కోటాపైనా కొట్లాట! | controversy over power generation sharing between Telangana and Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కోటాపైనా కొట్లాట!

Published Mon, Nov 3 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

కోటాపైనా కొట్లాట!

కోటాపైనా కొట్లాట!

శ్రీశైలం విద్యుత్‌పై ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం
 
 సాక్షి, హైదరాబాద్:ఆ మూడు టీఎంసీలతో రెండు రాష్ట్రాల మధ్య మరో చిచ్చు రేగింది! కృష్ణా బోర్డు ఆదేశాలను శిరసావహిస్తూ మూడు టీఎంసీలు వాడుకుని శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని నిలిపేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించినప్పటికీ అది కూడా వివాదంగా మారింది. సోమవారం ఉదయం వరకు మూడు టీఎంసీల వాడకం పూర్తవుతుందని పేర్కొంటూ ఆ తర్వాతే ఉత్పత్తిని నిలిపేసేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. మరోవైపు ఆదివారం సాయంత్రానికే మూడు టీఎంసీల కోటాను తెలంగాణ వాడుకున్నదని, అయినా విద్యుదుత్పత్తిని కొనసాగించడాన్ని ఏపీ సర్కారు తప్పుబడుతోంది. ఆదివారం వరకే ఉత్పత్తి చేయాలన్న బోర్డు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడుతోంది. దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది.
 
 ఆచితూచి వ్యవహరిస్తున్న తెలంగాణ
 
 బోర్డు ఆదేశాలు ఏకపక్షంగా ఉన్నాయని తప్పుబట్టిన రాష్ట్ర సర్కారు విద్యుదుత్పత్తి విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ వ్యవహారంపై ఇంధన శాఖ, జెన్‌కో అధికారులతో పలుమార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయపోరాటం చేయాలని లేకపోతే కేంద్రం జోక్యం కోరాలని భావిస్తూనే.. బోర్డు ఆదేశాలను గౌరవించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. అదే సమయంలో విద్యుత్ సంక్షోభం తీవ్రం కాకుండా శ్రీశైలం దిగువన నాగార్జునసాగర్‌లో ఉత్పత్తి చేపట్టేలా జెన్‌కో జాగ్రత్తలు తీసుకుంటోంది. శ్రీశైలం ఎడమ గట్టున విద్యుదుత్పత్తిని ఆదివారం నాటికే పరిమితం చేయాలని, అప్పటివరకు గరిష్టంగా 3 టీఎంసీల నీటినే వాడుకోవాలని గత నెల 31న కృష్ణా బోర్డు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో 5.17 మిలియన్ యూనిట్ల మేర ఉత్పత్తి జరిగింది. అంతకుముందు అక్టోబర్ 31న 11.94 మిలియన్ యూనిట్లు, 30వ తేదీన 5.5 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు తెలంగాణ జెన్‌కో వెల్లడించింది. బోర్డు ఆదేశాలు అందిన తర్వాత శనివారం నాటికి 1.6 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలో డిమాండ్ తగ్గిపోవడంతో ఆ శనివారం రాత్రి నుంచే శ్రీశైలంలో ఉత్పత్తిని కుదించారు. అందుకే బోర్డు నిర్దేశించిన మూడు టీఎంసీల నీటి కోటాను వాడుకునేందుకు సోమవారం ఉదయం వరకు ఉత్పత్తి చేపట్టాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. శ్రీశైలంలో ఉత్పత్తి నిలిపేస్తే విద్యుత్ కొరత రెట్టింపుకానున్న దృష్ట్యా.. వారం రోజుల విరామం తర్వాత సాగర్‌లోనూ శనివారం రాత్రి నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. ఆదివారం ఉదయానికల్లా 2.25 మిలియన్ యూనిట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అందించినట్లు సమాచారం. సాగర్ నుంచి రోజుకు దాదాపు 14 వేల నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి వాడుకోవాలని జెన్‌కో భావిస్తోంది. అయితే ఈ నీటితో దిగువన  పులిచింతల ముంపు గ్రామాలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పులిచింతలలో నీటిమట్టం ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరడంతో అప్రమత్తమైన అధికారులు ఒక్కసారిగా 93 వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీకి విడుదల చేయటంతో ముంపు ప్రమాదం తప్పింది. తాజాగా విద్యుదుత్పత్తి కారణంగా అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
 
 అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్
 
 మరోవైపు శ్రీశైలం నుంచి ఆదివారం సాయంత్రం వరకే 2.96 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకున్నదని ఏపీ సర్కారు లెక్కలేసింది. సాయంత్రం 6 గంటల సమయంలో 540 మెగావాట్లను ఉత్పత్తి చేస్తూ 28,252 క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నట్లు ఏపీ వర్గాలు తేల్చాయి. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పట్నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు లెక్కిస్తే 48 గంటల్లో 2.96 టీఎంసీల నీటిని వినియోగించినట్లు ఏపీ నిర్ధారించింది. ప్రాజెక్టులో నీటి నిల్వ ఆధారంగా అధికారులు ఈ గణాంకాలను రూపొందించారు. తుంగభద్ర నుంచి ప్రాజెక్టులోకి 8,900 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని, దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆదివారం సాయంత్రం ప్రాజెక్టులో 857.40 అడుగుల నీటిమట్టం ఉండగా.. 98.47 టీఎంసీల నీటినిల్వ ఉంది. సోమవారం ఉదయం 6 గంటల తర్వాత కూడా విద్యుదుత్పత్తిని తెలంగాణ కొనసాగిస్తే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement