ముంబై: ముంబై -పూనె ప్రధాన రహదారిపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు యువకులు ప్రకృతి ప్రకోపానికి బలైపోతే, సహాయం చర్యల్లో పాలుపంచుకొంటూ మరోవ్యక్తి హిట్ అండ్ రన్ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. క్షతగాత్రులను తరలిస్తున్న క్రమంలో ఆ యువకుడ్ని అతి వేగంగా వచ్చిన కారు బలి తీసుకుంది.
వివరాల్లోకి వెళితే ఖోపాలికి సమీపంలో 20 అడుగుల ఎత్తునుంచి బండరాళ్లు రహదారిపై దొర్లిపడ్డాయి. పెద్దపెద్ద రాళ్లు భారీగా విరుచుకుపడటంతో బైక్పై వెడుతున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుండగా గణపత్ పాండురంగ(25) ను కారు రూపంలో మృత్యువు వెంటాడింది. వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన గణపత్ని త్వరితగతిన ఆసుపత్రికి చేర్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు.
మరోవైపు ఈ రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దుతామని ఎస్పీ సునీల సోనావాన్ తెలిపారు. వాహనదారులు సహకరించాలని కోరారు. కాగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే మృతునికి నాలుగు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకొంటామన్నారు.
క్షతగాత్రులకు సాయం చేస్తూ...
Published Mon, Jul 20 2015 11:11 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM
Advertisement