
కృష్ణా బోర్డు నిర్ణయంపై ఏం చేద్దాం?
అపెక్స్‌కా లేక కోర్టుకా.. తేల్చుకోలేని తెలంగాణ ప్రభుత్వం
సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశంలో సుదీర్ఘ చర్చ
అపెక్స్ కౌన్సిల్‌కువెళ్లడమే సరైందని సూచించిన న్యాయవాదులు
శ్రీశైలం నీటి వాడకంపై నేటితో ముగియనున్న గడువు
వివాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపేయాలని కృష్ణా బోర్డు ఆదేశించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ర్ట ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. బోర్డు నిర్ణయంపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్న విషయంలో కొంత సందిగ్ధంలో పడింది. దీనిపై అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లడమా లేక నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్డు గడప తొక్కడమా అన్న మీమాంసలో ప్రభుత్వం పడినట్లు సమాచారం. ఈ వివాదాన్ని కోర్టు పరిధిలోనే తేల్చుకోవాలని సర్కారు తొలుత భావించినప్పటికీ, న్యాయవాదుల సూచనల మేరకు ఈ పంచాయతీని అపెక్స్ కౌన్సిల్ ముందు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ర్ట విభజన చట్టంలో ఇదే విషయాన్ని పేర్కొన్నట్లు గుర్తు చేస్తున్నాయి. అయితే సీఎం కేసీఆర్ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు నీటిపారుదల శాఖ అధికారులు ఈ అంశంపై పెదవి విప్పడం లేదు. కృష్ణా బోర్డు ఆదేశాల నేపథ్యంలో శనివారం కూడా కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు ఈ భేటీలో పాల్గొన్నారు. బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేసే అంశంపై 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చిం చారు. సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయిం చినా ముందుగా అపెక్స్ కౌన్సిల్‌లో తేల్చుకోవాలని సూచించే అవకాశాలున్నాయని, అక్కడ తేలకుంటేనే తాము జోక్యం చేసుకుంటామని కోర్టులు పేర్కొంటాయని న్యాయవాదులు వివరించినట్లు తెలిసింది. ఈ దృష్ట్యా అపెక్స్ కౌన్సిల్‌కే వెళ్లాలని నిర్ధారించినట్లు తెలిసింది.
శ్రీశైలంలో ఎంత వాడుకోవాలి?
శ్రీశైలం ఎడమ గట్టున విద్యుదుత్పత్తిని ఆది వారం నాటికే పరిమితం చేయాలంటూ గడువు విధించిన బోర్డు, ఆ తర్వాత నీటి వినియోగం ఎలా ఉండాలి, విద్యుదుత్పత్తి అవసరాలకు నీటిని ఎక్కడి నుంచి వినియోగించుకోవాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. నాగార్జునసాగర్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయకపోవడంతో.. ఇక్కడ విద్యుదుత్పత్తికి బోర్డు ఎలాంటి ఆంక్షలు పెట్టనట్లుగానే భావించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సాగర్‌లో కొంత మేర ఉత్పత్తి జరుగుతున్నా, శ్రీశైలంలో ఉత్పత్తి నిలిపివేస్తే సాగర్ జలాల్లో నీటి వినియోగం పెరుగుతుంది. ఫలితంగా పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాలపై ప్రభావం పడే అవకాశముంది. ఇప్పటికే పులిచింతలలో 11 టీఎంసీల మేర నిల్వ ఉన్నందువల్లే నల్గొండ జిల్లాలోని అడ్లూరు, వెలటూరు సహా మరో రెండు గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంది. ఈ అంశాలపైనా సీఎం చర్చించినట్లు సమాచారం.
బోర్డుకు ఏపీ ఫిర్యాదు!
కృష్ణాబోర్డు ఇచ్చిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం పాటించకుండా విద్యుదుత్పత్తి కొనసాగిస్తే బోర్డుకు ఫిర్యా దు చేయాలని ఏపీ అధికారులు నిర్ణయిం చారు. 3 టీఎంసీలకు మించి నీటిని వాడుకున్నా, ఆదివారం తర్వాత విద్యుదుత్పత్తి చేసినా.. ఉన్నతాధికారులకు సమాచారమం దించాలని కర్నూలు చీఫ్ ఇంజనీర్‌కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
పెరిగిన నీటి వాడకం
శ్రీశైలం ప్రాజెక్టులో శనివారం సాయంత్రం దాటాక నీటి వాడకాన్ని రాష్ర్ట ప్రభుత్వం మరింత పెంచింది. శుక్రవారం ప్రాజెక్టులో 27,021 క్యూసెక్కుల నీటితో 720 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. సాయంత్రం తర్వాత నీటి విడుదలను 44,497 క్యూసెక్కులకు పెంచింది. విద్యుదుత్పత్తితో ప్రాజెక్టులో శుక్రవారం 858.50 అడుగుల నీటి మట్టానికి 101.43 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, అది శనివారానికి 857.90 అడుగులకు చేరి నీటి నిల్వ 99.76 టీఎంసీలుగా ఉంది. ఈ లెక్కన సుమారు 1.67 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకున్నది. ఆదివారం వరకు గరిష్ఠంగా 3 టీఎంసీలే వాడుకోవాలన్న బోర్డు నిర్ణయం మేరకు మరో 1.33 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించాల్సి ఉంది.
ఏపీ నీటి వాడకంపై ఫిర్యాదు!
కృష్ణా బోర్డు నిర్ణయంపై శుక్రవారం రాత్రే లేఖ ద్వారా తమ నిరసనను తెలిపిన రాష్ర్ట ప్రభుత్వం.. అందులో మూడు అంశాల విషయంలో ఏపీపై ఫిర్యాదు చేసింది. కేంద్ర జలసంఘం నియమనిబంధనల మేరకు శ్రీశైలం కుడి కెనాల్, కేసీ కెనాల్‌కు జూలై నుంచి అక్టోబర్ వరకు మాత్రమే నీటిని తీసుకెళ్లేందుకు అనుమతించారని, అయితే ఏపీ దీన్ని ఉల్లంఘించి నీటిని తరలిస్తోందని బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీన్ని వెంటనే అడ్డుకోవాలని కోరినట్లు సమాచారం. అలాగే తాగునీటి అవసరాల దృష్ట్యా శ్రీశైలంలో నీటి వినియోగాన్ని ఆపాలంటున్న ఏపీ... అసలు నీటి కేటాయింపులే లేని హంద్రినీవాకు మాత్రం నీటిని తరలిస్తోందని, అక్కడ పంప్‌హౌస్‌లు ఇప్పటికీ పనిచేస్తున్నాయని బోర్డు దృష్టికి తీసుకెళ్లినట్లు నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో పాటే పోతిరెడ్డిపాడు వాస్తవ కేటాయింపులను అతిక్రమించి ఇప్పటికే అధికారికంగా 62 టీఎంసీల మేర నీటిని తరలించిందన్న విషయాన్ని కూడా గట్టిగా చెప్పినట్లు పేర్కొన్నాయి.
కేంద్రం దృష్టికి వివాదం
కృష్ణా నదీ జలాల వివాదాన్ని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి హరీశ్ ఇప్పటికే ఈ అంశంపై ఆమె అపాయింట్‌మెంట్ కోరారు. ఇది ఖరారైన వెంటనే ఢిల్లీకి వెళ్లి ఆమెతో భేటీ అవుతారు. ప్రధానంగా ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై హరీశ్ ఫిర్యాదు చేయనున్నారు. బోర్డు నిర్ణయంపై అభ్యంతరాలను కూడా వివరించనున్నారు. కేంద్ర మంత్రితో భేటీకి సంబంధించిన నోట్‌ను శనివారం సాయంత్రానికే అధికారులు సిద్ధం చేశారు.