‘సైరన్ మోగేనా?
ఒకప్పుడు సైరన్ మోగిందంటే గుంతకల్లు ప్రాంతంలో కార్మికుల హడావుడి కనిపించేది. నిరంతర శ్రమజీవుల స్వేదంతో ఎన్నో పరిశ్రమలు ఇక్కడ నడిచాయి. వేల మందికి ఉపాధినిచ్చిన గుంతకల్లులోని పరిశ్రమలు రానురాను కొందరు స్వార్థపరుల చేతిలో శిథిలమయ్యాయి. కార్మికుల సందడితో దేదీప్యమానంగా వెలుగొందిన ఏసీఎస్ మిల్లు, స్లీపర్ ఫ్యాక్టరీ, బర్మసెల్ ఫ్యాక్టరీ, సబ్బుల తయారీ, సుమన్ కెమికల్ పరిశ్రమలు కాల చక్రంలో గతించాయి. ప్రస్తుతం ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటుతో పారిశ్రామిక వాడగా మరోసారి గుంతకల్లు వెలుగొందే అవకాశముంది.
అయితే ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాల్సి ఉంది. గతించిన పరిశ్రమల స్థానంలో కొత్త వాటిని నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించేదిశలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీల ఏర్పాటుకు రాజకీయ పార్టీలు. ప్రజాసంఘాల నాయకులు ఉద్యమించాల్సిన తరుణమిదేనని ఘోసిస్తున్నారు. - గుంతకల్లు
వెక్కిరిస్తున్న ఏసీఎస్ మిల్లు
కడప, చిత్తూరు, అనంతపురం కర్నూలు జిల్లాలతోపాటు కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, యాదిగిరి జిల్లాలకు అత్యంత సమీపంలో ఉండటం వల్ల నాటి ఆంగ్లేయులు గుంతకల్లు ప్రధాన కేంద్రంగా రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేశారు. వాణిజ్య, వ్యాపార కూడళ్లకు గుంతకల్లు డివిజన్ అనువుగా ఉండటం బాగా కలిసి వచ్చింది. స్వాతంత్య్రం అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త మాచారి సోమప్ప జవుళీ వ్యాపారానికి కేంద్ర బిందువుగా గుంతకల్లు పట్టణాన్ని ఎంచుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆసియాలోనే అతిపెద్దదిగా పేరొందిన ఏసీఎస్ (ఆంధ్ర కో-ఆపరేటివ్ సొసైటీ)మిల్లును గుంతకల్లులో ఏర్పాటు చేశారు. ఈ మిల్లులో అప్పట్లోనే సుమారు 1300 మంది కార్మికులు ప్రత్యక్షంగా పనిచేసేవారు. పలు కారణాల వల్ల ఈ మిల్లు 1991లో మూతపడింది. దీంతో 1300 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి.
ఒత్తిళ్లకు తరలిన స్లీపర్ ఫ్యాక్టరీ
గుంతకల్లు శివారులోని తిమ్మనచర్ల రైల్వేస్టేషన్ సమీపంలో కర్ణాటక వాసులైన పాటిల్ కుటుంబీకులు రైల్వే స్లీపర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఇక్కడ తయారు చేసిన స్లీపర్లు గుంతకల్లు రైల్వే డివిజన్ వ్యాప్తంగా సరఫరా అవుతుండేవి. ఈ ఫ్యాక్టరీ ద్వారా వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతుండేవి. స్థానిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ ఫ్యాక్టరీని యాజమాన్యం కర్నూలు జిల్లా మంత్రాలయం రోడ్డు స్టేషన్‌కు తరలించింది. దీంతో వందలాది కార్మికులు ఉపాధిని కోల్పోయారు.
కనుమరుగైన ఫిల్మ్ డిస్టిబ్యూటరీ కంపెనీలు
చలనచిత్రాల పంపిణీలో సీడెడ్ కేంద్రంగా ఒకప్పుడు విరాజిల్లిన గుంతకల్లు ప్రస్తుతం తన ఉనికిని కోల్పోయింది. నాడు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన పంపిణీదారులు 1200 పైచిలుకు ఫిలిం డిస్ట్రిబ్యూటరీ కంపెనీల ద్వారా కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, బళ్లారి జిల్లాల్లోని థియేటర్లకు చలనచిత్రాలను సరఫరా చేస్తుండేవారు.
మార్పులకనుగుణంగా చలనచిత్ర పంపిణీ ద్వారా కాకుండా కొనుగోలు వ్యవస్థ ప్రవేశించడంతో ఎగ్జిబిటర్లు నేరుగా చిత్రాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఈ వ్యవస్థ కారణంగా నాడు వందల్లో ఉన్న ఫిలిం డిస్ట్రిబ్యూటరీ కంపెనీలు పట్టుమని పది కూడా లేని దుస్థితి నెలకొంది. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీలతో కళకళలాడిన రీగల్ థియేటర్, మస్తానయ్యదర్గా, హనుమేష్‌నగర్, మోమినాబాద్, పాతబస్టాండ్ ప్రాంతాలు వ్యాపార సముదాయాలుగా మారాయి. ఈ ఫిలిం కంపెనీలు మూతపడటంతో వీటిలో పని చేసే కార్మికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నారు.
కనుమరుగైన బర్మాసెల్
పట్టణ శివారులోని బర్మశాలలో ఏర్పాటు చేసిన బర్మాసెల్ స్టీల్ కంపెనీ కనుమరుగైంది. ఫ్యాక్టరీ కాలగర్భంలో కలిసినా ఆ పేరుతో కాలనీ మాత్రం నేటికీ ఉంది. వీటితోపాటు గుంతకల్లు కేంద్రంగా ఏర్పాటైన లైఫ్‌బాయ్ సబ్బుల ఫ్యాక్టరీ, సుమన్ కెమికల్, ఆయిల్ ఫ్యాక్టరీలు తరలిపోయాయి. ఇలా ఫ్యాక్టరీలన్నీ ఒక్కొక్కటిగా మూతపడటంతో స్థ్థానిక యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోత్పోయి పొట్టకూటి కోసం చాలీచాలని వేతనాలతో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ముంబై తదితర నగరాల్లో కాలం వెళ్లదీస్తున్నారు.
కాగా ఈ ఏడాది జూన్ 2వతేదీ నుంచి అమలులోకి వచ్చిన రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్నట్లు ప్రకటించాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు గుంతకల్లు రైల్వే జంక్షన్ ప్రాధాన్యతను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ఈ దిశగా స్థానిక రాజకీయ నేతలు ఉద్యమించాలని యువత కోరుతోంది.