srisailam power
-
విద్యుత్‌పై ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం
-
తక్షణం జోక్యం చేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలో నీటి వినియోగం, విద్యుదుత్పత్తి వివాదంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలసి విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం ఆయన ఉమాభారతితో భేటీ కానున్నారు. తక్షణమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి ఈ వివాదానికి పరిష్కారం చూపాలని విన్నవించనున్నారు. అలాగే కృష్ణా జలాల వినియోగంలో ఏపీ సర్కారు పాల్పడుతున్న ఉల్లంఘనలపై, శ్రీశైలం వద్ద విద్యుదుత్పత్తి ఆపేయాలన్న కృష్ణా బోర్డు నిర్ణయాన్ని తప్పుబడుతూ ఫిర్యాదులు చేయనున్నారు. దీంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరగనున్నందున బోర్డు నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని కోరనున్నారు. ‘రాష్ట్ర అధికారుల బృందంతో కలసి ఢిల్లీ వెళ్తున్నా. రాష్ట్రంలో పంటలను రక్షించాలంటే విద్యుత్ అత్యవసరమన్న విషయాన్ని ఉమాభారతికి వివరిస్తాం’ అని ఢిల్లీకి బయలుదేరే ముందు మంత్రి హరీశ్‌రావు మీడియాకు స్పష్టం చేశారు. శ్రీశైలం ఎడమగట్టున విద్యుదుత్పత్తిని ఆదివారంతో నిలిపేయాలని, ఆలోగా గరిష్టంగా 3 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని కృష్ణాబోర్డు గత నెల 31న రాష్ట్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేసినా దిగువన నాగార్జునసాగర్‌లో ఉత్పత్తి చేయడం వల్ల భవిష్యత్తులో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని సర్కారు భావిస్తోంది. సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ శ్రీశైలంలో ఉత్పత్తిని కొనసాగించాల్సి ఉంటుంది. ఇందుకు వీలుగా ప్రభుత్వం చెబుతున్న గత జీవోల మేరకు ప్రాజెక్టులో 834 అడుగుల వరకు నీటి వినియోగానికి వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బోర్డు ఉత్తర్వులు అమలుకాకుండా నిలుపుదల చేయించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. దీనిపై కోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలించిన ప్రభుత్వం ముందుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అపెక్స్ కౌన్సిల్ జోక్యాన్ని కోరాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కౌన్సిల్ చైర్మన్‌గా ఉండే కేంద్ర మంత్రి ఉమాభారతిని కలసి పరిష్కారం కోరాలని, సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆయన ఆదేశాల మేరకే మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు. నీటి కేటాయింపులపై ఎలాంటి హక్కులు లేని బోర్డు, తన పరిధిని దాటి నిర్ణయం తీసుకుందని ఉమాభారతికి ఆయన వివరించనున్నారు. అలాగే ఏపీ ఉల్లంఘనలు, నీటివాడకం, శ్రీశైలంలో నీటి మట్టాలపై గతంలో జరిగిన ఉల్లంఘనలపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు గణాంకాలతో కూడిన నివేదికలను ఆయన తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. వీలైతే ఆయన కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయెల్‌ను కలిసి ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ వాటాపై విన్నవించే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి. -
కోటాపైనా కొట్లాట!
