గద్వాల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరంగా పూర్తిచేయడంతో పాటు 14 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ ఆంధ్ర నేతల పాలనలో ఇన్నాళ్లూ ప్రాజెక్టులను పూర్తిచేసుకోలేకపోయామన్నారు.
ప్రభుత్వం రాగానే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కృషిచేస్తామన్నారు. గురువారం గద్వాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రెండునదుల మధ్య నడిగడ్డలో కరువు ఉందంటే పాలకుల చేతగానితనమే కారణమన్నారు. ఇది ఆంధ్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని కేసీఆర్ అన్నారు. 2002లో ఆర్డీఎస్ సమస్యపై తాను అలంపూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేశానని, అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసి జూరాల లింక్ కాల్వ మంజూరయ్యేలా చేశానని ఆయన గుర్తుచేశారు. 12 ఏళ్లు గడచినా ఆర్డీఎస్ చివరి భూములకు నీళ్లు వెళ్లడం లేదని, మనరాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాదిలోగా ఆర్డీఎస్ చివరి భూములకు నీళ్లందించేలా చేస్తామన్నారు.
గుర్రంగడ్డ వద్ద కృష్ణానదిపై మరో ప్రాజెక్టును చేపట్టి వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతాలకు సాగునీటిని అందిస్తామన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతోపాటు షాద్‌నగర్ ప్రాంతంలోని లక్ష్మింపల్లి వద్ద ఎత్తయిన ప్రాంతంలో రిజర్వాయర్‌ను నిర్మించి కృష్ణానది జలాలను లక్షలాది ఎకరాలకు అందిస్తామన్నారు. ఆర్డీఎస్ తూంలను పగులగొడుతామని ైబె రెడ్డి ప్రకటిస్తే తాను సుంకేసుల సంగతి చూస్తానని హెచ్చరించానన్నారు. రాయలసీమ ప్రాంతానికి పక్కనే ఉన్న గద్వాల ప్రాంతం కొన్ని పల్లెల్లో ఇంకా ఫ్యాక్షనిజం ఉందని, ఇక దానికి జోలికి వెళ్లకుండా అందరు ప్రేమతో ఉండి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
బూట్లు తూడిచే నాయకుల వల్లే..
తాను పాలమూరు ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రం రావడం ఈ జిల్లా ప్రజలకు గర్వకారణమన్నారు. ఆంధ్ర మాయా మశ్చింధ్రుల బూట్లు తూడిచే నాయకులు ఉన్నారన్నారు. వారివల్లే సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా ఇంకా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణమేమిటన్నారు. ‘కృష్ణానది బ్రిడ్జిపై తాను ఆగి కృష్ణమ్మకు మొక్కి వచ్చాను. ఇన్నాళ్లూ కృష్ణమ్మ కరుణించింది. ఇక మన ప్రభుత్వం, మన పాలనలో కృష్ణమ్మ నీళ్లు పాలమూరును పచ్చగా మారుస్తాయని’ అని కేసీఆర్ అన్నారు.
గద్వాల అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి
సభా వేదికపై నుంచే గద్వాల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణమోహన్‌రెడ్డి, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా మారూ. చైర్మన్ బీఎస్ కేశవ్‌ను కేసీఆర్ ప్రకటించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎంపీ మందా జగన్నాథం, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, మారూ. ఎమ్మెల్యే గట్టు భీముడు, డీసీసీబీ మారూ. చైర్మన్ గట్టు తిమ్మప్ప, నాయకులు బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఉత్తనూరు తిరుమల్‌రెడ్డి, వైండింగ్ రాములు, నాగశంకర్, తదితరులు పాల్గొన్నారు.
పెద్దపీట
Published Fri, Mar 7 2014 4:14 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement
Advertisement