పాలమూరు అభివృద్ధికి పెద్దపీట | Palamuru songs in the development | Sakshi
Sakshi News home page

పాలమూరు అభివృద్ధికి పెద్దపీట

Published Wed, Aug 6 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

Palamuru songs in the development

శాంతినగర్/మానవపాడు: వచ్చే ఐదేళ్లలో పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌నాటికి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి తద్వారా ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపడతామని వెల్లడించారు. మంగళవారం ఆయన వడ్డేపల్లి, మానపాడు మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.
 
  ఈ సందర్భంగా శాంతినగర్‌లో మాజీ ఎంపీ మందా జగన్నాథం అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో మంత్రి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత కూడా సీమాంధ్రుల శని మాత్రం వీడటం లేదన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టు కింద ఉన్న 87,500 ఎకరాలకు సాగునీరందిస్తామని, ఆనకట్టదగ్గర సీఆర్‌పీఎఫ్, కేంద్ర బలగాలను మోహరింపజేసైనా ఆనకట్ట అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
 
 బచావత్ తీర్పు ప్రకారం ఆర్డీఎస్‌ను నీటివాటాను అలంపూర్ వాసులకు అందించేందుకు సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా తుమ్మిళ్ల గ్రామం వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తే 26వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉందని ప్రముఖులు తెలిపారని, ఆ పనుల నివేదికను తయారుచేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. మరోసారి పాలమూరు జిల్లాకు వచ్చి మూడురోజులపాటు ఇక్కడే ఉండి పర్యటించి ప్రత్యేకమైనా బడ్జెట్ కేటాయించి పాల మూరుకు ఉన్న వలస జిల్లా పేరును రూపుమాపుతామని పునరుద్ఘాటించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
 
 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
 అలంపూర్ చౌరస్తా నుంచి అయిజ వరకు బీటీ డబుల్‌రోడ్డు నిర్మాణానికి రూ.38 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. పూర్తిస్థాయిలో   శాంతినగర్‌కు చేరుకున్న మంత్రి హరీశ్వర్‌రావు ముందుగా రామాలయ చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. శాంతినగర్ నుంచి అయిజ మం డలం తుమ్మలపల్లి వరకు రూ.22.32 కోట్లతో మంజూరైన ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులకు శంకుస్థాపనచేశారు.
 
 టీఆర్‌ఎస్‌లో చేరిక..
 వడ్డేపల్లి మండల జెట్పీటీసీ సభ్యురాలు వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ ఎన్.సుజాతమ్మ, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు, మరో 13 మంది ఎంపీటీసీ సభ్యులు, 14 మంది సర్పంచ్‌లు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
 
 కార్యక్రమంలో జెడ్పీ చైరపర్సన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వలబాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా, మందా శ్రీనాథ్, జిల్లాలీగల్‌సెల్ కన్వీనర్ విష్ణువ ర్దన్‌రెడ్డి, గద్వాల ఇన్‌చార్జి కృష్ణమోహన్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గట్టు తిమ్మప్ప, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, కేశవ్  తదితరులు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement