పింప్రి, న్యూస్‌లైన్: పుణే-ముంబై మహానగరాల మధ్య తలపెట్టిన బులెట్ రైలు ఇప్పట్లో కదిలే పరిస్థితులు కనిపించడం లేదు. పుణే-ముంబై-అహ్మదాబాద్ మధ్య బులెట్ రైలును నడపాలని తొలుత ప్రతిపాదించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రాజెక్టుకే రైల్వే విభాగం పచ్చజెండా ఊపింది. దీంతో ఇప్పట్లో పుణేకు బులెట్ రైలు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. పుణేకి చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలంతా బీజేపీకి చెందిన వారే. కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. దీంతో తమ బులెట్‌రైలు కల నెరవేరుతుందనుకున్న నగరవాసుల ఆశలు ఆవిరయ్యాయి.
దేశంలోని వాణిజ్య, పర్యాటక హబ్‌లు, పుణ్యక్షేత్రాలను కలిపేందుకు 10 సంవత్సరాల క్రితం భారతీయ రైల్వే ఆరు కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే ఈ బులెట్ రైలును ప్రస్తావించింది. 2006లో పుణే-ముంబై-అహ్మదాబాద్ రైలు మార్గంపై సర్వే నిర్వహించారు. ఈ మార్గంలో ఈ బులెట్ రైలును నడపడం లాభదాయకంగా ఉంటుందని సర్వే నిర్వహించిన సంస్థ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదించింది. 2009లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 55,800 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఈ రైలులో ప్రయాణించవచ్చని అంచనా.
ఇదిలాఉంచితే కేంద్ర ప్రభుత్వం పుణే ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య బులెట్‌కు పచ్చ జెండా ఊపింది. మధ్య రైల్వే పుణే జనసంపర్క్ అధికారి వై.కే. సింగ్ మాట్లాడుతూ పుణే-ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య పూర్తి సర్వే జరగలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై శ్రద్ధ పెట్టాల్సి ఉందని అన్నారు. గుజరాత్ రాష్ట్రం ముంబై-అహ్మదాబాద్‌ల రైలు విషయమై ప్రత్యేక శ్రద్ధను కనబరచడంతో ఈ రైలుకు అనుమతి లభించిందని చెప్పారు. ఈ రైలు ప్రస్తుతం పశ్చిమ రైల్వే అహ్మదాబాద్ డివిజన్ పరిధిలో ఉందన్నారు. ఇదే విషయమై పుణే-ముంబై ప్రయాణికుల గ్రూపు సంఘం అధ్యక్షుడు హర్ష మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఈ రైలు కోసం తీవ్రంగా కృషి చేయాల్సి ఉందన్నారు.
పుణే-ముంబై ‘బులెట్’ మరింత జాప్యం
Published Thu, Feb 12 2015 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement