ముంబై: రైలు పట్టాలను దాటుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు సబర్బన్ రైలు ఢీకొట్టడంతో మరణించారు. రాజస్థాన్‌కు చెందిన వీరు భుసావల్ ప్యాసింజర్‌లో ముంబైకి వచ్చారు. రైలు బైకుల్లా స్టేషన్ సమీపంలో ఆగడంతో అక్కడే దిగిపోవాలని నిర్ణయించుకొని దిగిపోయారు. వీరు పట్టాలు దాటుతుండగా ఆ ట్రాక్ మీద వచ్చిన సబర్బన్ రైలు ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు.
ఈ సమాచారం అందగానే సీఎస్‌టీ రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి విచారణ జరపగా మృతులు రాజస్థాన్ భుసావల్‌కు చెందిన వారని తేలింది. మృతులను హుస్సేన్ అబ్దుల్ అలియాస్ హుస్సేన్ హవల్దార్ (60) ఆయన భార్య ఫాతిమా హుస్సేన్ (50), వారి కూతురు జహరా హుస్సేన్ (30)గా గుర్తించారు. వసింద్‌లో నివసించే వారి బంధువుల వద్దకు వెళ్లాలని వచ్చిన వీరు వాస్తవానికి సీఎస్‌టీలో దిగాల్సి ఉంది. కానీ రైలు ఆగడంతో చివరి నిమిషంలో బైకుల్లా సమీపంలోనే దిగిపోయారు. పోలీసులు ఈ సమాచారాన్ని వారి బంధువులకు అందించారు. అయితే వారు రైల్వే అధికారుల నిర్వహణ లోపం వల్లనే తమవారు మరణించారని ఆరోపించారు. సీఎస్‌టీలో ఆగాల్సిన రైలు బైకుల్లా సమీపంలో అర్ధగంటకు పైగా నిలుపుతున్నారు.దీంతో ప్రయాణికులు అర్ధంతరంగా దిగి రైలు పట్టాలకు అడ్డంగా దాటి వెళ్తుంటారు. ఈ కారణంగానే తమ బంధువులు మరణించారని మృతుల బంధువులు విమర్శించారు.
రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
Published Sat, Oct 19 2013 12:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement