సాక్షి, హైదరాబాద్: రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ‘భారత్ గౌరవ్’ పేరిట ఇతివృత్త ఆధారిత పర్యాటక సర్క్యూట్ రైళ్లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) నిర్ణయించిం ది. ఈ రైళ్లను నడిపించే అవకాశాన్ని ప్రైవేట్ సంస్థ లకు అప్పగించనుంది. భారత దేశ సాంస్క్రతిక, వారసత్వ సంపదగా చెప్పుకొనే చారిత్రక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్ర స్థలాల ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ఎస్సీఆర్ వర్గాలు తెలిపాయి.
అదే సమయంలో రైలు ప్రయాణికులకు చారిత్రక ప్రదేశాల సందర్శనకు అవకాశం కల్పించడంతో పాటు దేశ పర్యాటక రంగం అభివృద్ధికి కూడా తోడ్పాటును అందించినట్లవుతుందని పేర్కొన్నాయి. కాగా ‘భారత్ గౌరవ్’ రైళ్ల నిర్వహణలో ప్రైవేట్ సంస్థలకు దర్శనీయ స్థలాల ఎంపిక, చార్జీల నిర్ణయం వంటి అంశాలపై పూర్తి స్వేచ్ఛ ఇవ్వనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ సర్క్యూట్ రైళ్లు నడిపేందుకు ఆసక్తిగలవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు కోసం నమోదు చేసుకోవలసి ఉంటుంది. వచ్చే 10 పని దినాలలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
కనీసం 14, గరిష్టంగా 20 కోచ్‌లు
నమోదు చేసుకున్న సర్వీసు ప్రొవైడర్లు వారికి కావాల్సిన విధంగా రేక్ (రైలు బోగీ) కూర్పు (కనీసం 14 కోచ్‌లు, గరిష్టంగా 20 కోచ్‌లు)ను ఎంపిక చేసుకునే అవకాశముంది. రైల్వే వారి మౌలిక సదుపాయాలను, రోలింగ్ స్టాక్ (రైల్వే వాహనాలు)ను వినియోగించుకునేందుకు నిబంధనల ప్రకారం ‘రైట్ టు యూజ్’ చార్జీలు, స్థిర, చర వాణిజ్య సరుకు రవాణా (ఫిక్స్‌డ్, వేరియబుల్ హాలేజ్) చార్జీలు, స్టాబ్లింగ్ (సరుకు నిల్వ) చార్జీలు వంటివి విధిస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి.
ఈ రైళ్లను మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా పరిగణిస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల సర్వీసు ప్రొవైడర్లు దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం రైల్ నిలయం కార్యాలయంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ప్రయాణికుల సేవలు) ఆర్.సుదర్శన్‌ను సంప్రదించవచ్చునని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment