అయ్యప్పలకు దారేది
Published Fri, Nov 8 2013 2:01 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు : జిల్లా నుంచి ఏటా కార్తీక మాసంలో లక్ష మందికి పైగా భక్తులు శబరిమల యాత్రకు వెళుతుంటారు. కార్తీక మాసం ప్రవేశించక ముందు నుంచే మండల దీక్ష చేపట్టే భక్తులు నవంబరు రెండో వారం నుంచి ప్రయాణమవుతుంటారు. జనవరి 16 వరకు అయ్య ప్పల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. జిల్లా నుంచి శబరిమల వెళ్లే భక్తులు కేరళలోని కొట్టాయం, చెంగనూరు, ఎర్నాకుళం రైల్వేస్టేషన్లలో దిగుతారు. జిల్లా భక్తులంతా ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే దిక్కుగా మారింది. మాచర్ల, నడికుడి, పిడుగురాళ్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, పొన్నూరు, రేపల్లె, మంగళగిరి ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది భక్తులు ఈ రైల్లోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతారు.
దీంతో శబరి ఎక్స్‌ప్రెస్ (17230) కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ రైల్లోని ఏ తరగతిలోనూ టికెట్లు లేవు. రిజర్వేషన్లు పూర్తయ్యాయి. జనవరి ఐదో తేదీ వరకు నో రూమ్ అనే సమాధానమే ఎదురవుతోంది. సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్ల నుంచి టికెట్ రిజర్వ్ చేసుకునే భక్తులకు వెయిటింగ్ లిస్టు రోజురోజుకు పెరుగుతోంది. విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లలోనూ ప్రయత్నాలు ప్రారంభించారు. అక్క డి నుంచి కొచ్చిన్, త్రివేండ్రం వెళ్లే రైళ్లకు టికెట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇదిలావుండగా, శబరిమల వెళ్లే భక్తుల కోసం సరైన సమయంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. శబరి, కొచ్చిన్ ఎక్స్‌ప్రెస్‌ల్లో టికెట్లు పూర్తయి న నేపథ్యంలో ఎంతో మంది భక్తులు ఆర్టీసీ, ఫోర్‌వీలర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
బస్సుల్లో వెళ్లలేం...
ఇంతకు ముందు ఎక్కువ మందితో కలిసి బృం దంగా బస్సులో శబరి మల వెళ్లాం. ఇప్పుడు వెళ్లే పరిస్థితి లేదు. రైలు ప్రయాణమే మంచిదని నిర్ణయించుకున్నాం. అయితే శబరి ఎక్స్‌ప్రెస్‌కు టికెట్లు లేవు. తత్కాల్ టికెట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అవి కూడా దొరుకుతాయో,లేదో. - అయ్యప్ప, గుంటూరు.
ఏటా ఇదే పరిస్థితి...
రిజర్వేషన్ ఓపెన్ అయిన అరగంటలోనే టికెట్లన్నీ అయిపోతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే శబరిమలలోని అన్ని తరగతు ల్లోని టికెట్లు నిండుకున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. విజయవాడ వెళ్లి అక్కడి నుంచి వెళ్లే రైళ్లకు టికెట్లు తీసుకోవాలనుకుంటున్నాం. రైల్వే అధికారులు త్వరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలి.
- మైలా సాయి కిరణ్, గుంటూరు.
Advertisement