కర్నూలు(అర్బన్) : కృష్ణా నది నుంచి ప్రతి ఏడాది వృథాగా సముద్రంలో కలుస్తున్న 72 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించేందుకు ఆయన గురువారం ఉదయం కర్నూలుకు వచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు శ్రీశైలం బ్యాక్ వాటర్‌ను పోతిరెడ్డిపాడు ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ, అవుకు, గాలేరు-నగరి, బానకచెర్ల రిజర్వాయర్ల నుంచి గండికోట వరకు మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌బీసీ కాలువను వెడల్పు చేస్తున్నామన్నారు. అలాగే కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని రైతులకు ఉపయోగపడుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-1, 2 పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ పనులు పూర్తి అయితే ఆయా జిల్లాల్లోని రైతులకు సాగునీరు, తాగునీటి అవసరాలు తీరనున్నాయని తెలిపారు. తెలుగుగంగ, తుంగభద్ర దిగువ కాలువల్లో చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయం, జలవనరులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో వున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.17,969 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల రంగ నిపుణులు నివేదికలు అందించారని చెప్పారు. ఈ కమిటీ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు నెలల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలు అందించాయన్నారు.
చెరువుల్లో పూడికతీతకు ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు - చెట్టు కార్యక్రమానికి సంబంధించి ప్రతి జిల్లాకు రూ.10 కోట్లను మంజూరు చేశామని మంత్రి దేవినేని చెప్పారు. ఇప్పటికే మొదటి విడతగా ప్రతి జిల్లాకు రూ.5 కోట్లను విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమం కింద చెరువుల్లో పూడికతీత పనులు చేపడతారన్నారు. చెరువుల్లో తీసిన పూడిక మట్టిని రైతులు ఉచితంగా తమ పొలాలకు తీసుకువెళ్లవచ్చన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అయితే ఆయా చెరువుల్లో ఎక్కువ మోతాదులో వర్షపు నీరు నిల్వ వుంటుందన్నారు.
పనులు చేపట్టని పాత ఏజెన్సీలపై క్లాజ్-61 ప్రయోగం
జిల్లాలో పలు ప్రాజెక్టుల కింద పెండింగ్‌లో వున్న పనులకు సంబంధించి వివిధ కారణాల వల్ల పనులు చేయలేక చేతులెత్తేసిన ఆయా ఏజెన్సీలే పనులను పూర్తి చేయాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వం జీఓ నెంబర్‌ను 22ను విడుదల చేసిందని చెప్పారు. ఒకవేళ చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు ఆయా ఏజెన్సీలు ముందుకు రాని పక్షంలో క్లాజ్-61ను ప్రయోగిస్తామని హెచ్చరించారు.
అలాగే వారి నుంచి అపరాధ రుసుము వసూలు చేయడంతో పాటు వెంటనే షార్ట్ టెండర్లను పిలిచి పనులను అప్పగిస్తామన్నారు. పెండింగ్‌లో వున్న పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో జిల్లాపరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఎస్‌పీ ఆకె రవికృష్ణ, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, సీఈ జీ చిట్టిబాబు, ఎస్‌ఈ కే శ్రీనివాసరావు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ సీఈ జలంధర్, ఎస్‌ఈ శ్యాంసుందరం, తెలుగుగంగ ఎస్‌ఈ సన్యాసినాయుడుతో పాటు ఈఈ, డీఈఈలు పాల్గొన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
Published Fri, Mar 6 2015 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM
Advertisement
Advertisement