Guntakal Division
-
గుంతకల్లు డివిజన్ జోన్‌గా అప్‌గ్రేడ్ చేయాలి
– ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ గుంతకల్లు : గుంతకల్లు రైల్వే డివిజన్‌ను రైల్వేజోన్‌గా అప్‌గ్రేడ్ చేయడానికి అన్ని విధాల అర్హతలున్నాయని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దక్షిణ భారతదేశానికే గుంతకల్లు సెంటర్ పాయింట్ అన్నారు. గుంతకల్లులో రైల్వే డీజిల్, ఎలక్ట్రికల్ ట్రాక్షన్ షెడ్, ట్రైనింగ్ సెంటర్లు తదితరాలున్నాయన్నారు. రైల్వేజోన్ ఏర్పాటుకు అవసరమైన స్థలం కూడా ఉందన్నారు. ఇప్పటికే రాయలసీమ బాగా వెనుకబడిన ప్రాంతమని, బలహీన వర్గాల పేదలు, నిరుద్యోగులు, స్కిల్డ్ లేబర్‌కు ఈ రైల్వే ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ఏపీ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏడీ కామాచార్యులు పాల్గొన్నారు. -
సీబీఐకి చిక్కిన రైల్వే సీనియర్ సెక్షన్ ఆఫీసర్
గుంతకల్లు (అనంతపురం జిల్లా) : పాత బిల్లుల మంజూరుకు రూ. 40వేలు లంచం తీసుకుంటూ గుంతకల్లు రైల్వే డీఆర్ఎమ్ కార్యాలయంలో సీనియర్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న తేజోరావు సీబీఐకి చిక్కాడు. గురువారం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు రైల్వే డీఆర్ఎమ్ కార్యాలయంపై దాడి చేసిన సీబీఐ అధికారులు అతన్ని పట్టుకున్నారు. గుంతకల్లులోని సంతోష్ ఎలక్ట్రికల్ దుకాణం యజమాని పాత బిల్లుల మంజూరు కోసం తేజోరావును సంప్రదించగా రూ.40వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో దుకాణ యజమాని సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. సీబీఐ అధికారులు పథకం వేసి దుకాణ యజమాని నుంచి లంచం తీసుకుంటుండగా తేజోరావును ప్రత్యక్షంగా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
అనంతపురం (గుంతకల్లు) : గోదావరి మహా పుష్కరాలను పురస్కరించుకుని ప్రయాణీకుల సౌకర్యార్థం గుంతకల్లు డివిజన్ మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు సీనియర్ డీసీఎం స్వామినాయక్ మంగళవారం తెలిపారు. డివిజన్ పరిధిలోని గుంతకల్లు, తిరుపతి, ధర్మవరం రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు ఆయన వివరించారు. ప్రత్యేక రైళ్ల వివరాలు : గుంతకల్లు-నరసాపురం మధ్య.. గుంతకల్లు-నరసాపురం మధ్య ప్రత్యేక రైలు(నెం.07843) గుంతకల్లు నుంచి మధ్యాహ్నం 01.00 గంటకు బయలుదేరి డోన్, నంద్యాల, మార్కాపురం, నరసరావుపేట, విజయవాడ, భీమవరం మీదుగా నరసాపురం స్టేషన్‌కు తెల్లవారుజామున 4.00 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు గుంతకల్లు నుంచి ఈనెల(జూలై) 13, 15, 17, 19, 21, 23, 25 వ తేదీల్లో బయలుదేరుతుందన్నారు. అదేవిధంగా నరసాపురం నుంచి గుంతకల్లు మధ్య నడిచే ప్రత్యేక రైలు(నెం.07844) నరసాపురం నుంచి ఉదయం 7.30 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.40 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుందన్నారు. ఈ రైలు నరసాపురం నుంచి జూలై 14,16, 18, 20, 22, 24, 26 వ తేదీల్లో నడుస్తుందన్నారు. ఈ రైలుకు 8 స్లీపర్, 2 జనరల్ కోచ్ బోగీలుంటాయన్నారు. ఈ రైలు మార్గమధ్యంలో మద్దికెర, పెండేకల్లు, బేతంచర్ల, బుగ్గానపల్లి, గిద్దలూరు, కంభం, దొనకొండ, కారంచేడు, కైకలూరు, పాలకొల్లు స్టేషన్లలో కూడా ఆగుతుందని ఆయన తెలియజేశారు. ధర్మవరం-విశాఖపట్నం మధ్య.. ధర్మవరం నుంచి విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు (నెం.07712) నడపనున్నట్లు తెలిపారు. ఈ రైలు ధర్మవరంలో రాత్రి 07.50 గంటలకు బయలుదేరి అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం మీదుగా విశాఖపట్నానికి సాయంత్రం 5.00 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైలు ధర్మవరం నుంచి ఈనెల 15,19,23, 27వతేదీల్లో నడుస్తుందన్నారు. పార్వతీపురం-ధర్మవరం మధ్య... పార్వతీపురం నుంచి ధర్మవరం మధ్య తిరిగే ప్రత్యేక రైలు (నెం.07710) సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరుతుంది. విశాఖపట్నం, అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, మర్కాపురం, నంద్యాల, డోన్, గుత్తి, అనంతపురం మీదుగా ధర్మవరానికి ఉదయం 6.20 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు జులై 14,18, 22,2 6వతేదీల్లో నడుస్తుందన్నారు. విశాఖపట్నం-ధర్మవరం మధ్య.. విశాఖపట్నం-ధర్మవరం- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు నడుస్తుందని సీనియర్ డీసీఎం స్వామినాయక్ తెలియజేశారు. ఈ రైలు (నెం.07849) విశాఖపట్నంలో వేకువజామున 02.00 గంటలకు బయలుదేరి విజయవాడ, నరసరావుపేట, మర్కాపురం, నంద్యాల, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం 9.50 గంటలకు చేరుతుంది. ఈ రైలు ఈనెల 21, 25 వ తేదీల్లో నడుస్తుందన్నారు. ధర్మవరం-విశాఖపట్నం (నం-07850) రైలు ధర్మవరంలో ఉదయం 7.45 గంటలకు బయలుదేరి అనంతపురం, గుత్తి, డోన్, నంద్యాల, మర్కాపురం, నరసరావుపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం మీదుగా విశాఖపట్నంకు తెల్లవారుజామున 02.40 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైలు ఈనెల 22, 26వ తేదీల్లో నడుస్తుందన్నారు. -
గుంతకల్ డివిజన్లో రైళ్లలో విస్తృత తనిఖీలు
అనంతపురం: అనంతపురం జిల్లాలోని గుంతకల్ డివిజన్లో పలు రైళ్లలో అధికారులు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుంతకల్-డోన్ సెక్షన్లో రెండు పాసింజర్ రైళ్లు.. గుంతకల్-బళ్లారి సెక్షన్లో రెండు పాసింజర్ రైళ్లలో సోదాలు జరిగాయి. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారి నుంచి అధికారులు భారీగా జరిమానాలు వసూలు చేశారు. రైల్వే ఆదాయం పెంచేందుకే ఇలాంటి తనిఖీలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
‘సైరన్ మోగేనా?
