'మా వాటా కిందే లెక్కేసుకోండి' | srisailam power only for drinking water, says harish rao | Sakshi
Sakshi News home page

'మా వాటా కిందే లెక్కేసుకోండి'

Published Sun, Oct 26 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

'మా వాటా కిందే లెక్కేసుకోండి'

'మా వాటా కిందే లెక్కేసుకోండి'

సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కరెంటు ఉత్పత్తి కోసం వాడుకుంటున్న నీటిని తెలంగాణ వాటా కింద లెక్కేసినా అభ్యంతరం లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రస్తుత ప్రాజెక్టులు, వాటి కేటాయింపులు, నిర్వహణ వంటి అంశాలన్నీ తెలంగాణ అవసరాలను పట్టించుకోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయించారని అన్నారు. కేవలం సీమాంధ్ర కోణం నుంచి ఆలోచించి తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి అవసరాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో కృష్ణా నీటి పంపిణీ, వినియోగంపై పునఃసమీక్ష జరగాలన్న తమ వాదనను ట్రిబ్యునల్ అంగీకరించిందని ఆ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.
 
 అప్పటిదాకా పంటలు ఎండిపోకుండా ఉండడానికి 834 అడుగుల దాకా నీటిని వాడుకునే హక్కును తెలంగాణకు ఇవ్వాలని కోరారు. ‘‘రైతుల పొలాలు ఎండిపోకుండా చూసేందుకే శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటితో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. మేం కరెంటు కోసం వాడుకునే నీటిని మా వాటా కిందే లెక్కేసినా అభ్యంతరం లేదు. మా పంటలు ఎండిపోవాలనే దురుద్దేశంతో, ద్వేషభావంతో తప్పుడు ప్రచారం చేసి మా రైతుల పొట్టకొట్టొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో రోజుకు 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కనీసం ఐదారు గంటలైనా కరెంటు ఇవ్వగలుగుతున్నామని, ఉత్పత్తిని ఆపేస్తే వ్యవసాయానికి కనీసం నాలుగు గంటలు కూడా ఇవ్వలేమని చెప్పారు. కొందరు శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని, తాగునీటికి, సాగునీటికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ అర్థరహిత, అవగాహన లేకుండా వాదిస్తున్నారని మండిపడ్డారు. కొద్దిపాటి నీటితో కరెంటు ఉత్పత్తి చేస్తూ తెలంగాణలోని 20 లక్షల మోటార్లకు కరెంటు ఇస్తున్నామని హరీశ్‌రావు వివరించారు.
 
 తెలంగాణలో అరడజను దొంగలు...

 వాస్తవాలను దాచిపెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని హరీశ్ విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన 54 శాతం కరెంటు వాటా ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిస్తే... తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘‘కృష్ణపట్నం కరెంటు ఇవ్వడం లేదు. హిందూజాలో మన హక్కు ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించరు? న్యాయమైన తెలంగాణ వాటా కోసం చంద్రబాబును ఎందుకు నిలదీయరు? చంద్రబాబును చూస్తే వారి లాగులెందుకు తడుస్తున్నాయి’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. చంద్రబాబు వేసే బిస్కట్లకు ఇప్పటిదాకా తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చారని విమర్శించారు. ఆలీబాబా అరడజను దొంగల్లాగా, చంద్రబాబుకు తెలంగాణలో వంతపాడే అర డజను దొంగలు జమయ్యారని మండిపడ్డారు.
 
 తెలంగాణ ప్రజలకు ఇప్పటిదాకా చేసిన నయవంచనను దాచిపెట్టి కాంగ్రెస్ నాయకులు కూడా టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు నిల్వలున్న తెలంగాణలో విద్యుత్ కేంద్రం పెట్టకుండా రాయలసీమలో పెడుతుంటే జానారెడ్డి, డీఎస్, పొన్నాల లక్ష్మయ్య వంటివారెందుకు ప్రశ్నించలేదని అడిగారు. కాంగ్రెస్ నేతలు అప్పుడే మాట్లాడితే తెలంగాణకు ఇప్పుడీ దుస్థితి వచ్చేదా అని నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ 58 ఏళ్లలో చేయలేని పనిని నాలుగు నెలల్లోనే ఎలా చేస్తారన్నారు. శ్రీశైలంలో తెలంగాణకు 97 టీఎంసీలు రావాల్సి ఉంటే ఆంధ్రాకు 34 టీఎంసీల వాటా మాత్రమే ఉందని వివరించారు. తెలంగాణకు నీటి కేటాయింపులు ఉన్నా కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఎస్‌ఎల్బీసీ పూర్తికాక పోవడంతో వాడుకోవడం లేదని చెప్పారు. నీటి కేటాయింపులు లేకున్నా పులిచింతల, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులతో ఇప్పటిదాకా నీటిని దొంగతనంగా వాడుకున్నారని ఆరోపించారు. ‘‘ఈ రాష్టంలో ఉంటూ, ఇక్కడి తిండి తింటూ, ఇక్కడి ప్రజాప్రతినిధులుగా ఉంటూ పరాయి రాష్ట్రం పాట పాడే నాయకులు ఉండటం తెలంగాణ దురదృష్టం. రాజకీయంగా కొట్లాడుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకమయ్యే సంస్కృతి తెలంగాణకు లేదు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను దక్కించుకోవడంతోపాటు పెంచుకోవడానికి కొట్లాడుతూనే ఉంటాం. సుప్రీంకోర్టులో చంద్రబాబు బండారాన్ని బయటపెడ్తాం. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎవరి పక్షాన ఉంటారో తేల్చుకోవాలి’’ అని మంత్రి హరీశ్ సవాల్ చేశారు.
 
 మా వాటా మాకు కావాలి

 శ్రీశైలం జలాలతో ఉత్పత్తి చేస్తున్న కరెంటును సాగునీటి అవసరాల కోసమే వాడుతున్నట్లు హరీశ్ వెల్లడించారు. ఈ విద్యుత్‌పై ఆధారపడే పంపుసెట్ల ద్వారా తెలంగాణలో దాదాపు 40 లక్షల ఎకరాల్లో పంట సాగవుతోందని చెప్పారు. జలాశయంలోని నీటిని సాగుకు వాడుకుంటున్నట్టుగానే భావించి 854 అడుగుల నుంచి 834 అడుగుల దాకా వాడుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించాలని కోరారు. శ్రీశైలంలో ఉత్పత్తిని నిలిపేస్తే 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేదని కొట్టిపారేశారు. 700 మెగావాట్ల విద్యుత్‌ను శ్రీశైలం నుంచి ఆపేసి కేవలం 300 మెగావాట్లు మాత్రమే తీసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. ‘‘మాకు కావాల్సింది మీ దయాదాక్షిణ్యాలు కాదు. మా హక్కు ప్రకారం 54 శాతం కరెంటు కావాలి. కృష్ణపట్నంతో పాటు అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మా వాటా మాకు రావాలి. ఇందుకు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం’’ అని హరీశ్ హెచ్చరించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement