- రైల్వే మంత్రి ఖర్గే ..
- మోడీ విమర్శలు అర్థరహితం
- ఇంత తక్కువ కాలంలో ఎవరూ ఇన్ని పనులు చేయలేరు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రైల్వే శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రానికి 17 కొత్త రైళ్లను ప్రవేశ పెట్టానని రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇక్కడి బిన్నీ మిల్లు వద్ద రైళ్లను నిలిపి ఉంచడానికి కొత్తగా నిర్మించే స్టేషన్ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. గుజరాత్ వ ుుఖ్యమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం గుల్బర్గలో జరిగిన సభలో తనపై చేసిన విమర్శలకు తీవ్ర ంగా స్పందించారు.
అతి తక్కువ కాలంలో కర్ణాటకకు శక్తి మేరకు రైల్వే సదుపాయాల కల్పన విషయంలో చొరవ చూపానని చెప్పారు. ఇంతకు మించి ఇతరులు కూడా ఏమీ చేయలేరని అన్నారు. కాగా రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైళ్లను నిలిపి ఉంచే స్టేషన్ పనులను 15 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ స్టేషన్ నిర్మాణం పూర్తయితే సిటీ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలపై ఎక్కువ సంఖ్యలో రైళ్లను నిలిపి ఉంచడానికి వీలేర్పడుతుందని చెప్పారు. అంతకు ముందు ఆయన బెంగళూరు-తుమకూరు, బెంగళూరు-జబల్‌పూర్ సహా నాలుగు కొత్త రైళ్ల సంచారానికి పచ్చ జెండా ఊపారు.
రూ.100 కోట్లతో పునరావాస కేంద్రం
నగరంలోని నిమ్హాన్స్‌లో సుమారు రూ.100 కోట్ల వ్యయంతో మానసిక అస్వస్థులకు పునరావాస కేంద్రాన్ని నిర్మించాలని కేంద్రం సంకల్పించిందని ఖర్గే తెలిపారు. సామాజిక న్యాయం, సాధికారత అనే అంశంపై ఇక్కడి చౌడయ్య మెమోరియల్ హాలులో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖలను కూడా నిర్వహిస్తున్న ఖర్గే ఈ సందర్భంగా ప్రసంగిస్తూ పేదల అభ్యున్నతిని కాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా స్వావలంబన పథకాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు.