
శ్రీశైలం ఆపితే అధోగతే!
తెలంగాణలో రెట్టింపు కానున్న విద్యుత్ కొరత
ఇప్పటికే రోజుకు 20 మిలియన్ యూనిట్ల లోటు
శ్రీశైలంలో ఉత్పత్తి ఆగితే మరో 10 మిలియన్ యూనిట్ల భారం
అంత మొత్తం కొనుగోలు చేయాలంటే సర్కారుకు తడిసిమోపెడే
ప్రతిరోజు దాదాపు రూ.8 కోట్ల భారం
పరిశ్రమలకు, రైతులకు రానున్నది గడ్డుకాలమే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయం మేరకు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే తెలంగాణలో కరెంట్ సంక్షోభం మళ్లీ మొదటికి వస్తుందేమోనన్న భావన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. శ్రీశైలంలో ఉత్పత్తి ఆపితే ఇప్పుడున్న విద్యుత్ కొరత రెండింతలు కానుంది. ఇటీవల కురిసిన వర్షాలు.. ఖరీఫ్ సీజన్‌లో వేసిన పంటలు చేతికి రావటంతో వారం రోజులుగా తెలంగాణలో విద్యుత్ డిమాండ్ కొంతమేరకు తగ్గింది. అయినా ప్రతిరోజు 10 మిలియన్ యూనిట్ల నుంచి 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉండడం గమనార్హం. అక్టోబర్‌లో రాష్ట్రంలో ఒకరోజు విద్యుత్ డిమాండ్ సగటున 160.8 యూనిట్లుగా నమోదైంది. సరఫరా గణాంకాలు పరిశీలిస్తే జెన్‌కో రోజుకు 140 యూనిట్లు అందించింది.
అంటే రోజుకు దాదాపు 20 మిలియన్ యూనిట్ల కొరత ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం రాష్ట్రంలో 137 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే.. 127 మిలియన్ యూనిట్ల సరఫరా జరిగింది. పది మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలంలో ఉత్పత్తి నిలిపివేస్తే రోజుకు సగటున 10 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి తగ్గిపోతుంది. ఆ విద్యుత్‌ను కొనుగోలు చేయాలంటే సర్కారుకు ఆర్థికంగా భారం కానుంది. శ్రీశైలం నుంచి రావాల్సిన విద్యుత్ లోటును పూడ్చుకోవాలంటే.. రోజుకు రూ.8 కోట్ల విద్యుత్‌ను ఎక్స్ఛేంజీ నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది.
ఇప్పటికే రూ.355 కోట్ల ఖర్చు
తెలంగాణ ఏర్పడ్డాక జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 581.22 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసింది. అక్టోబర్‌లో ఖరీఫ్ అవసరాలతో డిమాండ్ గణనీయంగా పెరిగినందున గరిష్టంగా ఒక్కో యూనిట్‌కు రూ.8.05 చొప్పున కొనుగోలు చేసింది. ఇప్పటికే విద్యుత్ కొనుగోలుకు రూ.355 కోట్లు ఖర్చు చేసింది. శ్రీశైలంలో అక్టోబర్ 1 నుంచి 31 వరకు 286.65 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగినట్లు జెన్‌కో నివేదికలు చెబుతున్నాయి. వర్షాల కారణంగా రెండు రోజులు ఆపివేసినప్పటికీ.. మిగతా రోజుల్లో 2 మిలియన్ యూనిట్ల నుంచి 12 మిలియన్ యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి జరిగింది. శ్రీశైలం ప్లాంట్ సామర్ధ్యం 900 మెగావాట్లు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 710 మెగావాట్ల విద్యుత్ గ్రిడ్‌కు అందించారు. మొత్తం 11.94 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు జెన్‌కో వెల్లడించింది. శనివారం కూడా యథాతథంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగింది.
మున్ముందు కష్టకాలమే..
కృష్ణా బోర్డు నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఉత్పత్తి నిలిపివేయాలంటూ తమకెలాంటి ఆదేశాలు అందలేదని జెన్‌కో వర్గాలు వెల్లడించాయి. బోర్డు సూచించిన మూడు టీఎంసీల నీటితో కేవలం ఒకరోజు 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు సరిపోదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపితే తెలంగాణలో ఇప్పటికే ఒకరోజు పవర్ హాలీడేతో కష్టాల్లో చిక్కుల్లో ఉన్న పరిశ్రమలు మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొనే ప్రమాదం ఉంది. రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతులు పంటలు వేసుకోలేక.. కోతలతో తల్లడిల్లే పరిస్థితి తలెత్తనుంది.