శ్రీశైలం విద్యుత్‌పై ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం సాక్షి, హైదరాబాద్:ఆ మూడు టీఎంసీలతో రెండు రాష్ట్రాల మధ్య మరో చిచ్చు రేగింది! కృష్ణా బోర్డు ఆదేశాలను శిరసావహిస్తూ మూడు టీఎంసీలు వాడుకుని శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని నిలిపేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినప్పటికీ అది కూడా వివాదంగా మారింది. సోమవారం ఉదయం వరకు మూడు టీఎంసీల వాడకం పూర్తవుతుందని పేర్కొంటూ ఆ తర్వాతే ఉత్పత్తిని నిలిపేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. మరోవైపు ఆదివారం సాయంత్రానికే మూడు టీఎంసీల కోటాను తెలంగాణ వాడుకున్నదని, అయినా విద్యుదుత్పత్తిని కొనసాగించడాన్ని ఏపీ సర్కారు తప్పుబడుతోంది. ఆదివారం వరకే ఉత్పత్తి చేయాలన్న బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడుతోంది. దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఆచితూచి వ్యవహరిస్తున్న తెలంగాణ బోర్డు ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయని తప్పుబట్టిన రాష్ట్ర సర్కారు విద్యుదుత్పత్తి విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ వ్యవహారంపై ఇంధన శాఖ, జెన్కో అధికారులతో పలుమార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయపోరాటం చేయాలని లేకపోతే కేంద్రం జోక్యం కోరాలని భావిస్తూనే.. బోర్డు ఆదేశాలను గౌరవించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. అదే సమయంలో విద్యుత్ సంక్షోభం తీవ్రం కాకుండా శ్రీశైలం దిగువన నాగార్జునసాగర్‌లో ఉత్పత్తి చేపట్టేలా జెన్కో జాగ్రత్తలు తీసుకుంటోంది. శ్రీశైలం ఎడమ గట్టున విద్యుదుత్పత్తిని ఆదివారం నాటికే పరిమితం చేయాలని, అప్పటివరకు గరిష్టంగా 3 టీఎంసీల నీటినే వాడుకోవాలని గత నెల 31న కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో 5.17 మిలియన్ యూనిట్ల మేర ఉత్పత్తి జరిగింది. అంతకుముందు అక్టోబర్ 31న 11.94 మిలియన్ యూనిట్లు, 30వ తేదీన 5.5 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు తెలంగాణ జెన్కో వెల్లడించింది. బోర్డు ఆదేశాలు అందిన తర్వాత శనివారం నాటికి 1.6 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలో డిమాండ్ తగ్గిపోవడంతో ఆ శనివారం రాత్రి నుంచే శ్రీశైలంలో ఉత్పత్తిని కుదించారు. అందుకే బోర్డు నిర్దేశించిన మూడు టీఎంసీల నీటి కోటాను వాడుకునేందుకు సోమవారం ఉదయం వరకు ఉత్పత్తి చేపట్టాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. శ్రీశైలంలో ఉత్పత్తి నిలిపేస్తే విద్యుత్ కొరత రెట్టింపుకానున్న దృష్ట్యా.. వారం రోజుల విరామం తర్వాత సాగర్‌లోనూ శనివారం రాత్రి నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. ఆదివారం ఉదయానికల్లా 2.25 మిలియన్ యూనిట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అందించినట్లు సమాచారం. సాగర్ నుంచి రోజుకు దాదాపు 14 వేల నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి వాడుకోవాలని జెన్కో భావిస్తోంది. అయితే ఈ నీటితో దిగువన పులిచింతల ముంపు గ్రామాలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పులిచింతలలో నీటిమట్టం ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరడంతో అప్రమత్తమైన అధికారులు ఒక్కసారిగా 93 వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేయటంతో ముంపు ప్రమాదం తప్పింది. తాజాగా విద్యుదుత్పత్తి కారణంగా అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ మరోవైపు శ్రీశైలం నుంచి ఆదివారం సాయంత్రం వరకే 2.96 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకున్నదని ఏపీ సర్కారు లెక్కలేసింది. సాయంత్రం 6 గంటల సమయంలో 540 మెగావాట్లను ఉత్పత్తి చేస్తూ 28,252 క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నట్లు ఏపీ వర్గాలు తేల్చాయి. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు లెక్కిస్తే 48 గంటల్లో 2.96 టీఎంసీల నీటిని వినియోగించినట్లు ఏపీ నిర్ధారించింది. ప్రాజెక్టులో నీటి నిల్వ ఆధారంగా అధికారులు ఈ గణాంకాలను రూపొందించారు. తుంగభద్ర నుంచి ప్రాజెక్టులోకి 8,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆదివారం సాయంత్రం ప్రాజెక్టులో 857.40 అడుగుల నీటిమట్టం ఉండగా.. 98.47 టీఎంసీల నీటినిల్వ ఉంది. సోమవారం ఉదయం 6 గంటల తర్వాత కూడా విద్యుదుత్పత్తిని తెలంగాణ కొనసాగిస్తే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. -
కృష్ణా బోర్డు నిర్ణయంపై ఏం చేద్దాం?
అపెక్స్కా లేక కోర్టుకా.. తేల్చుకోలేని తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశంలో సుదీర్ఘ చర్చ అపెక్స్ కౌన్సిల్కువెళ్లడమే సరైందని సూచించిన న్యాయవాదులు శ్రీశైలం నీటి వాడకంపై నేటితో ముగియనున్న గడువు వివాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్న మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపేయాలని కృష్ణా బోర్డు ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ర్ట ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. బోర్డు నిర్ణయంపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయంలో కొంత సందిగ్ధంలో పడింది. దీనిపై అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లడమా లేక నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్డు గడప తొక్కడమా అన్న మీమాంసలో ప్రభుత్వం పడినట్లు సమాచారం. ఈ వివాదాన్ని కోర్టు పరిధిలోనే తేల్చుకోవాలని సర్కారు తొలుత భావించినప్పటికీ, న్యాయవాదుల సూచనల మేరకు ఈ పంచాయతీని అపెక్స్ కౌన్సిల్ ముందు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ర్ట విభజన చట్టంలో ఇదే విషయాన్ని పేర్కొన్నట్లు గుర్తు చేస్తున్నాయి. అయితే సీఎం కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు నీటిపారుదల శాఖ అధికారులు ఈ అంశంపై పెదవి విప్పడం లేదు. కృష్ణా బోర్డు ఆదేశాల నేపథ్యంలో శనివారం కూడా కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు ఈ భేటీలో పాల్గొన్నారు. బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేసే అంశంపై 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చిం చారు. సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయిం చినా ముందుగా అపెక్స్ కౌన్సిల్లో తేల్చుకోవాలని సూచించే అవకాశాలున్నాయని, అక్కడ తేలకుంటేనే తాము జోక్యం చేసుకుంటామని కోర్టులు పేర్కొంటాయని న్యాయవాదులు వివరించినట్లు తెలిసింది. ఈ దృష్ట్యా అపెక్స్ కౌన్సిల్‌కే వెళ్లాలని నిర్ధారించినట్లు తెలిసింది. శ్రీశైలంలో ఎంత వాడుకోవాలి? శ్రీశైలం ఎడమ గట్టున విద్యుదుత్పత్తిని ఆది వారం నాటికే పరిమితం చేయాలంటూ గడువు విధించిన బోర్డు, ఆ తర్వాత నీటి వినియోగం ఎలా ఉండాలి, విద్యుదుత్పత్తి అవసరాలకు నీటిని ఎక్కడి నుంచి వినియోగించుకోవాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. నాగార్జునసాగర్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడంతో.. ఇక్కడ విద్యుదుత్పత్తికి బోర్డు ఎలాంటి ఆంక్షలు పెట్టనట్లుగానే భావించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాగర్‌లో కొంత మేర ఉత్పత్తి జరుగుతున్నా, శ్రీశైలంలో ఉత్పత్తి నిలిపివేస్తే సాగర్ జలాల్లో నీటి వినియోగం పెరుగుతుంది. ఫలితంగా పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాలపై ప్రభావం పడే అవకాశముంది. ఇప్పటికే పులిచింతలలో 11 టీఎంసీల మేర నిల్వ ఉన్నందువల్లే నల్గొండ జిల్లాలోని అడ్లూరు, వెలటూరు సహా మరో రెండు గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంది. ఈ అంశాలపైనా సీఎం చర్చించినట్లు సమాచారం. బోర్డుకు ఏపీ ఫిర్యాదు! కృష్ణాబోర్డు ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం పాటించకుండా విద్యుదుత్పత్తి కొనసాగిస్తే బోర్డుకు ఫిర్యా దు చేయాలని ఏపీ అధికారులు నిర్ణయిం చారు. 3 టీఎంసీలకు మించి నీటిని వాడుకున్నా, ఆదివారం తర్వాత విద్యుదుత్పత్తి చేసినా.. ఉన్నతాధికారులకు సమాచారమం దించాలని కర్నూలు చీఫ్ ఇంజనీర్‌కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. పెరిగిన నీటి వాడకం శ్రీశైలం ప్రాజెక్టులో శనివారం సాయంత్రం దాటాక నీటి వాడకాన్ని రాష్ర్ట ప్రభుత్వం మరింత పెంచింది. శుక్రవారం ప్రాజెక్టులో 27,021 క్యూసెక్కుల నీటితో 720 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. సాయంత్రం తర్వాత నీటి విడుదలను 44,497 క్యూసెక్కులకు పెంచింది. విద్యుదుత్పత్తితో ప్రాజెక్టులో శుక్రవారం 858.50 అడుగుల నీటి మట్టానికి 101.43 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, అది శనివారానికి 857.90 అడుగులకు చేరి నీటి నిల్వ 99.76 టీఎంసీలుగా ఉంది. ఈ లెక్కన సుమారు 1.67 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకున్నది. ఆదివారం వరకు గరిష్ఠంగా 3 టీఎంసీలే వాడుకోవాలన్న బోర్డు నిర్ణయం మేరకు మరో 1.33 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించాల్సి ఉంది. ఏపీ నీటి వాడకంపై ఫిర్యాదు! కృష్ణా బోర్డు నిర్ణయంపై శుక్రవారం రాత్రే లేఖ ద్వారా తమ నిరసనను తెలిపిన రాష్ర్ట ప్రభుత్వం.. అందులో మూడు అంశాల విషయంలో ఏపీపై ఫిర్యాదు చేసింది. కేంద్ర జలసంఘం నియమనిబంధనల మేరకు శ్రీశైలం కుడి కెనాల్, కేసీ కెనాల్‌కు జూలై నుంచి అక్టోబర్ వరకు మాత్రమే నీటిని తీసుకెళ్లేందుకు అనుమతించారని, అయితే ఏపీ దీన్ని ఉల్లంఘించి నీటిని తరలిస్తోందని బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీన్ని వెంటనే అడ్డుకోవాలని కోరినట్లు సమాచారం. అలాగే తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలంలో నీటి వినియోగాన్ని ఆపాలంటున్న ఏపీ... అసలు నీటి కేటాయింపులే లేని హంద్రినీవాకు మాత్రం నీటిని తరలిస్తోందని, అక్కడ పంప్‌హౌస్‌లు ఇప్పటికీ పనిచేస్తున్నాయని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో పాటే పోతిరెడ్డిపాడు వాస్తవ కేటాయింపులను అతిక్రమించి ఇప్పటికే అధికారికంగా 62 టీఎంసీల మేర నీటిని తరలించిందన్న విషయాన్ని కూడా గట్టిగా చెప్పినట్లు పేర్కొన్నాయి. కేంద్రం దృష్టికి వివాదం కృష్ణా నదీ జలాల వివాదాన్ని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి హరీశ్ ఇప్పటికే ఈ అంశంపై ఆమె అపాయింట్మెంట్ కోరారు. ఇది ఖరారైన వెంటనే ఢిల్లీకి వెళ్లి ఆమెతో భేటీ అవుతారు. ప్రధానంగా ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై హరీశ్ ఫిర్యాదు చేయనున్నారు. బోర్డు నిర్ణయంపై అభ్యంతరాలను కూడా వివరించనున్నారు. కేంద్ర మంత్రితో భేటీకి సంబంధించిన నోట్‌ను శనివారం సాయంత్రానికే అధికారులు సిద్ధం చేశారు. -
శ్రీశైలం ఆపితే అధోగతే!
తెలంగాణలో రెట్టింపు కానున్న విద్యుత్ కొరత ఇప్పటికే రోజుకు 20 మిలియన్ యూనిట్ల లోటు శ్రీశైలంలో ఉత్పత్తి ఆగితే మరో 10 మిలియన్ యూనిట్ల భారం అంత మొత్తం కొనుగోలు చేయాలంటే సర్కారుకు తడిసిమోపెడే ప్రతిరోజు దాదాపు రూ.8 కోట్ల భారం పరిశ్రమలకు, రైతులకు రానున్నది గడ్డుకాలమే సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే తెలంగాణలో కరెంట్ సంక్షోభం మళ్లీ మొదటికి వస్తుందేమోనన్న భావన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. శ్రీశైలంలో ఉత్పత్తి ఆపితే ఇప్పుడున్న విద్యుత్ కొరత రెండింతలు కానుంది. ఇటీవల కురిసిన వర్షాలు.. ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలు చేతికి రావటంతో వారం రోజులుగా తెలంగాణలో విద్యుత్ డిమాండ్ కొంతమేరకు తగ్గింది. అయినా ప్రతిరోజు 10 మిలియన్ యూనిట్ల నుంచి 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉండడం గమనార్హం. అక్టోబర్‌లో రాష్ట్రంలో ఒకరోజు విద్యుత్ డిమాండ్ సగటున 160.8 యూనిట్లుగా నమోదైంది. సరఫరా గణాంకాలు పరిశీలిస్తే జెన్కో రోజుకు 140 యూనిట్లు అందించింది. అంటే రోజుకు దాదాపు 20 మిలియన్ యూనిట్ల కొరత ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం రాష్ట్రంలో 137 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే.. 