బీజింగ్:ఆవిష్కరణల్లో చైనా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ రైలు నమూనాను చైనా రైల్వే సంస్థ తాజాగా ఆవిష్కరించింది. దీనికి సీఆర్450గా పేరుపెట్టింది. ఆదివారం(డిసెంబర్29) బీజింగ్‌లో ఈ రైలును పరీక్షించారు.
ట్రయల్‌రన్‌లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైలు దూసుకుపోయింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిమీ వేగాన్ని అందుకోగలదని చైనా రైల్వే తెలిపింది. ఇది ప్రయాణాలకు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్యాసింజర్ రైలుగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది.
ఈ బుల్లెట్ రైలు చైనా రాజధాని బీజింగ్ నుంచి షాంఘై నగరానికి కేవలం రెండున్నర గంటల్లోనే ప్రయాణించగలదు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతమున్న సీఆర్400 మోడల్ కంటే ఇది 12 శాతం బరువు తక్కువ. ఇంధనాన్ని కూడా 20 శాతం తక్కువగానే వాడుతుందని చైనా రైల్వే అధికారులు తెలిపారు.
ఇక గత బుల్లెట్ రైలు మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిమీ వేగాన్ని అందుకోవడం గమనార్హం. చైనా హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ ప్రపంచలోనే అతిపెద్దది కావడం గమనార్హం. చైనాలో ఇప్పుడున్న బుల్లెట్ రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు.
Comments
Please login to add a commentAdd a comment