
నేడు కృష్ణా బోర్డు అత్యవసర భేటీ
శ్రీశైలం, సాగర్‌లో మిగిలిన నీటి నిల్వల వినియోగంపై జరగనున్న చర్చ
తెలంగాణ ఫిర్యాదులపై కదలిక.. చర్యలకు ఉపక్రమించిన బోర్డు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం మిగిలి ఉన్న నిల్వల వినియోగంపై చర్చించేందుకు శుక్రవారం కృష్ణా నదీ యాజ మాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రత్యేక అత్యవసర సమావేశం జరగనుంది. మధ్యాహ్నం హైదరాబాద్ జలసౌధలో జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల కార్యదర్శులు హాజరు కావాలని కోరుతూ బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పూరే లేఖ రాశారు.
శ్రీశైలం, సాగర్‌లో ప్రస్తుతం మిగిలి ఉన్న నిల్వల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటాలున్నాయని పేర్కొంటూ ఇటీవల రాసిన లేఖకు కొనసాగింపుగా ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కృష్ణా బోర్డు తెలి పింది. ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్.. కృష్ణా బోర్డు ద్వారా ఏపీని నియంత్రించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.
నిల్వలన్నీ తమవే అంటున్న తెలంగాణ
ప్రస్తుత నీటి సంవత్సరంలో 1,010.134 టీఎంసీల జలాలు లభ్యతలోకి రాగా.. తాత్కాలిక సర్దుబాటు ప్రకారం ఏపీకి 666.68 టీఎంసీలు, తెలంగాణకు 343.44 టీఎంసీల వాటా లుంటాయని కృష్ణాబోర్డు తేల్చింది. ఏపీ ఇప్పటికే 639.652 టీఎంసీలు వాడుకోగా, ఆ రాష్ట్ర కోటాలో 27.03 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలిపింది. తెలంగాణ 211.691 టీఎంసీలు వాడుకోగా, మరో 131.75 టీఎంసీలు మిగిలి ఉన్నాయని లెక్క గట్టింది. మరోవైపు నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం (ఎండీడీఎల్) 510 అడుగులకు పైన 63.6 టీఎంసీలు, శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టం 834 అడుగులకు పైన 30.811 టీఎంసీల నిల్వలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయని స్పష్టం చేసింది.
అయితే ఏపీ ఇప్పటికే తమ వాటాకు మించి నీళ్లను వాడుకుందని, కాబట్టి జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలు పూర్తిగా తమవేనని పేర్కొంటూ తెలంగాణ తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా జలాల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై కృష్ణా బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించతలపెట్టడడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, గురువారం జలసౌధలో మంత్రి ఉత్తమ్‌తో కృష్ణా బోర్డ్ చైర్మన్ అతుల్ జైన్ సమావేశమయ్యారు. ఏపీ, తెలంగాణ మధ్య న్యాయమైన రీతిలో నీటి పంపకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉత్తమ్ కోరారు.
ఒక పంటకైనా నీళ్లు ఇవ్వండి: తెలంగాణ
తెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతాల రైతులు కనీసం ఒక పంటనైనా సాగుచేసుకునేందుకు నీళ్లు కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2కి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై విచారణ నిర్వహిస్తున్న ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ గురువారం రెండోరోజు వాదనలు వినిపించారు. కావేరి ట్రిబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తన వాదనలకు అనుకూలంగా ఉన్న కొన్ని వివరాలను ఆయన చదివి వినిపించారు.
కావేరి, కృష్ణా బేసిన్‌ల మధ్య పలు అంశాల్లో పోలికలున్నాయని, రెండు బేసిన్లలో నీటి కొరత ఉండగా, అవసరాలు అధికంగా ఉన్నాయని చెప్పారు. అధిక నీళ్లు అవసరమైన వరి సాగుకు బదులుగా తక్కువ నీళ్లతో తక్కువ వ్యవధిలో పండే పంటలను సాగు చేయాలని కావేరి ట్రిబ్యునల్ చేసిన సూచనను కృష్ణా పరీవాహకంలో అమలు చేయాలని ప్రతిపాదించారు.
మార్చి 5న గోదావరి బోర్డు సమావేశం
గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మార్చి 5న హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment