సాక్షి, హైదరాబాద్: రైల్వే జనరల్ టికెట్లు మరింత తేలిగ్గా లభించనున్నాయి. యూటీఎస్ మొబైల్ యాప్‌లో క్యూఆర్ కోడ్ ఆధారంగా వేగంగా టికెట్లను బుక్ చేసుకొనే సదుపాయాన్ని దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం యూటీఎస్ యాప్ నుంచి జనరల్ టికెట్లను బుక్ చేసుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ బుకింగ్ కోసం ఎక్కువ సమయం వెచ్చించవలసి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఈ యాప్ వినియోగంపై ఆసక్తి చూపడంలేదు. దీన్ని దృష్టిలో ఉం చుకొని వేగంగా టికెట్లను బుక్ చేసుకునేందుకు క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను ప్రవేశపెట్టారు. ఇది సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, హైటెక్ సిటీ, బేగంపేట్ తదితర అన్ని ప్రధాన స్టేషన్‌ల్లో అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర 18 రైల్వేస్టేషన్‌లలో యూటీఎస్ క్యూఆర్ కోడ్ ద్వారా జనరల్ టిక్కెట్లను పొందే సదుపాయాన్ని దక్షిణమధ్య రైల్వే ప్రవేశపెట్టింది. దశలవారీగా అన్ని రైల్వేస్టేషన్‌లలోనూ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల క్యూలైన్‌లలో పడిగాపులు కాయాల్సిన ఇబ్బం ది ఉండదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు.
క్షణాల్లో టిక్కెట్..: ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే పరిధిలో రోజూ 8.5 లక్షల నుం చి 9 లక్షల మంది రిజర్వ్‌డ్, అన్ రిజర్వ్‌డ్ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తు న్నారు. ఏసీ, నాన్ ఏసీ రిజర్వేషన్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీతో పాటు రిజర్వేషన్ కార్యాలయాల్లో బుకింగ్ సదుపాయం ఉంది. కానీ అప్పటికప్పుడు బయలుదేరే జనరల్ టికెట్ల కోసం ప్రయాణికులు రైల్వేస్టేషన్‌ల్లో కౌంటర్‌ల వద్ద పడిగాపు లు కాయాల్సిందే. పండుగలు, వరుస సెలవులు, వేసవి రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో తరచుగా రైళ్లు బయలుదేరే సమయం వరకు కూడా ప్రయాణికులు టికెట్లను తీసుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలో మూడేళ్ల క్రితం దక్షిణ మధ్య రైల్వే యూటీఎస్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కానీ బుకింగ్ సమయంలో ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు అనే వివరాలతో పాటు, అనేక అంశాలను భర్తీ చేయవలసి వస్తోంది. దీంతో జాప్యం చోటుచేసుకుంటుంది. యూటీఎస్‌ను వినియోగించాలని ఉన్నప్పటికీ వివరాలను భర్తీ చేయడంపై ప్రయాణికులు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు లక్ష మందికి పైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నప్పటికీ వినియోగించే వారి సంఖ్య 40 వేల నుంచి 50 వేల వరకు ఉంది. తాజాగా క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికులు స్టేషన్‌కు ఒక కిలోమీటర్ దూరం నుంచి స్టేషన్ వర కు ఎక్కడైనా సరే క్షణాల్లో టికెట్ పొందవచ్చు. అన్ని ప్రధాన స్టేషన్‌లలో ప్లాట్‌ఫామ్‌లు, ఏటీవీఎం సెంటర్‌లు, ప్రధాన ప్రాంగణాల్లో క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో యూటీఎస్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుందని అంచనా.
అన్ని రకాల టికెట్లు తీసుకోవచ్చు..: యూటీఎస్–క్యూఆర్ సదుపాయంతో స్లీపర్, థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి రిజర్వ్‌డ్ టికెట్లు, వివిధ రకాల రా యితీ టికెట్లు మినహాయించి అన్ని రకాల జనరల్ టికెట్లను తీసుకోవచ్చు. ఎం ఎంటీఎస్, ప్లాట్‌ఫామ్ టికెట్లు పొందవచ్చు. వివిధ ప్రాంతాల మధ్య రెగ్యులర్ గా ప్రయాణం చేసేవారు నెలవారీ పాస్‌లను పొందవచ్చు. ఈ మొబైల్ యాప్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జనరల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
రైల్వే జనరల్ టికెట్లు మరింత తేలిక!
Published Sun, Mar 1 2020 3:00 AM | Last Updated on Sun, Mar 1 2020 3:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment