దారిపై రుధిరధార | 11 People Died As Four Vehicles Collision In Siddipet | Sakshi
Sakshi News home page

దారిపై రుధిరధార

Published Sun, May 27 2018 1:48 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

11 People Died As Four Vehicles Collision In Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట/గజ్వేల్‌: రాజీవ్‌ రహదారి రక్తమోడింది! నడిరోడ్డుపై మరణ మృదంగం మోగింది. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి 11 మంది నిండు ప్రాణాలు బలయ్యాయి. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన 11 మందిలో ఒకే కుటుంబానికి చెందినవారు ఎనిమిది మంది ఉన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద శనివారం సాయంత్రం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత బస్సు డ్రైవర్‌ లారీని ఢీకొట్టడం.. ఆ లారీ కుడి వైపునకు ఎగిరి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టడం.. అదే సమయంలో ఓ క్వాలిస్‌ దూసుకురావడంతో లిప్తపాటులో పెను ప్రమాదం సంభవించింది. 

ఇందులో క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న సంగారెడ్డి జిల్లా పెద్దమ్మగూడెం గ్రామానికి చెందిన పత్రికా విలేకరి గొర్ల లక్ష్మణ్‌ (40)తోపాటు అతని కుటుంబసభ్యులు ఏడుగురు, బస్సులో హైదరాబాద్‌ నుంచి మంచిర్యాల వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మణ్‌ బంధువర్గానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదంపై మంత్రి మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఎలా జరిగింది? 
మంచిర్యాల డిపోకు చెందిన టీఎస్‌ 19జెడ్‌ 0012 నంబర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంచిర్యాలకు బయల్దేరింది. గంట తర్వాత గజ్వేల్‌ పట్టణం దాటిన తర్వాత రిమ్మనగూడ ఫార్మసీ కళాశాల సమీపంలోకి చేరుకుంది. ఇదే సమయంలో సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ(ఎంపీ 28హెచ్‌1945)ని ఓవర్‌ టేక్‌ చేయబోతూ ఢీకొట్టి బోల్తా పడింది. బస్సు ఢీకొట్టడంతో లారీ డివైడర్‌ను దాటుకొని రోడ్డుకు అవతలి వైపు దూసుకొచ్చి, సిద్దిపేట నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న మరో లారీ (కంటైనర్‌)ని ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా సిద్దిపేట వైపు ముందుకు కదిలింది. ఇదే సమయంలో కొమురవెళ్లి గుడిలో పూజలు చేసుకొని గజ్వేల్‌ వైపు వస్తున్న క్వాలిస్‌ ఈ లారీని ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో క్వాలిస్‌ నుజ్జునుజ్జు అయింది. ఇందులో ప్రయాణిస్తున్న గొర్ల లక్ష్మణ్, తల్లి గండమ్మ (65), తండ్రి మల్లయ్య (67), కుమార్తె నిహారిక (5)తోపాటు మెదక్‌ జిల్లా తుప్రాన్‌ మండలం వెంకటరత్నాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ అత్త ఇల్టం సత్తమ్మ (60), బావమరిది కుమారుడు శ్రీనివాస్‌ (8), తుఫ్రాన్‌కు చెందిన సమీప బంధువు గాజు సుశీల (62) చనిపోయారు. అలాగే బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఆసిఫాబాద్‌కు చెందిన పరండి రాహుల్‌ (35), గోదావరిఖని లక్ష్మీనగర్‌కు చెందిన సాయినిఖిల్‌ (25), కరీంనగర్‌కు చెందిన సింధుజ (26) మృతి చెందారు. 

క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న లక్ష్మణ్‌ భార్య పుష్పలత, కుమారుడు ఆకాశ్, డైవర్‌ నర్సింహులుతోపాటు బస్సులో గాయపడ్డ ప్రయాణికులకు గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం గాంధీ, యశోద అసుపత్రులకు తరలించారు. గాంధీలో చికిత్స పొందుతూ లక్ష్మణ్‌ బంధువర్గానికే చెందిన ఓంకార్‌ (6) అనే బాలుడు మృతిచెందాడు. ఈ బాలుడి తండ్రి నర్సింహులు కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

మంత్రి హరీశ్‌రావు పరామర్శ 
సంఘటన గురించి తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు వెంటనే సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు కలిసి ప్రమాద స్థలికి వెళ్లారు. అనంతరం గజ్వేల్‌ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదం దురదృష్టకరమని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందచేస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

డ్రైవర్‌ నిర్లక్ష్యమే..! 
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. నిజానికి ఆర్టీసీకి చెందిన ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సులు 75–80 కిలోమీటర్లకు స్పీడ్‌లాక్‌ చేస్తారు. కానీ ప్రమాదం సమయంలో బస్సు అంతకన్నా వేగంగా వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు లారీని ఢీకొట్టిన తర్వాత కిందకు పడబోతుండగా డ్రైవర్‌ ఇష్టానుసారంగా టర్న్‌ చేయడంతో రౌండ్‌ తిరిగి బోల్తా కొట్టిందని ప్రయాణికులు చెబుతున్నారు. 

హాహాకారాలు... ఆర్తనాదాలు 
ప్రమాద స్థలం హాహాకారాలు, ఆర్తనాదాలతో దద్దరిల్లింది. క్షతగాత్రుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే గజ్వేల్‌ ఇన్‌చార్జి ఏసీపీ మహేందర్‌ చేరుకొని వాహన శకలాల నుంచి మృతదేహాలను వెలికితీసే ప్రక్రియను చేపట్టారు. సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డి కూడా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంతో రాజీవ్‌ రహదారి సుమారు రెండున్నర గంటలు స్తంభించిపోయింది. నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 

బిడ్డా భయపడకు.... నేనున్నా! 
బీటెక్‌ విద్యార్థినికి హరీశ్‌ భరోసా 
రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన బీటెక్‌ విద్యార్థిని సాహితిని గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రిలో మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. మంచిర్యాలకు చెందిన ప్రభాకర్‌–పద్మావతి దంపతుల కూతురు హైద్రాబాద్‌ బాచుపల్లిలోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. సెలవులు కావడంతో స్వగ్రామమైన మంచిర్యాలకు బయల్దేరింది. ప్రమాదంలో తలకు గాయాలై ఆమె గజ్వేల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ‘‘నీకేం కాదు.. మేమున్నాం.. అధైర్యపడవద్దంటూ..’’ అంటూ మంత్రి ఆమెకు భరోసానిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement