న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీపి కబురు తెలిపారు. ఇకపై రైళ్లలో అన్ రిజర్వ్‌డ్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రైళ్లలో అన్ రిజర్వ్‌డ్ టికెట్లు కొనుగోలు చేయాలంటే.. ప్రయాణికులు టికెట్ కౌంటర్లను ఆశ్రయించాల్సిన సంగతి తెలిసిందే. రద్దీ సమయాల్లో అన్ రిజర్వ్‌డ్ టికెట్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్‌లైన్‌లో కూడా టికెట్లను విక్రయించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చని రైల్వేశాఖ భావిస్తోంది. అందులో భాగంగా యూటీఎస్ యాప్ ద్వారా టికెట్లను విక్రయించే విధానాన్ని నవంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ యాప్‌ను విండోస్, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తద్వారా అన్ రిజర్వ్‌డ్ రైల్వే టికెట్లను నేరుగా అన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఈ విధానాన్ని 15 జోన్లలో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. కాగా, నవంబర్ 1 నుంచి దేశావ్యాప్తంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేసేవారు రైల్వే ట్రాక్ నుంచి కనీసం 25 మీటర్ల దూరంలో ఉండాలి. యూటీఎస్ యాప్ ద్వారా కేవలం అన్ రిజర్వ్‌డ్ టికెట్లు మాత్రమే కాకుండా, ప్లాట్‌ఫామ్ టికెట్లు, రైల్వే పాస్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. యాప్‌లో డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాకింగ్‌తో ఇతర ఎలక్ట్రానిక్ పద్దతుల ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు. నాలుగేళ్ల క్రితం కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ అంతగా స్పందన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment