
తక్షణం జోక్యం చేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలో నీటి వినియోగం, విద్యుదుత్పత్తి వివాదంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ర్ట ప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలసి విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం ఆయన ఉమాభారతితో భేటీ కానున్నారు. తక్షణమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి ఈ వివాదానికి పరిష్కారం చూపాలని విన్నవించనున్నారు. అలాగే కృష్ణా జలాల వినియోగంలో ఏపీ సర్కారు పాల్పడుతున్న ఉల్లంఘనలపై, శ్రీశైలం వద్ద విద్యుదుత్పత్తి ఆపేయాలన్న కృష్ణా బోర్డు నిర్ణయాన్ని తప్పుబడుతూ ఫిర్యాదులు చేయనున్నారు. దీంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరగనున్నందున బోర్డు నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని కోరనున్నారు.
‘రాష్ట్ర అధికారుల బృందంతో కలసి ఢిల్లీ వెళ్తున్నా. రాష్ట్రంలో పంటలను రక్షించాలంటే విద్యుత్ అత్యవసరమన్న విషయాన్ని ఉమాభారతికి వివరిస్తాం’ అని ఢిల్లీకి బయలుదేరే ముందు మంత్రి హరీశ్‌రావు మీడియాకు స్పష్టం చేశారు. శ్రీశైలం ఎడమగట్టున విద్యుదుత్పత్తిని ఆదివారంతో నిలిపేయాలని, ఆలోగా గరిష్టంగా 3 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చని కృష్ణాబోర్డు గత నెల 31న రాష్ట్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపివేసినా దిగువన నాగార్జునసాగర్‌లో ఉత్పత్తి చేయడం వల్ల భవిష్యత్తులో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని సర్కారు భావిస్తోంది. సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తిని ఆపాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ శ్రీశైలంలో ఉత్పత్తిని కొనసాగించాల్సి ఉంటుంది. ఇందుకు వీలుగా ప్రభుత్వం చెబుతున్న గత జీవోల మేరకు ప్రాజెక్టులో 834 అడుగుల వరకు నీటి వినియోగానికి వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బోర్డు ఉత్తర్వులు అమలుకాకుండా నిలుపుదల చేయించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి.
దీనిపై కోర్టుకు వెళ్లే అవకాశాలను పరిశీలించిన ప్రభుత్వం ముందుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అపెక్స్ కౌన్సిల్ జోక్యాన్ని కోరాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కౌన్సిల్ చైర్మన్‌గా ఉండే కేంద్ర మంత్రి ఉమాభారతిని కలసి పరిష్కారం కోరాలని, సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆయన ఆదేశాల మేరకే మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు. నీటి కేటాయింపులపై ఎలాంటి హక్కులు లేని బోర్డు, తన పరిధిని దాటి నిర్ణయం తీసుకుందని ఉమాభారతికి ఆయన వివరించనున్నారు. అలాగే ఏపీ ఉల్లంఘనలు, నీటివాడకం, శ్రీశైలంలో నీటి మట్టాలపై గతంలో జరిగిన ఉల్లంఘనలపై ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు గణాంకాలతో కూడిన నివేదికలను ఆయన తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. వీలైతే ఆయన కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయెల్‌ను కలిసి ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ వాటాపై విన్నవించే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి.