
పట్నా : కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడిపోయిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం.. బిహార్‌లోని గయా రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్‌పై బండి ఆగి ఉంది. దీంతో ఓ వృద్ధుడు ఫ్లాట్‌ఫాంపైకి దిగాడు. కొద్ది సమయంలోని ఆ రైలు తిరిగి బయలుదేరింది. అయితే కదులుతున్న సమయంలో ట్రైన్ ఎక్కబోయిన ఆ వృద్ధుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఫ్లాట్‌ఫామ్‌కి, రైలుకి మధ్య సందులో ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది (ఆర్‌పీఎఫ్) క్షణాల్లో అతన్ని గమనించి వెంటనే వెనక్కి లాగా కాపాడింది. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రైల్వేగార్డ్ సహాయంతో ట్రైన్ ఆపి అతన్ని లోపలకి ఎక్కించారు. దీనికి సంబందించిన వీడియోను రైల్వేమంత్రిత్వ శాఖ ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఆర్‌పీఎఫ్ సిబ్బందికి అభినందనలు తెలిపింది.