల రాకపోకలను మార్చి 25 నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే.
గమ్యస్థానం చిరునామా ఇవ్వాల్సిందే
రైళ్లలో ప్రయాణించేవారు ఇకపై తాము చేరాల్సిన గమ్యస్థానం చిరునామాను తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటున్న వారి నుంచి ఈ చిరునామాలను రైల్వేశాఖ ఇప్పటికే సేకరిస్తోంది. రికార్డుల్లో భద్రపరుస్తోంది. ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా వైరస్ సోకినట్లు తేలితే.. వారితో కలిసి ప్రయాణించిన వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఈ ప్రక్రియ ప్రారంభించింది. రైల్వేకు సంబంధించి ఎలాంటి బుకింగ్‌లకైనా గమ్యస్థానం చిరునామా తెలపాలని రైల్వేశాఖ అధికార ప్రతినిధి బాజ్‌పాయ్ చెప్పారు. రైళ్లలో ప్రయాణించినవారిలో 12 మందికి కరోనా సోకినట్లు గతంలో బయటపడింది.