ఐసీఐసీఐబ్యాంక్ వెబ్‌సైట్‌లో రైల్వే టికెట్ల బుకింగ్
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం బ్యాంక్ ఐసీఐసీఐ తొలిసారిగా తన వె బ్‌సైట్ ద్వారా రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం రైల్వే ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్‌సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగదారులు ఐసీఐసీఐ వెబ్‌సైట్‌లో రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకోవాలంటే ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
అలాగే బ్యాంక్ త్వరలోనే ప్రీ-పెయిడ్ డిజిటల్ వాలెట్, మొబైల్ బ్యాంకింగ్ యాప్ వినియోగదారులకూ రైల్వే టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సౌక ర్యాన్ని తమ ఖాతాదారులే కాకుండా ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా వినియోగించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. ఐసీఐసీఐ వెబ్‌సైట్‌లో ట్రైన్ల సమాచారం, పీఎన్‌ఆర్ స్టేటస్, టికెట్ బుకింగ్ తదితర వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది. టికెట్ బుకింగ్ రుసుమును నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చని తెలిపింది.