సులువుగా రైల్వే టికె ట్లు
దక్షిణమధ్య రైల్వే శ్రీకారం
వికారాబాద్‌లో ఏటీవీఎం ప్రారంభం
వికారాబాద్ : ప్రయాణికులకు సులువుగా రైల్వే టికెట్లు లభించేలా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ శ్రీకారం చుట్టింది. గతంలో కేవలం నగరాల్లోని రైల్వే స్టేషన్లకే పరిమితమైన ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్(ఏటీవీఎం)ను సికింద్రాబాద్ రైల్వే శాఖ ఉన్నతాధికారులు నిబంధనలను సడలించి ప్రయాణికులతో అనునిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2 నుంచి లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూరు, బీదర్ తదితర రైల్వే స్టేషన్లలో ఎనీ టైం టికెట్లు వచ్చే మిషన్ ప్రయాణికులకు రైల్వే అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ మేరకు శనివారం వికారాబాద్ రైల్వే జంక్షన్‌లో సీబీఎస్ చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్ లక్ష్మణ్ ఏటీవీఎం మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు అతి తక్కువ సమయంలో క్యూలేకుండా రైలు రూట్ ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకొని ఉన్న ఏటీవీఎం మిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ మిషన్‌లో రైలు రూట్ మ్యాప్‌తో పాటు స్టేషన్లను గుర్తించే విధంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా మిషన్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రయాణికులు తమకు ఇష్టమొచ్చిన భాషను ఎంపిక చేసి టికెట్లు పొందే సౌకర్యం ఉందని పేర్కొన్నారు.
టికెట్లు పొందాలంటే సంబంధిత ఏటీవీఎం ఉన్న స్టేషన్లలోని బుకింగ్ సెంటర్లలో కనీస రుసుం రూ.50 డిపాజిట్ చేసి ప్రయాణికులు పొందాలని సూచించారు. ఆ తరువాత వారు స్మార్టుకార్డులో ఎన్ని డబ్బులు రిచార్జీ చేసుకుంటే అంత డబ్బులు నిల్వ ఉంటాయని తెలిపారు. కనీసం రూ.100 రిచార్జి చేసుకుంటే 5 శాతం అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రూ.1000 రిచార్జి చేసుకుంటే రూ.50, రూ. 10 వేల రిచార్జి చేసుకుంటే రూ.500 అదనంగా ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ స్మార్టు కార్డులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకొని డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో స్రవంతి, సవిత తదితరులు పాల్గొన్నారు.