ఒకప్పుడు సైరన్ మోగిందంటే గుంతకల్లు ప్రాంతంలో కార్మికుల హడావుడి కనిపించేది. నిరంతర శ్రమజీవుల స్వేదంతో ఎన్నో పరిశ్రమలు ఇక్కడ నడిచాయి. వేల మందికి ఉపాధినిచ్చిన గుంతకల్లులోని పరిశ్రమలు రానురాను కొందరు స్వార్థపరుల చేతిలో శిథిలమయ్యాయి. కార్మికుల సందడితో దేదీప్యమానంగా వెలుగొందిన ఏసీఎస్ మిల్లు, స్లీపర్ ఫ్యాక్టరీ, బర్మసెల్ ఫ్యాక్టరీ, సబ్బుల తయారీ, సుమన్ కెమికల్ పరిశ్రమలు కాల చక్రంలో గతించాయి. ప్రస్తుతం ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటుతో పారిశ్రామిక వాడగా మరోసారి గుంతకల్లు వెలుగొందే అవకాశముంది. అయితే ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాల్సి ఉంది. గతించిన పరిశ్రమల స్థానంలో కొత్త వాటిని నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించేదిశలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీల ఏర్పాటుకు రాజకీయ పార్టీలు. ప్రజాసంఘాల నాయకులు ఉద్యమించాల్సిన తరుణమిదేనని ఘోసిస్తున్నారు. - గుంతకల్లు వెక్కిరిస్తున్న ఏసీఎస్ మిల్లు కడప, చిత్తూరు, అనంతపురం కర్నూలు జిల్లాలతోపాటు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, యాదిగిరి జిల్లాలకు అత్యంత సమీపంలో ఉండటం వల్ల నాటి ఆంగ్లేయులు గుంతకల్లు ప్రధాన కేంద్రంగా రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేశారు. వాణిజ్య, వ్యాపార కూడళ్లకు గుంతకల్లు డివిజన్ అనువుగా ఉండటం బాగా కలిసి వచ్చింది. స్వాతంత్య్రం అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త మాచారి సోమప్ప జవుళీ వ్యాపారానికి కేంద్ర బిందువుగా గుంతకల్లు పట్టణాన్ని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందిన ఏసీఎస్ (ఆంధ్ర కో-ఆపరేటివ్ సొసైటీ)మిల్లును గుంతకల్లులో ఏర్పాటు చేశారు. ఈ మిల్లులో అప్పట్లోనే సుమారు 1300 మంది కార్మికులు ప్రత్యక్షంగా పనిచేసేవారు. పలు కారణాల వల్ల ఈ మిల్లు 1991లో మూతపడింది. దీంతో 1300 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఒత్తిళ్లకు తరలిన స్లీపర్ ఫ్యాక్టరీ గుంతకల్లు శివారులోని తిమ్మనచర్ల రైల్వేస్టేషన్ సమీపంలో కర్ణాటక వాసులైన పాటిల్ కుటుంబీకులు రైల్వే స్లీపర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారు చేసిన స్లీపర్లు గుంతకల్లు రైల్వే డివిజన్ వ్యాప్తంగా సరఫరా అవుతుండేవి. ఈ ఫ్యాక్టరీ ద్వారా వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతుండేవి. స్థానిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ ఫ్యాక్టరీని యాజమాన్యం కర్నూలు జిల్లా మంత్రాలయం రోడ్డు స్టేషన్‌కు తరలించింది. దీంతో వందలాది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. కనుమరుగైన ఫిల్మ్ డిస్టిబ్యూటరీ కంపెనీలు చలనచిత్రాల పంపిణీలో సీడెడ్ కేంద్రంగా ఒకప్పుడు విరాజిల్లిన గుంతకల్లు ప్రస్తుతం తన ఉనికిని కోల్పోయింది. నాడు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన పంపిణీదారులు 1200 పైచిలుకు ఫిలిం డిస్ట్రిబ్యూటరీ కంపెనీల ద్వారా కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, బళ్లారి జిల్లాల్లోని థియేటర్లకు చలనచిత్రాలను సరఫరా చేస్తుండేవారు. మార్పులకనుగుణంగా చలనచిత్ర పంపిణీ ద్వారా కాకుండా కొనుగోలు వ్యవస్థ ప్రవేశించడంతో ఎగ్జిబిటర్లు నేరుగా చిత్రాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ వ్యవస్థ కారణంగా నాడు వందల్లో ఉన్న ఫిలిం డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు పట్టుమని పది కూడా లేని దుస్థితి నెలకొంది. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీలతో కళకళలాడిన రీగల్ థియేటర్, మస్తానయ్యదర్గా, హనుమేష్‌నగర్, మోమినాబాద్, పాతబస్టాండ్ ప్రాంతాలు వ్యాపార సముదాయాలుగా మారాయి. ఈ ఫిలిం కంపెనీలు మూతపడటంతో వీటిలో పని చేసే కార్మికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నారు. కనుమరుగైన బర్మాసెల్ పట్టణ శివారులోని బర్మశాలలో ఏర్పాటు చేసిన బర్మాసెల్ స్టీల్ కంపెనీ కనుమరుగైంది. ఫ్యాక్టరీ కాలగర్భంలో కలిసినా ఆ పేరుతో కాలనీ మాత్రం నేటికీ ఉంది. వీటితోపాటు గుంతకల్లు కేంద్రంగా ఏర్పాటైన లైఫ్‌బాయ్ సబ్బుల ఫ్యాక్టరీ, సుమన్ కెమికల్, ఆయిల్ ఫ్యాక్టరీలు తరలిపోయాయి. ఇలా ఫ్యాక్టరీలన్నీ ఒక్కొక్కటిగా మూతపడటంతో స్థ్థానిక యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోత్పోయి పొట్టకూటి కోసం చాలీచాలని వేతనాలతో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై తదితర నగరాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా ఈ ఏడాది జూన్ 2వతేదీ నుంచి అమలులోకి వచ్చిన రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నట్లు ప్రకటించాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు గుంతకల్లు రైల్వే జంక్షన్ ప్రాధాన్యతను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ఈ దిశగా స్థానిక రాజకీయ నేతలు ఉద్యమించాలని యువత కోరుతోంది. -
గౌడ బండి కూత పెట్టేనా ?
- నేడు రైల్వే బడ్జెట్ - గుంతకల్లు డివిజన్‌కు ఈసారైనా న్యాయం జరిగేనా? - అందరి చూపు పెండింగ్ ప్రాజెక్టులపైనే గుంతకల్లు టౌన్ :రైల్వే బడ్జెట్ అనగానే సాధారణంగా ప్రజలకు అమితమైన ఆసక్తి ఉంటుంది. రైలు చార్జీలు పెరుగుతాయా లేక తగ్గుతాయా, తమ ప్రాంతానికి కొత్త ప్రాజెక్టులేవైనా వస్తాయని అని ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారి కూడా గుంతకల్లు డివిజన్ ప్రజల్లో అలాంటి ఆసక్తే నెలకొంది. డివిజన్‌కు ఈసారైనా న్యాయం జరిగేనా అని ఎదురుచూస్తున్నారు. కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ్ సొంత రాష్ట్రం కర్ణాటక కావడం, గుంతకల్లు డివిజన్ పరిధిలో ఆ రాష్ట్రంలోని ప్రాంతాలు కూడా కొన్ని ఉండటంతో ఈసారి డివిజన్‌కు ఎంతోకొంత మేలు జరిగే అవకాశముందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులపైన అందరి దృష్టి ఉంది. వాటిని పూర్తి చేయడం కోసం ఏమేరకు నిధులు కేటాయిస్తారోనని అటు రైల్వే డివిజన్ అధికారులు, ఇటు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వ హయాంలో పలు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అప్పట్లో వాటికి నిధులు కేటాయించకపోవడంతో ముందుకు సాగలేదు. రూ.100 కోట్లతో గుంతకల్లులో విద్యుత్ లోకోషెడ్డు నిర్మాణం, నంచర్ల- మద్దికెర బైపాస్ లైన్, గుత్తి డీజిల్‌షెడ్డులో డబ్ల్యూడీజీ-4 పనులు, నంద్యాల- గాజులపల్లి, రామలింగపల్లి-నందిపల్లి, కృష్ణమ్మ కోన వద్ద క్రాసింగ్ స్టేషన్లు వంటివి పెండింగ్‌లో ఉండిపోయాయి.