అక్కడికక్కడే బస్సు డ్రైవర్ మృతి
15 మంది ప్రయాణికులకు గాయాలు
విరామం లేకుండా డ్యూటీ వేశారని
మృతుడి కుటుంబ సభ్యుల ఆగ్రహం
కేసు నమోదు చేసిన చౌటుప్పల్ పోలీసులు
చౌటుప్పల్ రూరల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పరిధిలోని ఆంథోళ్ మైసమ్మ గుడి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ డిపోకు చెందిన డీలక్స్ బస్సు నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోంది. దండుమల్కాపురం గ్రామ స్టేజీ దాటిన తర్వాత ఆంథోళ్ మైసమ్మ గుడి సమీపంలో జాతీయ రహదారిపై డీజిల్ అయిపోయి ఎయిర్‌లాక్ కావడంతో లారీ ఆగిపోయింది. ఈ లారీ డీలక్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ సయ్యద్ సలీం పాష(50) బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35మంది ప్రయాణికులు ఉన్నారు.
బంటు శేఖర్, మిడతపల్లి సైదులుతో పాటు మరో పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడిన ప్రయాణికులు వేరే వాహనాల్లో వెళ్లిపోయారు. బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ సలీం పాష మృతదేహాన్ని పోలీసులు క్రేన్ సహయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం కాగా.. పోలీసులు క్లియర్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన బస్సు డ్రైవర్ సలీం పాష స్వగ్రామం చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం కాగా 25 ఏళ్ల క్రితం నల్లగొండకు వెళ్లిపోయారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్ల యాదవరెడ్డి తెలిపారు.
విరామం లేకుండా డ్యూటీలు వేయడం వల్లే..
ఆర్టీసీ అధికారులు విరామం లేకుండా డ్యూటీలు వేయడం వల్లనే బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుడు సలీం పాష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆదివారం డ్యూటీకి వెళ్లిన సలీం పాషా సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు డ్యూటీ అయిపోవడంతో ఇంటికి వస్తున్నానని చెప్పాడని, కొద్దిసేపటికే మళ్లీ డ్యూటీ వేశారని హైదరాబాద్ వెళ్లి వస్తానని ఫోన్‌లో చెప్పి ఇలా ప్రమాదంలో మృతిచెందాడని సలీం పాష సోదరుడు అనీస్ పాష బోరున విలపించాడు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ వారే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఉత్తమ డ్రైవర్‌ను కోల్పోయాం
– ఆర్టీసీ ఆర్‌ఎం జానిరెడ్డి
నల్లగొండ క్రైం: చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులో సోమవారం జరిగిన ప్రమాదంలో నల్లగొండ డిపోకు చెందిన డ్రైవర్ సయ్యద్ సలీంపాష మృతిచెందాడని, సంస్థ ఒక ఉత్తమ డ్రైవర్‌ను కోల్పోయిందని ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ జానిరెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ డిపోకు చెందిన డీలక్స్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ సలీంపాష ఇటీవల ఉత్తమ డ్రైవర్‌గా (కేఎంపీఎల్) అవార్డు పొందాడని, టిమ్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని ఆర్‌ఎం తెలిపారు.
లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఎలాంటి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకుండా లారీని రోడ్డుపై నిలిపాడని తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు ఏటవాలుగా ఉండటంతో.. లారీ నిలిచినప్పటికీ వెళుతున్నట్లుగా బస్సు డ్రైవర్ భావించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినట్లు ఆర్‌ఎం తెలిపారు. బస్సు డ్రైవర్ విశ్రాంతి లేకుండా విధులు నిర్వహిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురై 15 రోజులు సెలవు తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment