నగదు రహిత మాధ్యమాల ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు దేశీయ రైల్వే ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నెలవారీ ట్రావెల్ పాస్‌పై 0.5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్లు చేసేవారికి ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఇదే మాదిరి సౌకర్యాన్ని అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలకు విస్తరిస్తోంది. నగదు రహితంగా టిక్కెట్లను కొనుగోలు చేసే వారికి ఉచితంగా ప్యాసెంజర్ ఇన్సూరెన్స్‌ను కూడా రైల్వే అందించనుంది. నగదు లావాదేవీలను తగ్గించడానికి తమవంతు సహకరిస్తున్నామని, ఇప్పటికే ప్రయాణికులకు పలు ప్రోత్సాహకాలను ప్రారంభించినట్టు రైల్వే బోర్డు మెంబర్-ట్రాఫిక్ మహ్మద్ జంషెడ్ చెప్పారు.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసే ప్రయాణికులకు సర్వీసు ఛార్జీలను రద్దు చేయడంతో, దేశీయ రైల్వే ఇప్పటికే రూ.400 కోట్లను కోల్పోయింది. ప్రస్తుతం 60 శాతం లావాదేవీలు నగదురహితంగానే జరుగుతున్నట్టు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు నుంచి 20 శాతం మాత్రమే పెరిగాయి. 2016 నవంబర్‌కు ముందు వరకు చాలా డిజిటల్ లావాదేవీలు ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా జరిగేవి. డిమానిటైజేషన్ తర్వాత రైల్వే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లను టిక్కెట్ కౌంటర్ల వద్ద అందించింది. అంతేకాక డిజిటల్ వాలెట్ల ద్వారా కూడా చెల్లింపులను అంగీకరిస్తోంది. 15వేల టిక్కెట్ కౌంటర్లలో పీఓఎస్ మిషన్లను రైల్వే అందించింది. మొత్తం చెల్లింపుల్లో 85-90 శాతం నగదురహితంగా జరగాలని దేశీయ రైల్వే టార్గెట్‌గా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment