కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే.. వాట్సప్ మంత్రి
ఆపద వస్తే ఆయనే అడ్డం పడతారు
అర్థరాత్రి జగిత్యాల రోడ్డు ప్రమాదంపై సత్వర స్పందన
రెండు జిల్లాల అధికారులను అలర్ట్ చేసిన మంత్రి
మెరుగైన వైద్యంతో అందరి ప్రాణాలకు భరోసా
కాయిన్ బాక్స్ ఎమ్మెల్యే ఇప్పడు వాట్సప్ మంత్రి అయ్యాడు. అప్పట్లో కాయిన్ బాక్స్‌లో రూపాయి వేసి ఆయనకు ఫోన్ చేస్తే గండం గట్టెక్కినట్టే.. ప్రస్తుతం కాయిన్ బాక్స్‌కు కాలం చెల్లడంతో సిద్దిపేట జనం వాట్సప్‌లోకి వస్తున్నారు. అర్థరాత్రి.. అపరాత్రి వేళ ఏ ఆపద వచ్చినా.. మంత్రి హరీశ్‌కు వాట్సప్‌కు ఒక పోస్టు పెడితే చాలు. ఆపన్నహస్తం అందుతుంది. ఆదివారం అర్థరాత్రి వేళ.. ఇదే సీన్ రిపీట్ అయింది. గంగస్నానాల కోసం ధర్మపురిలోని గోదావరి నదికి వెళ్లిన జగిత్యాల మండలంలోని ఓ కుటుంబానికి సంబంధించిన బంధువులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిలో బాధితులంతా సిద్దిపేట వారేనని తేలడంతో.. అక్కడే ఉన్న ఓ విలేకరి మంత్రి హరీశ్‌రావు వాట్సప్‌లో మెసేజ్ పెట్టారు. వెంటనే స్పందించిన మంత్రి రాత్రి 11.15 గంటలకు కలెక్టర్‌ను, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను అప్రమత్తం చేశారు. అప్పటికే నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి మెరుగైన వైద్యం అందించడం కోసం అప్పటికప్పుడు జగిత్యాలలో ఉన్న వైద్యులతో మాట్లాడారు. అక్కడి అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం వారిని సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. మొత్తానికి ఒక్క వాట్సప్ మెసేజ్‌తో మంత్రి అందరి ప్రాణాలు కాపాడగలిగారు.
సిద్దిపేట జోన్ : జగిత్యాల మండలం తిప్పన్నపేట సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సిద్దిపేటకు చెందిన బాధితుల వైనంపై మంత్రి అదే రాత్రి సత్వరం స్పందించారు. రాత్రి 11.15 నిమిషాలకు జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్ చేసి రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం సకాలంలో అందించి ప్రాణనష్టం జరగకుండా కాపాడారు. సిద్దిపేట పట్టణంలోని రాంనగర్‌కు చెందిన జిల్లెల్ల స్వామి తల్లి ఇటీవల మృతి చెం దింది. దీంతో ఆమెకు సంబంధించిన హస్తికలను ధర్మపురిలోని గోదావరి జలాల్లో కలి పేం దుకు బంధువులతో కలిసి టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం చేస్తున్న క్రమంలో తిప్పనపేట వద్ద ఎదురుగా వస్తున్న బ్లేడ్ ట్రాక్టర్ వీరు ప్రయాణిస్తున్న టాటాఏస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనతో ఆ వాహనం పల్టీలు కొట్టింది. ట్రాక్టర్‌కు ఉన్న పదునైన బ్లేడ్లు స్వామి కుటుంబసభ్యుల ను తీవ్రంగా గాయపరిచింది. టాటా ఏస్ వా హనంలో ప్రయాణిస్తున్న వారంతా రోడ్డు మీద చె ల్లాచెదురుగా పడిపోయారు. దాంట్లో మొత్తం 12 మంది ఉండగా.. అందరు గాయాలపాలయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
వాట్సాప్‌తో తక్షణ స్పందన..
క్షతగాత్రులు తమది సిద్దిపేట అని చెప్పడంతో అక్కడే ఉన్న స్థానిక ’సాక్షి’ విలేకరి ఎస్‌ఎంస్ టైప్ చేసి మంత్రి హరీశ్‌రావుకు వాట్సప్‌లో పోస్టు చేశాడు. ఈ సమాచారాన్ని చూసుకున్న మంత్రి ముందుగా జగిత్యాల కలెక్టర్ డాక్టర్ శరత్‌ను అలర్ట్ చేశారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి అవసరమైన డాక్టర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి.. పరిస్థితి విషమంగా ఉన్న దండు ఉప్పేశం, పిట్ల మహేశ్, జిల్లెల చందు, మల్లవ్వ, రాజు తదితరులను ప్రాథమికంగా పరీక్షించిన వైద్యులు ఇక్కడ వైద్యం తమ వల్ల కాదని, హైదరాబాద్ తీసుకవెళ్లాలని చెప్పారు. అదే సమయానికి మంత్రి సహాయం అందటంతో వారికి ప్రత్యేక వైద్యం మొదలైంది. మొత్తానికి 12 మందికి 12 మంది ప్రాణాలతో బయటపడ్డారు. హరీశ్‌రావు ఆదేశాల మేరకు సోమవారం ఉదయం మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సిద్దిపేటలోని ఏరియా ఆస్పత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి పరిస్థితిని మంత్రికి వివరించారు.