కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయండి | To set up a new railway zone | Sakshi
Sakshi News home page

కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయండి

Published Tue, Feb 17 2015 1:31 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM

To set up a new railway zone

  • రెండు రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తిచేయండి
  • వచ్చే బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించండి
  • కొత్త ప్రాజెక్టుల మంజూరులోనూ ఉదారంగా వ్యవహరించండి
  • రైల్వే మంత్రికి వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం వినతి
  • సురేష్ ప్రభుతో పార్టీ అధ్యక్షుడు జగన్, ఎంపీల భేటీ
  • సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును కోరింది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. రైల్వే బడ్జెట్‌లో ఈ మేరకు తగినన్ని నిధులు విడుదల చేయాలని విన్నవించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో.. పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు, బుట్టా రేణుక, పీవీ మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డిలతో కూడిన బృందం సోమవారం రైల్వేభవన్‌లో మంత్రిని కలిసింది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఒక వినతిపత్రం సమర్పించింది. అందులోని ముఖ్యాంశాలు..

    ‘‘రైల్వేకు సంబంధించిన కొత్త ప్రాజెక్టులు, రైళ్లు, లైన్లు, డివిజన్ల మంజూరు విషయంలో, అమలులో ఉన్న ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే శాఖ ఏటా మొండిచెయ్యి చూపుతుండడంతో చాలా ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంజూరైన ప్రాజెక్టులకు కూడా అరకొరగా నిధులు కేటాయించడంతో అవి ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. 2014-15 రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి తన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను ప్రస్తావించారు.

    ‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ.20,680 కోట్ల అంచనా వ్యయం కలిగిన 29 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. రెండు కొత్త రాష్ట్రాల అధికారులతో సమన్వయ సమావేశాలు జరిపి వాటి అవసరాలను తెలుసుకుని వాటిని పరిగణనలోకి తీసుకుంటాం..’ అని పేర్కొన్నారు. ఇంత స్పష్టంగా హామీ ఇచ్చినప్పటికీ.. మాకు తెలిసినంతవరకు రైల్వే శాఖ ఈ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ ప్రాజెక్టుల అమలులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పటికైనా ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక దృష్టితో మా రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి పరచడం ద్వారా రైల్వేల పరంగా వెనుక బాటుతనం నుంచి మమ్మల్ని బయటకు తెస్తారని ఆశిస్తున్నాం. 2015-16 రైల్వే బడ్జెట్ సందర్భంగా మా రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయడంలోనూ, ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయడంలోనూ ఉదారంగా వ్యవహరించాలని కోరుతున్నాం.
     
    విశాఖపట్నం రైల్వే డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేర్చాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ అది నెరవేరలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ వ్యవస్థీకరణ చట్టం-2014లోని 13వ షెడ్యూలు సీమాంధ్రలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ఏపీ కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణలోని ముఖ్యమైన నగరాలకు ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని కూడా 13వ షెడ్యూలు పేర్కొంది. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగు వేయలేదు.
     
    బెంగళూరు, కడప మధ్య రైల్వే లైన్ లింక్‌కు చాలినంత నిధులు కేటాయించకపోవడంతో దాని నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు రానున్న రైల్వే బడ్జెట్‌లో గరిష్ట మొత్తంలో నిధులు కేటాయించాలని కోరుతున్నాం. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలోని వెనుకబడిన ప్రాంతాలైన వైఎస్సార్, చిత్తూరు జిల్లాల అభివృద్ధిలో ఈ రైల్వే లైను కీలకపాత్ర పోషిస్తుంది.
     
    2013 రైల్వే బడ్జెట్లో ప్రొద్దుటూరు, కంభం (వయా మైదుకూరు, పోరుమామిళ్ల) మధ్య రైల్వే లైను మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు. బెంగళూరు, గుంటూరు, విజయవాడల మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఈ లైను చాలా ఉపయోగపడుతుంది. అలాగే బొగ్గు, ఐరన్ ఓర్, జిప్సం, సిమెంట్  రవాణాకు ఉపకరిస్తుంది.
     
    మిర్యాలగూడ, జగ్గయ్యపేట మధ్య కొత్త రైల్వే లైను పనులు షెడ్యూలుకు అనుగుణంగా జరగడం లేదు. గత బడ్జెట్లలో తగినన్ని నిధులు మంజూరు కాకపోవడమే ఇందుకు కారణం. ఈ లైను పూర్తయితే ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. బియ్యం, ఖనిజ వనరులకు ఆలవాలంగా ఉన్న ఈ రెండు పట్టణాలు.. ఈ రైల్వే లైను పూర్తయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లో తమ వర్తకాన్ని మెరుగుపరుచుకోగలుగుతాయి.
     
    శ్రీకాళహస్తి, ప్రకాశం, గుంటూరు, నల్గొండ జిల్లాలను కలిపే నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైను సామాజికంగా, ఆర్థికంగా వాంఛనీయమైన ప్రాజెక్టు. గత  రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని భావించాయి. తుపాన్ల వేళ అంతరాయం ఏర్పడే కోల్‌కతా-చెన్నై వయా విజయవాడ మార్గానికి ఇది ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతుంది. 2013 మేలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గానికి స్థలాన్ని ఉచితంగా సేకరించి ఇస్తామని, ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం భరిస్తామని చెప్పింది. అయినప్పటికీ ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఈ ప్రాజెక్టులన్నిటికీ తగిన నిధులు కేటాయించాలని కోరుతున్నాం.
     
    ప్రస్తుతం ఎర్రగుంట్ల-నంద్యాల సెక్షన్‌లో ఎర్రగుంట్ల-బనగానపల్లి మధ్య ట్రాక్, సిగ్నలింగ్ పనులు స్టేషన్, మౌలిక వసతుల ఏర్పాటు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కూడా పూర్తయింది. కానీ ఎర్రగుంట్ల నుంచి నంద్యాలకు రైళ్లు నడిపించేందుకు ఈ 93 కి.మీ. రైల్వే మార్గాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఇందుకు కారణం మరో 30 కి.మీ. ట్రాక్ అసంపూర్ణంగా ఉంది. దీనిని 2015 మార్చి కల్లా పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు రూ. 100 కోట్లు కూడా కేటాయించారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసేందుకు అధికారులకు తగిన సూచనలు ఇవ్వగలరు.
     
    రానున్న బడ్జెట్‌లో బనగానపల్లి కర్నూలు మధ్య కొత్త రైల్వే లైను మంజూరు చేయాలని కోరుతున్నాం. ఈ లైన్ మంజూరై, ఎర్రగుంట్ల-నంద్యాల లైన్ నిర్మాణం పూర్తయితే తిరుపతి-హైదరాబాద్ మధ్య ఉన్న దూరం దాదాపు 130 కి.మీ. మేర తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలు ఖనిజ సంపదతో కూడుకున్నవి. భారీగా సిమెంట్ పరిశ్రమలు నెలకొన్న ప్రాంతం ఇది. ఈ పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకును ఈ కొత్త రైల్వే లైను మార్గం ద్వారా రవాణా చేసుకునే వీలు కలుగుతుంది. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుకు అవసరమైన బొగ్గును కూడా ఈ మార్గం ద్వారా రవాణా చేసుకోవచ్చు.
     
    సరిపడా నిధులు మంజూరు కాక భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ పెండింగ్‌లో ఉంది. దీని నిర్మాణం పూర్తయితే హైదరాబాద్-వైజాగ్ మధ్య దూరం 130 కి.మీ. మేర తగ్గుతుంది. బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్న కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ తదితర ప్రాం తాలను ఈ రైల్వే మార్గం దేశంలోని తూర్పు ప్రాంతాలతో కలుపుతుంది. పుణ్యక్షేత్రమైన భద్రాచలంను యాత్రికులు సులభంగా దర్శించుకునేందుకు వీలు కలుగుతుంది. తుపాన్ల వేళ ఈ మార్గం ప్రత్యామ్నా య మార్గంగా కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ ప్రాజెక్టుకు కూడా అధిక నిధులు కేటాయించి షెడ్యూలు ప్రకారం పూర్తిచేయాలని కోరుతున్నాం.
     
    తెలంగాణ వ్యాప్తంగా రైల్వే ఓవర్ బ్రిడ్జీలు, రైల్వే అండర్ బ్రిడ్జీలు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. అందువల్ల వీటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం..’’

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement