దేశంలో లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ప్రచారం ముమ్మరమయ్యింది. ఈ ఎన్నికల పోరులో నేతలంతా తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అభివృద్దే తమ నినాదమంటూ ఎన్నికల సభల్లో ప్రజలకు పలు హామీలు గుప్పిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా ‘మిస్టర్ డొనేషన్’గా పేరు తెచ్చుకున్న ఒక అభ్యర్థి విచిత్ర రీతిలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు.
బీహార్‌లోని గయ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అశోక్ కుమార్ పాశ్వాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అతని బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా. అశోక్ ప్రభుత్వ భూమిలో ఇంటిని కట్టుకున్నాడు. తన ఎన్నికల నామినేషన్‌కు అయ్యే మొత్తాన్ని విరాళాల రూపంలో సేకరించాడు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి నిధులను సేకరిస్తున్నాడు. ఈ నేపధ్యంలో స్థానికులు అతనికి ‘మిస్టర్ డొనేషన్’ అనే పేరు పెట్టారు. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ ప్రజల మధ్యకు వెళ్లి, వారికి వందనం చేస్తూ పది రూపాయల చందాతో పాటు తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నాడు.
అశోక్ కుమార్ పాశ్వాన్ ఎన్నికల గుర్తు ఆటో. దీంతో అతనే స్వయంగా ఆటో నడుపుతూ ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాడు. గతంలో గయ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచినవారెవరూ ఈ ప్రాంతానికి ఒక్కసారైనా రాలేదని అశోక్ ఆరోపిస్తున్నాడు. తాను ఎంపీని అయ్యాక నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని అన్నాడు. ప్రజల నుంచి సేకరించిన విరాళాలను అభివృద్ధి పనులకు వెచ్చిస్తానని అశోక్ తెలిపాడు. బడా నేతల మాదిరిగా తాను ప్రచారం చేయలేనని, తోటి ఆటో డ్రైవర్లు తన కోసం ప్రచారం చేస్తున్నారని అశోక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment