
బీజింగ్: చైనా భారీ వర్షాల కారణంగా రికార్డు స్థాయిలు వరదలు ముంచెత్తాయి. వందల ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయిలో భారీ వరదలు సంభవించాయి. దక్షిణ చైనా ఈ వరదల కారణంగా అతలాకుతలమైంది. చైనా టెక్ రాజధాని షెనజెన్, లాజిస్టిక్స్ హబ్ అయిన గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ప్రజలను వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షితప్రాంతాలకు తరలించారు.
గ్వాంగ్‌డాంగ్‌లోని ప్రమాదంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను, పాఠశాలలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే తీర ప్రాంత ఫుజియాన్ ప్రావిన్స్, గ్వాంగ్జితో సహా ఇతర ప్రాంతాలు ఈ నెలలో కురిసిన భారీ వర్షాలకు బాగా ప్రభావితమయ్యాయి. ఐతే చైనాలో కొన్ని ప్రాంతాల్లో వేసవి వరదలు సర్వసాధారణం.
కానీ ఇటీవల కొన్ని సంవత్సరాలలో ఇవి మరింత తీవ్ర తరమవుతున్నాయి. పైగా ఈ వరద బీభత్సాన్ని 'శతాబ్దానికి ఒకసారి వచ్చే వరదలు'గా చైనా మీడియా సంస్థలు పిలుస్తున్నాయి. పైగా నీటి మట్టాలు 1931లో నమోదైన రికార్డును అధిగమించాయని, 1951 నాటి ఘటన పునరావృతమైందని చైనా అధికారులు వెల్లడించారు.