గౌడ బండి కూత పెట్టేనా ?
- నేడు రైల్వే బడ్జెట్
- గుంతకల్లు డివిజన్‌కు ఈసారైనా న్యాయం జరిగేనా?
- అందరి చూపు పెండింగ్ ప్రాజెక్టులపైనే
గుంతకల్లు టౌన్ :రైల్వే బడ్జెట్ అనగానే సాధారణంగా ప్రజలకు అమితమైన ఆసక్తి ఉంటుంది. రైలు చార్జీలు పెరుగుతాయా లేక తగ్గుతాయా, తమ ప్రాంతానికి కొత్త ప్రాజెక్టులేవైనా వస్తాయని అని ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారి కూడా గుంతకల్లు డివిజన్ ప్రజల్లో అలాంటి ఆసక్తే నెలకొంది.
డివిజన్‌కు ఈసారైనా న్యాయం జరిగేనా అని ఎదురుచూస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ్ సొంత రాష్ట్రం కర్ణాటక కావడం, గుంతకల్లు డివిజన్ పరిధిలో ఆ రాష్ట్రంలోని ప్రాంతాలు కూడా కొన్ని ఉండటంతో ఈసారి డివిజన్‌కు ఎంతోకొంత మేలు జరిగే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులపైన అందరి దృష్టి ఉంది. వాటిని పూర్తి చేయడం కోసం ఏమేరకు నిధులు కేటాయిస్తారోనని అటు రైల్వే డివిజన్ అధికారులు, ఇటు ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో పలు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అప్పట్లో వాటికి నిధులు కేటాయించకపోవడంతో ముందుకు సాగలేదు. రూ.100 కోట్లతో గుంతకల్లులో విద్యుత్ లోకోషెడ్డు నిర్మాణం, నంచర్ల- మద్దికెర బైపాస్ లైన్, గుత్తి డీజిల్‌షెడ్డులో డబ్ల్యూడీజీ-4 పనులు, నంద్యాల- గాజులపల్లి, రామలింగపల్లి-నందిపల్లి, కృష్ణమ్మ కోన వద్ద క్రాసింగ్ స్టేషన్‌లు వంటివి పెండింగ్‌లో ఉండిపోయాయి.