Pune-Mumbai
-
23 నిమిషాల్లో ముంబై టు పుణె
ముంబై: ముంబై–పుణె మధ్య నిర్మించనున్న హైపర్‌లూప్‌ను ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రకటించే ప్రతిపాదనకు మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. భూమిపై నిర్మించే ఓ గొట్టంలో అత్యంత వేగంతో ప్రయాణించేందుకు ఈ హైపర్‌లూప్ ను నిర్మించాలని ప్రణాళిక ఉంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ నుంచి పుణెలోకి వాకాడ్ వరకు నిర్మించే ఈ హైపర్‌లూప్ అందుబాటులోకి వస్తే, ముంబై–పుణె మధ్య 117.5 కి.మీ. దూరాన్ని కేవలం 23 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. రూ.70 వేల కోట్ల వ్యయంతో, రెండు దశల్లో ఈ ప్రాజెక్టును పుణె మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతోంది. తొలి దశలో పుణె మహానగర పరిధిలోనే 11.8 కిలోమీటర్లపాటు హైపర్‌లూప్‌ను రూ. 5 వేల కోట్ల వ్యయంతో నిర్మించి, ప్రయోగాత్మకంగా పరీక్షిస్తారు. అంతా సవ్యంగా ఉంటే రెండో దశలో మిగతా దూరం మొత్తం హైపర్‌లూప్‌ను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు సత్వరంగా లభించడం కోసం దీనిని ప్రభుత్వ మౌలిక వసతి ప్రాజెక్టుగా ప్రభుత్వం తాజాగా గుర్తించింది. -
క్షతగాత్రులకు సాయం చేస్తూ...
ముంబై: ముంబై -పూనె ప్రధాన రహదారిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు యువకులు ప్రకృతి ప్రకోపానికి బలైపోతే, సహాయం చర్యల్లో పాలుపంచుకొంటూ మరోవ్యక్తి హిట్ అండ్ రన్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. క్షతగాత్రులను తరలిస్తున్న క్రమంలో ఆ యువకుడ్ని అతి వేగంగా వచ్చిన కారు బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే ఖోపాలికి సమీపంలో 20 అడుగుల ఎత్తునుంచి బండరాళ్లు రహదారిపై దొర్లిపడ్డాయి. పెద్దపెద్ద రాళ్లు భారీగా విరుచుకుపడటంతో బైక్‌పై వెడుతున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుండగా గణపత్ పాండురంగ(25) ను కారు రూపంలో మృత్యువు వెంటాడింది. వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన గణపత్ని త్వరితగతిన ఆసుపత్రికి చేర్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు ఈ రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దుతామని ఎస్పీ సునీల సోనావాన్ తెలిపారు. వాహనదారులు సహకరించాలని కోరారు. కాగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే మృతునికి నాలుగు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకొంటామన్నారు. -
పుణే-ముంబై ‘బులెట్’ మరింత జాప్యం
పింప్రి, న్యూస్‌లైన్: పుణే-ముంబై మహానగరాల మధ్య తలపెట్టిన బులెట్ రైలు ఇప్పట్లో కదిలే పరిస్థితులు కనిపించడం లేదు. పుణే-ముంబై-అహ్మదాబాద్ మధ్య బులెట్ రైలును నడపాలని తొలుత ప్రతిపాదించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రాజెక్టుకే రైల్వే విభాగం పచ్చజెండా ఊపింది. దీంతో ఇప్పట్లో పుణేకు బులెట్ రైలు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. పుణేకి చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలంతా బీజేపీకి చెందిన వారే. కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. దీంతో తమ బులెట్‌రైలు కల నెరవేరుతుందనుకున్న నగరవాసుల ఆశలు ఆవిరయ్యాయి. దేశంలోని వాణిజ్య, పర్యాటక హబ్‌లు, పుణ్యక్షేత్రాలను కలిపేందుకు 10 సంవత్సరాల క్రితం భారతీయ రైల్వే ఆరు కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే ఈ బులెట్ రైలును ప్రస్తావించింది. 2006లో పుణే-ముంబై-అహ్మదాబాద్ రైలు మార్గంపై సర్వే నిర్వహించారు. ఈ మార్గంలో ఈ బులెట్ రైలును నడపడం లాభదాయకంగా ఉంటుందని సర్వే నిర్వహించిన సంస్థ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదించింది. 2009లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 55,800 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఈ రైలులో ప్రయాణించవచ్చని అంచనా. ఇదిలాఉంచితే కేంద్ర ప్రభుత్వం పుణే ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య బులెట్‌కు పచ్చ జెండా ఊపింది. మధ్య రైల్వే పుణే జనసంపర్క్ అధికారి వై.కే. సింగ్ మాట్లాడుతూ పుణే-ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య పూర్తి సర్వే జరగలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై శ్రద్ధ పెట్టాల్సి ఉందని అన్నారు. గుజరాత్ రాష్ట్రం ముంబై-అహ్మదాబాద్‌ల రైలు విషయమై ప్రత్యేక శ్రద్ధను కనబరచడంతో ఈ రైలుకు అనుమతి లభించిందని చెప్పారు. ఈ రైలు ప్రస్తుతం పశ్చిమ రైల్వే అహ్మదాబాద్ డివిజన్ పరిధిలో ఉందన్నారు. ఇదే విషయమై పుణే-ముంబై ప్రయాణికుల గ్రూపు సంఘం అధ్యక్షుడు హర్ష మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఈ రైలు కోసం తీవ్రంగా కృషి చేయాల్సి ఉందన్నారు.