127 మిలియన్ యూనిట్ల సరఫరా జరిగింది. పది మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలంలో ఉత్పత్తి నిలిపివేస్తే రోజుకు సగటున 10 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి తగ్గిపోతుంది. ఆ విద్యుత్‌ను కొనుగోలు చేయాలంటే సర్కారుకు ఆర్థికంగా భారం కానుంది. శ్రీశైలం నుంచి రావాల్సిన విద్యుత్ లోటును పూడ్చుకోవాలంటే.. రోజుకు రూ.8 కోట్ల విద్యుత్‌ను ఎక్స్ఛేంజీ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే రూ.355 కోట్ల ఖర్చు తెలంగాణ ఏర్పడ్డాక జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 581.22 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసింది. అక్టోబర్‌లో ఖరీఫ్ అవసరాలతో డిమాండ్ గణనీయంగా పెరిగినందున గరిష్టంగా ఒక్కో యూనిట్‌కు రూ.8.05 చొప్పున కొనుగోలు చేసింది. ఇప్పటికే విద్యుత్ కొనుగోలుకు రూ.355 కోట్లు ఖర్చు చేసింది. శ్రీశైలంలో అక్టోబర్ 1 నుంచి 31 వరకు 286.65 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు జెన్కో నివేదికలు చెబుతున్నాయి. వర్షాల కారణంగా రెండు రోజులు ఆపివేసినప్పటికీ.. మిగతా రోజుల్లో 2 మిలియన్ యూనిట్ల నుంచి 12 మిలియన్ యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి జరిగింది. శ్రీశైలం ప్లాంట్ సామర్ధ్యం 900 మెగావాట్లు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 710 మెగావాట్ల విద్యుత్ గ్రిడ్‌కు అందించారు. మొత్తం 11.94 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు జెన్కో వెల్లడించింది. శనివారం కూడా యథాతథంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగింది. మున్ముందు కష్టకాలమే.. కృష్ణా బోర్డు నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఉత్పత్తి నిలిపివేయాలంటూ తమకెలాంటి ఆదేశాలు అందలేదని జెన్కో వర్గాలు వెల్లడించాయి. బోర్డు సూచించిన మూడు టీఎంసీల నీటితో కేవలం ఒకరోజు 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు సరిపోదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపితే తెలంగాణలో ఇప్పటికే ఒకరోజు పవర్ హాలీడేతో కష్టాల్లో చిక్కుల్లో ఉన్న పరిశ్రమలు మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొనే ప్రమాదం ఉంది. రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతులు పంటలు వేసుకోలేక.. కోతలతో తల్లడిల్లే పరిస్థితి తలెత్తనుంది. -
'మా వాటా కిందే లెక్కేసుకోండి'
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కరెంటు ఉత్పత్తి కోసం వాడుకుంటున్న నీటిని తెలంగాణ వాటా కింద లెక్కేసినా అభ్యంతరం లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టంచేశారు. ప్రస్తుత ప్రాజెక్టులు, వాటి కేటాయింపులు, నిర్వహణ వంటి అంశాలన్నీ తెలంగాణ అవసరాలను పట్టించుకోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయించారని అన్నారు. కేవలం సీమాంధ్ర కోణం నుంచి ఆలోచించి తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి అవసరాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో కృష్ణా నీటి పంపిణీ, వినియోగంపై పునఃసమీక్ష జరగాలన్న తమ వాదనను ట్రిబ్యునల్ అంగీకరించిందని ఆ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. అప్పటిదాకా పంటలు ఎండిపోకుండా ఉండడానికి 834 అడుగుల దాకా నీటిని వాడుకునే హక్కును తెలంగాణకు ఇవ్వాలని కోరారు. ‘‘రైతుల పొలాలు ఎండిపోకుండా చూసేందుకే శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటితో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. మేం కరెంటు కోసం వాడుకునే నీటిని మా వాటా కిందే లెక్కేసినా అభ్యంతరం లేదు. మా పంటలు ఎండిపోవాలనే దురుద్దేశంతో, ద్వేషభావంతో తప్పుడు ప్రచారం చేసి మా రైతుల పొట్టకొట్టొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో రోజుకు 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కనీసం ఐదారు గంటలైనా కరెంటు ఇవ్వగలుగుతున్నామని, ఉత్పత్తిని ఆపేస్తే వ్యవసాయానికి కనీసం నాలుగు గంటలు కూడా ఇవ్వలేమని చెప్పారు. కొందరు శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని, తాగునీటికి, సాగునీటికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ అర్థరహిత, అవగాహన లేకుండా వాదిస్తున్నారని మండిపడ్డారు. కొద్దిపాటి నీటితో కరెంటు ఉత్పత్తి చేస్తూ తెలంగాణలోని 20 లక్షల మోటార్లకు కరెంటు ఇస్తున్నామని హరీశ్‌రావు వివరించారు. తెలంగాణలో అరడజను దొంగలు... వాస్తవాలను దాచిపెట్టి, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని హరీశ్ విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన 54 శాతం కరెంటు వాటా ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిస్తే... తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ‘‘కృష్ణపట్నం కరెంటు ఇవ్వడం లేదు. హిందూజాలో మన హక్కు ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించరు? న్యాయమైన తెలంగాణ వాటా కోసం చంద్రబాబును ఎందుకు నిలదీయరు? చంద్రబాబును చూస్తే వారి లాగులెందుకు తడుస్తున్నాయి’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. చంద్రబాబు వేసే బిస్కట్లకు ఇప్పటిదాకా తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చారని విమర్శించారు. ఆలీబాబా అరడజను దొంగల్లాగా, చంద్రబాబుకు తెలంగాణలో వంతపాడే అర డజను దొంగలు జమయ్యారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఇప్పటిదాకా చేసిన నయవంచనను దాచిపెట్టి కాంగ్రెస్ నాయకులు కూడా టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు నిల్వలున్న తెలంగాణలో విద్యుత్ కేంద్రం పెట్టకుండా రాయలసీమలో పెడుతుంటే జానారెడ్డి, డీఎస్, పొన్నాల లక్ష్మయ్య వంటివారెందుకు ప్రశ్నించలేదని అడిగారు. కాంగ్రెస్ నేతలు అప్పుడే మాట్లాడితే తెలంగాణకు ఇప్పుడీ దుస్థితి వచ్చేదా అని నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ 58 ఏళ్లలో చేయలేని పనిని నాలుగు నెలల్లోనే ఎలా చేస్తారన్నారు. శ్రీశైలంలో తెలంగాణకు 97 టీఎంసీలు రావాల్సి ఉంటే ఆంధ్రాకు 34 టీఎంసీల వాటా మాత్రమే ఉందని వివరించారు. తెలంగాణకు నీటి కేటాయింపులు ఉన్నా కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, ఎస్ఎల్బీసీ పూర్తికాక పోవడంతో వాడుకోవడం లేదని చెప్పారు. నీటి కేటాయింపులు లేకున్నా పులిచింతల, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా వంటి ప్రాజెక్టులతో ఇప్పటిదాకా నీటిని దొంగతనంగా వాడుకున్నారని ఆరోపించారు. ‘‘ఈ రాష్టంలో ఉంటూ, ఇక్కడి తిండి తింటూ, ఇక్కడి ప్రజాప్రతినిధులుగా ఉంటూ పరాయి రాష్ట్రం పాట పాడే నాయకులు ఉండటం తెలంగాణ దురదృష్టం. రాజకీయంగా కొట్లాడుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏకమయ్యే సంస్కృతి తెలంగాణకు లేదు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను దక్కించుకోవడంతోపాటు పెంచుకోవడానికి కొట్లాడుతూనే ఉంటాం. సుప్రీంకోర్టులో చంద్రబాబు బండారాన్ని బయటపెడ్తాం. టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎవరి పక్షాన ఉంటారో తేల్చుకోవాలి’’ అని మంత్రి హరీశ్ సవాల్ చేశారు. మా వాటా మాకు కావాలి శ్రీశైలం జలాలతో ఉత్పత్తి చేస్తున్న కరెంటును సాగునీటి అవసరాల కోసమే వాడుతున్నట్లు హరీశ్ వెల్లడించారు. ఈ విద్యుత్‌పై ఆధారపడే పంపుసెట్ల ద్వారా తెలంగాణలో దాదాపు 40 లక్షల ఎకరాల్లో పంట సాగవుతోందని చెప్పారు. జలాశయంలోని నీటిని సాగుకు వాడుకుంటున్నట్టుగానే భావించి 854 అడుగుల నుంచి 834 అడుగుల దాకా వాడుకోవడానికి ట్రిబ్యునల్ అనుమతించాలని కోరారు. శ్రీశైలంలో ఉత్పత్తిని నిలిపేస్తే 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేదని కొట్టిపారేశారు. 700 మెగావాట్ల విద్యుత్‌ను శ్రీశైలం నుంచి ఆపేసి కేవలం 300 మెగావాట్లు మాత్రమే తీసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. ‘‘మాకు కావాల్సింది మీ దయాదాక్షిణ్యాలు కాదు. మా హక్కు ప్రకారం 54 శాతం కరెంటు కావాలి. కృష్ణపట్నంతో పాటు అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మా వాటా మాకు రావాలి. ఇందుకు సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తాం’’ అని హరీశ్ హెచ్చరించారు.