ప్రధానమంత్రి మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని అన్నారు. బడ్జెట్‌కు మించి గ్యారంటీలు ఇవ్వొద్దంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హామీలు ఇవ్వడమే సులభమే అయినప్పటికీ వాటిని అమలు చేయడం కష్టం, అసాధ్యమన్న సంగతి కాంగ్రెస్‌కు తెలుసని పేర్కొన్నారు.
అమలు చేయలేమని తెలిసినప్పటికీ హామీలు, గ్యారంటీల పేరిట ఆ పార్టీ ప్రజలను దగా చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఒక గ్యారంటీని రద్దు చేయాలని చూస్తు న్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారిందన్నారు. తెలంగాణలో రుణ మాఫీ కోసం రైతులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ దుష్ట రాజకీయాలకు పేదలు, రైతులు, యువత, మహిళలు తీవ్రంగా నష్టపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల హరియాణా ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలను తిరస్కరించారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం అంటే అధ్వాన్న పరిపాలనకు, దిగజారిన ఆర్థిక వ్యవస్థకు, వనరుల లూటీకి ఓటు వేసినట్లేనని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే హామీలు అమలు కాకపోవడమే కాదు, ఉన్న పథకాలు సైతం రద్దవుతాయని విమర్శించారు. కాంగ్రెస్ సంస్కృతి అయిన బూటకపు హామీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు కేవలం అభివృద్ధిని కోరుకుంటున్నారు తప్ప అదే పాతకాలం నాటి బోగస్ హామీలను కాదని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment