యూపీఐ చెల్లింపు పద్ధతి వచ్చిన ఇన్నేళ్ల తర్వాత మేల్కొన్న రైల్వే
ఐదు నెలల ప్రయోగాత్మక పరిశీలన తర్వాత అన్ని స్టేషన్‌లలో స్కానర్ల ఏర్పాటు
ఇక టికెట్ల కొనుగోలుకు పూర్తిస్థాయి నగదురహిత లావాదేవీలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్‌లలో యూపీఐ(యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) చెల్లింపులో భాగంగా క్యూర్ కోడ్ స్కానర్లు అందుబాటులోకి వచ్చాయి. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లతోపాటు టికెట్ జారీ కౌంటర్‌లన్నింటిలో క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉంచారు.
యూపీఐ పద్ధతిలో చెల్లింపులు అతి సర్వసాధారణంగా మారిన తరుణంలో రైల్వే ఏకంగా దీనిపై ఐదునెలల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. అంతకు కొద్ది నెలల ముందు యూపీఐ చెల్లింపులను కొన్ని స్టేషన్‌లలో ప్రారంభించినా.. క్యూఆర్ కోడ్ స్కానింగ్ పద్ధతిని మాత్రం అందుబాటులోకి తేలేదు.
మార్చి 21న దక్షిణ మధ్య రైల్వేలోని 14 ప్రముఖ స్టేషన్‌లలో క్యూఆర్‌కోడ్ పరిశీలన ప్రారంభించింది. కేవలం 31 కౌంటర్లలో స్కానర్లను ఏర్పాటు చేసింది. దాదాపు ఐదు నెలల సుదీర్ఘకాల ప్రయోగానంతరం ఎట్టకేలకు ఇప్పుడు జోన్ పరిధిలోని అన్ని స్టేషన్‌లలో వాటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ప్రారంభించటం విశేషం.
వంద శాతం డిజిటల్ చెల్లింపులు జరగాలని నినాదం ఇచ్చి..
రైల్వేస్టేషన్‌లలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు దాదాపు ఆరేళ్ల క్రితం దక్షిణ మధ రైల్వే ప్రకటించింది. ఇందుకోసం కాచిగూడ స్టేషన్‌లో ఓ అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. స్టేషన్‌లలోని అన్ని దుకాణాల్లో డిజిటల్ చెల్లింపు పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలని, ప్రయాణికుల నుంచి బలవంతంగా నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తరచు ఆకస్మిక తనిఖీలతో అధికారులు స్టేషన్లలోని దుకాణాలను తనిఖీ చేసి దాని అమలు తీరును పరిశీలిస్తూ వచ్చారు. ఆపై రైల్వే బోర్డుకు నివేదికలు సమర్పించింది.
కానీ, తాను మాత్రం టికెట్ల విక్రయాల్లో దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది. ఆర్థిక లావాదేవీల్లో డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డ ప్రజలు రైల్వేస్టేషన్‌లలో టికెట్ కొనేందుకు మాత్రం నగదు చెల్లించాల్సి రావటంతో ఇబ్బంది పడుతూ వచ్చారు. యూపీఐ చెల్లింపులు విస్తృతమైన నేపథ్యంలో చాలామంది జేబుల్లో నగదు అందుబాటులో ఉండేది కాదు.
రైల్వే స్టేషన్‌లలో ఈ పద్ధతి అమలులో లేదని తెలియక, నగదు లేకుండా వచ్చి క్యూ లైన్లలో నిలబడి తీరా టికెట్ కొనేప్పుడు విషయం తెలిసి ఉసూరుమంటూ ఏటీఎంల వైపు పరుగుపెట్టడం సాధారణంగా మారింది. దీంతో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతూ వచ్చాయి. కొన్నేళ్లపాటు డెబిట్ కార్డు ద్వారా డిజిటల్ చెల్లింపు పద్ధతులను మాత్రం అమలు చేసింది. యూపీఐ చెల్లింపుల కోసం ఇక తప్పని పరిస్థితి ఎదురుకావటంతో క్యూఆర్‌కోడ్ స్కానర్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టి జనం ‘జేబు’ఇబ్బందులను దూరం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment