రక్షణకు రూ.6.21లక్షల కోట్లు | Allocations to the defense department have increased marginally from last year | Sakshi
Sakshi News home page

రక్షణకు రూ.6.21లక్షల కోట్లు

Published Fri, Feb 2 2024 4:47 AM | Last Updated on Fri, Feb 2 2024 8:16 AM

Allocations to the defense department have increased marginally from last year - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024–25 బడ్జెట్‌లో రక్షణ శాఖకు కేటాయింపులను గత ఏడాది కంటే స్వల్పంగా పెంచింది. 2023–24 బడ్జెట్‌లో రూ.5.94 లక్షల కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ.6.21 లక్షల కోట్లు కేటాయించారు. మిలిటరీ కేపిటల్‌ వ్యయం కింద పెద్ద ఎత్తున కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధ ఓడల కొనుగోలు కోసం రక్షణ శాఖకు రూ. 1.72 లక్షల కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపు గత ఏడాది 1.62 లక్షల కోట్లుగా ఉంది.

మిలిటరీ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికను సమకూర్చుకునేందుకు ‘ఆత్మ నిర్భరత’ను వేగవంతం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. మొత్తం రెవెన్యూ వ్యయం రూ.4,39,300 కోట్లు కాగా, ఇందులో రక్షణ శాఖ పింఛన్లకు 1,41,205 కోట్లు, రక్షణ సర్విసులకు 2,82,772 కోట్లు, రక్షణ మంత్రిత్వ శాఖ (సివిల్‌)కు రూ.15,322 కోట్లు కేటాయించారు.

విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ. 40,777 కోట్లు, ఇతర పరికరాల కోసం 62,343 కోట్లను కేటాయించారు. నేవీ వాహనాల కోసం రూ.23,800 కోట్లు, డాక్‌యార్డ్‌ ప్రాజెక్టుల కోసం రూ.6,830 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం కోసం ఆర్మికి రూ.1,92,680 కోట్లు, నేవీకి రూ.32,778 కోట్లు, భారత వాయుసేనకు రూ. 46,223 కోట్లు కేటాయించారు.

మొత్తమ్మీద రక్షణ శాఖకు ఈసారి కేటాయింపులు స్వల్పంగానే పెరిగాయని, ఇది మిలిటరీపై ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తుందని జాతీయ భద్రత అధ్యయన కేంద్రంలోని అసోసియేట్‌ ప్రొఫెసర్‌డాక్టర్‌ లక్ష్మణ్‌ కుమార్‌ బెహెరా చెప్పారు.కేపిటల్‌ వ్యయం కోసం రూ.10వేలకోట్లను పెంచడాన్ని ఆరోగ్యకరసంకేతంగానే భావించాలన్నారు. 

హోంశాఖ 
2 లక్షల కోట్లు 
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖకు 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో అంతర్గత, సరిహద్దు భద్రతకు ప్రాధాన్యమిస్తూ రూ. 2,02,868.70 కోట్లు కేటాయించారు. అమిత్‌షా నేతృత్వంలోని ఈ శాఖకు 2023–24లో రూ.1,96,034.91 కోట్లను కేటాయించారు. ఈసారి బడ్జెట్‌లో అత్యధిక నిధులను కేంద్ర బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్‌కు ఇచ్చారు. పారామిలిటరీ బలగాల కిందకు వచ్చే పోలీసులకు రూ. 1,32,345.47 కోట్లను, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు 37,277.74 కోట్లను కేటాయించారు.

లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు, అండమాన్‌ నికోబార్‌ దీవులకు రూ. 5,866.37 కోట్లు, చండీగఢ్‌కు రూ. 5,862.62 కోట్లు, పుదుచ్చేరికి 3269 కోట్లు, దాద్రా నగర్‌ హవేలి–డామన్‌ డయ్యూకు 2,648.97 కోట్లు, లక్షదీ్వప్‌కు 1,490.10 కోట్లు, ఢిల్లీకి 1,168.01 కోట్లు కేటాయించారు. మంత్రిమండలి, కేబినెట్‌ సెక్రటేరియట్, పీఎంఓ ఖర్చుల కోసం 1,248.91 కోట్లు ఇచ్చారు.

2023–24 బడ్జెట్‌లో పారామిలిటరీ బలగాలైన సీఆర్‌పీఎఫ్‌కు 32,809.65 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల మేరకు 31,389.04 కోట్లు ఇచ్చారు.ఇంటెలిజెన్స్‌ బ్యూరోకు రూ.3,195.09 కోట్లు (2023–24లో 3,268.94 కోట్లు), వామపక్ష ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం కింద 3,199.62 కోట్లు, సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమాల కోసం 335 కోట్లు, సేఫ్‌ సిటీ ప్రాజెక్టుల కోసం 214.44 కోట్లు, ల్యాండ్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు రూ.330 కోట్లు కేటాయించారు.  

రైల్వే కారిడార్లకు గ్రీన్‌ లైట్‌ 
2.52లక్షల కోట్ల రూపాయలతో రైలు బడ్జెట్‌ కూత 
♦ 3 మల్టీ మోడల్‌ ఆర్థిక కారిడార్లతో కొత్తగా 40,000 కి.మీ.ట్రాక్‌ల నిర్మాణం 
♦ దూసుకెళ్లనున్న సరుకు రవాణా 
♦ తీరనున్న టికెట్‌ వెయిటింగ్‌ కష్టాలు..  
♦ ప్రయాణికులకు ఊరట  వందే భారత్‌ ప్రమాణాలకు అనుగుణంగా  40 వేల సాధారణ బోగీల మార్పు 

న్యూఢిల్లీ: సరుకు రవాణాను సులభతరం చేస్తూ బడ్జెట్‌లో ప్రకటించిన మూడు మల్టీ మోడల్‌ ఆర్థిక కారిడార్ల నిర్మాణంతో రైలు ప్రయాణికుల టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌ కష్టాలు తీరనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. రైల్వేల సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచి జీడీపీ వృద్ధి రేటును పరుగులు తీయించేందుకు ప్రత్యేకంగా మూడు ఆర్థిక కారిడార్లను నెలకొల్పనున్నట్లు బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్‌ కారిడార్లు, పోర్టు కనెక్టివిటీ కారిడార్లు, అధిక రద్దీ సాంద్రత కారిడార్లు ఇందులో ఉంటాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ.2.52 లక్షల కోట్లు కేటాయించారు.

బడ్జెట్‌ కేటాయింపులపై రైల్వే మంత్రి అశ్వని కుమార్‌ గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక కారిడార్లలో భాగంగా కొత్తగా 40,000 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇది నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు 2030–31 నాటికి ప్రయాణికులకు టికెట్‌ వెయిటింగ్‌ ఇబ్బందులను తొలగిస్తుందన్నారు. మూడు కారిడార్లపై బడ్జెట్‌లో ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇవి కేవలం సరుకు రవాణా కోసం మాత్రమే కాకుండా మల్టీ మోడల్‌ కారిడార్ల మాదిరిగా పని చేస్తాయన్నారు. ప్రత్యేక కారిడార్లలో భాగంగా 434 ప్రాజెక్టులను సుమారు రూ.11 లక్షల కోట్ల వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపారు.  

40 వేల బోగీలు ఇక ‘వందే భారత్‌’  
దేశంలో 40,000 సాధారణ రైలు బోగీలను వందే భారత్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించనున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుల భద్రత, సదుపాయాలు, సౌకర్యాలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వందే భారత్, అమృత్‌ భారత్‌ రైళ్లు విజయవంతం కావడం ఇతర బోగీలను సైతం ఆధునీకరించాల్సిన అవసరాన్ని వెల్లడించిందని రైల్వే మంత్రి అశ్వనీ కుమార్‌ పేర్కొన్నారు. ‘మన వద్ద దాదాపు 40,000 సంప్రదాయ బోగీలున్నాయి. వీటిని ఆధునీకరించవచ్చు.

రైల్వేల సామర్థ్యాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతేడాది రైల్వేలు 5,200 కి.మీ. మేర నూతన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇది మొత్తం స్విట్జర్లాండ్‌ నెట్‌వర్క్‌ పరిమాణంతో సమానం. ఈ ఏడాది మరో 5,500 కి.మీ. నిర్మాణం జరుగుతుంది. 2014లో రోజుకు కేవలం నాలుగు కి.మీ. నుంచి ఇప్పుడు 15 కి.మీ. మేర కొత్త ట్రాక్‌లను నిర్మిస్తున్నాం. నెట్‌వర్క్‌ ఏర్పాటులో ఇది గణనీయమైన పురోభివృద్ధి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి మూలధన వ్యయంలో రైల్వేలు 82 శాతం ఆర్జించాయి’ అని అశ్వనీ కుమార్‌ తెలిపారు. 

అమృత చతుర్భుజం.. 
‘ప్రధానంగా ఇంధనం, లోహాలు, సిమెంట్‌ కారిడార్లు రహదారులపై కాలుష్యాన్ని తగ్గిస్తాయి. సరుకు రవాణా చౌకగా జరుగుతుంది. ఓడ రేవులతో రైలు మార్గం అనుసంధానం కూడా అవుతుంది’ అని రైల్వే మంత్రి చెప్పారు. మూడో కారిడార్‌ను అమృత చతుర్భుజంగా అభివర్ణించారు. ‘రైల్వే ట్రాఫిక్‌ సాంద్రత అధికంగా ఉండే రూట్లలో అమృత చతుర్భుజం ఏర్పాటవుతుంది.

రానున్న 6 నుంచి 8 సంవత్సరాలలో మూడు కారిడార్ల ద్వారా మొత్తంగా దాదాపు 40 వేల కి.మీ. మేర కొత్తగా రైల్వే ట్రాక్‌లను నిర్మిస్తాం. దీనిద్వారా రైల్వేల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. మన ఆర్థిక వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పు తెస్తుంది. అంతేకాకుండా ఇది 90 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. రైల్వేలు అత్యంత కాలుష్య రహిత రవాణా మార్గాలు. ఇతర మార్గాలతో పోలిస్తే రైలు రవాణా 40 – 50 శాతం చౌక’ అని అశ్వనీ కుమార్‌ తెలిపారు. 

విదేశాంగ శాఖకురూ. 22,154 కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో విదేశాంగ శాఖకు రూ. 22,154 కోట్లు కేటాయించారు. గతేడాది 18,050 కోట్లు ఇవ్వగా.. 2024–25 బడ్జెట్‌లో రూ. 4,104 కోట్లు పెంచి ఇచ్చారు. ఇక పొరుగుకు మొదట (నైబర్‌హుడ్‌ ఫస్ట్‌) పాలసీకింద ఎక్కువ సాయాన్ని భూటాన్‌ అందుకోనుంది. ఈ దేశానికి ఈ బడ్జెట్‌లో రూ. 2,068 కోట్లు సాయాన్ని ప్రతిపాదించారు. గతేడాది బడ్జెట్‌లో ఈ హిమాలయ దేశానికి రూ. 2,400 కోట్లు ఇచ్చారు.

ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించడానికి గాను ఆ దేశంలోని చబహర్‌ పోర్టుకు రూ. 100 కోట్లు కేటాయించారు. ఇక మాల్దీవులకు అభివృద్ధి సాయంలో గతేడాది కంటే రూ. 170 కోట్లు తగ్గించి ఈ బడ్జెట్‌లో రూ. 600 కోట్లు కేటాయించారు. అఫ్గానిస్తాన్‌కు రూ. 200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ. 120 కోట్లు, నేపాల్‌కు రూ. 700 కోట్లు, శ్రీలంకకు రూ. 75 కోట్లు, మారిషస్‌కు రూ. 370 కోట్లు, మయన్మార్‌కు రూ. 250 కోట్లు అభివృద్ధి సాయం ప్రతిపాదించారు. ఆఫ్రికా దేశాల కోసం ప్రత్యేకంగా రూ. 200 కోట్లు ప్రకటించారు. లాటిన్‌ అమెరికా, యురేసియా ప్రాంతాల్లోని దేశాలకు అభివృద్ధి సాయంగా రూ. 4,883 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. 

ఐఎంఈసీ ఓ గేమ్‌ చేంజర్‌
బడ్జెట్‌ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. వ్యూహాత్మంగా, ఆర్థిక పరంగా భారత్‌ ఇతర దేశాలకు ఇండియా మిడిల్‌ ఈస్ట్‌ యూరోప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (ఐఎంఈసీ) ఓ గేమ్‌ చేంజర్‌ అని చెప్పారు. ప్రపంచ వాణిజ్యానికి ఈ కారిడార్‌ వందల ఏళ్ల పాటు ఆధారభూతంగా ఉంటుందని అన్నారు. భారత నేలపై నుంచి ఈ కారిడార్‌ ప్రారంభమైందనే విషయం చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. 

జనగణన, ఎన్‌పీఆర్‌కు రూ. 1,277 కోట్లు
న్యూఢిల్లీ: 2024–25 మధ్యంతర బడ్జెట్‌లో జనాభా గణన, ఎన్‌పీఆర్‌ కోసం రూ.1,277.80 కోట్లు కేటాయించారు. దీంతో ఈ ఏడాది కూడా జనాభా లెక్కించే అవకాశం లేదని సంకేతాన్నిచ్చినట్లైంది. జనాభా లెక్కలు, ఎన్‌పీఆర్‌ల కోసం ప్రభుత్వానికి రూ.12,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 24, 2019న జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం రూ.8,754.23 కోట్ల వ్యయంతో జనాభా గణన–2021, రూ.3,941.35 కోట్ల వ్యయంతో జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) ప్రతిపాదనను ఆమోదించింది. 2020, ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30, 2020 వరకు దేశవ్యాప్తంగా జనాభా గణన, ఎన్‌పీఆర్‌ను అప్‌డేట్‌ చేయడానికి సంబంధించిన హౌస్‌ లిస్టింగ్‌ దశ షెడ్యూల్‌ చేసింది.

అయితే కోవిడ్‌–19 వ్యాప్తి కారణంగా దీన్ని వాయిదా వేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల జరిగే నేపథ్యంలో 2024లో జనాభా గణన చేపట్టే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఎన్యుమరేటర్ల ద్వారా కాకుండా సొంతంగా జనాభా గణన ఫారమ్‌ను పూరించే హక్కును వినియోగించుకోవాలనుకునే పౌరులకు ఎన్‌పీఆర్‌ను తప్పనిసరి చేశారు. ఇందుకు సెన్సస్‌ అథారిటీ స్వీయ గణన పోర్టల్‌ను రూపొందించగా.. అది ఇంకా ప్రారంభం కాలేదు. స్వీయ–గణన సమయంలో, ఆధార్‌ లేదా మొబైల్‌ నంబర్‌ తప్పనిసరిగా సేకరిస్తారు.  

తెలంగాణకురూ. 5,071 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేల అభివృద్ధి నిమిత్తం తాజా బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయిచినట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. 2009–14 కాలంతో పోలిస్తే 2023–24 నాటికి పదేళ్లలో కేటాయింపులు పది రెట్లు పెరిగాయన్నారు. రాష్ట్రంలో రైల్వేల్లో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగినట్లు చెప్పారు.. ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,138 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2009–14 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు రూ.889 కోట్లు కేటాయించినట్లు వివరించారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేసిన కేంద్రమంత్రి.. పనులు సాగుతున్నాయన్నారు.

గురువారం పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024–25 మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత రైల్‌ భవన్‌లో అశ్విని వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడారు. నూతన ట్రాక్‌ నిర్మాణం 2009–14 మధ్య సగటున ఏడాదికి 17 కి.మీ. మేర జరిగితే, 2014–24 మధ్య 69 కి.మీ. మేర జరిగిందన్నారు. 2024–25లో 142 కి.మీ. ట్రాక్‌ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 2009–14 కాలంలో సగటున ఏడాదికి 41 కి.మీ. మేర విద్యుదీకరణ జరిగితే 2014–24 మధ్య 116 కి.మీ. చేసినట్లు తెలిపారు.

2023–24లో 100% విద్యుదీకరణ పూర్తయిందని అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. రూ.31,221 కోట్ల విలువతో 2,338 కి.మీ. మేర 14 ప్రాజెక్టుల (నూతన ట్రాక్‌)కు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్ధం 40 ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, 53 లిఫ్టులు, 27 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 40 స్టేషన్లను అమృత్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్‌ వివరించారు. 

సీబీఐకి రూ.928.46 కోట్లు
న్యూఢిల్లీ: 2024–25 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కి రూ.928.46 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఇది గతేడాది కంటే రూ.40.4 కోట్లు తక్కువ. సీబీఐ శిక్షణా కేంద్రాల ఆధునీకరణ, టెక్నికల్, ఫోరెన్సిక్‌ సపోర్ట్‌ యూనిట్ల ఏర్పాటు, సమగ్ర ఆధునీకరణ, భూమి కొనుగోలు, ఏజెన్సీకి కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణం వంటి పలు ప్రాజెక్టులకు కేటాయింపులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ.. బ్యాంకురుణ మోసాలు, విదేశాల్లోని కోర్టులలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి కేసులతో పాటు కృత్రిమ మేధస్సు, క్రిప్టోకరెన్సీ, డార్క్‌నెట్‌ల ఆధిపత్యంతో అభివృద్ధిచెందుతున్న నేరాలను పరిష్కరిస్తుంది.ఇది పలు రాష్ట్రాలు, హైకోర్టులు,సుప్రీంకోర్టు అప్పగించిన క్రిమినల్‌ కేసులను కూడా డీల్‌ చేస్తుంది. 

‘ఈ–కోర్టు’కు 825 కోట్లు 
న్యూఢిల్లీ: దిగువ న్యాయవ్యవస్థలోమౌలిక సదుపాయాలను ఆధునీకరించేందుకు, కేసుల వివరాలను కంప్యూటర్‌లో డిజిటల్‌ రూపంలో పొందుపరిచేందుకు రూపొందిస్తోన్న ప్రతిష్టాత్మక ఈ–కోర్ట్‌ ప్రాజెక్ట్‌ 3వ దశకోసం బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరం రూ. 825 కోట్లు కేటాయించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1,500 కోట్లు పెంచాలని ప్రతిపాదించారు. గత ఏడాది సెపె్టంబర్‌లో ఈ ప్రాజెక్టు రూ.7,210 కోట్ల ఆర్థిక వ్యయంతో కేబినెట్‌ ఆమోదం పొందిన విషయంతెలిసిందే. 2024–25 బడ్జెట్‌లో ఈప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు కేటాయించాలని కూడా తాజా అంచనాలురూపొందించారు.

4 సంవత్సరాలలోపూర్తవుతుందని భావిస్తున్న ఈ ప్రాజెక్టులో కోర్టు రికార్డులు, వారసత్వ కేసులు,పెండింగ్‌ కేసులు అన్నింటినీ డిజిటల్‌ రూపంలో చేస్తారు. 3,108 కోట్లపత్రాలను డిజిటలైజ్‌ చేసేందుకు రూ. 2,038.40 కోట్లు అవుతుందని అంచనా. 25 పెటా బైట్ల స్టోరేజీతో క్లౌడ్‌ టెక్నాలజీ సాంకేతికతను ఈ వ్యవస్థకోసం ఉపయోగించడం గొప్ప అడుగుగా ప్రభుత్వం అభివర్ణించింది. దీనికి సంబంధించిన హార్డ్‌ వేర్‌ను రాష్ట్రాలకు కేంద్రమే అందిస్తుంది. కేంద్రం, రాష్ట్రాలు, 25 రాష్ట్రాల హైకోర్టులతో ఒక త్రైపాక్షిక ఒప్పందంజరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement