సాక్షి, సిద్దిపేట : జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద ఆర్టీసీ బస్సును రెండు లారీలు, క్వాలీస్ ఢీకొట్టాయి. ఒకేసారి నాలుగు వాహనాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో 11మంది మృతిచెందారు. 20మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని గజ్వేల్, హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం అలుముకుంది. గాయపడినవారు పెద్దసంఖ్యలో ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ సమీపంలో ఈ భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ, క్వాలీస్ వెనుక నుంచి ఢీకొట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ప్రమాదం గురించి తెలియడంతో అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం కావడంతో అధికారులకు పైనుంచి వెంటనే ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. మృతులను వెంటనే గుర్తించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మెరుగైన వైద్యం కోసం సమీపంలోని పెద్ద ఆస్పత్రులకు తరలించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. మృతులకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఒక యువ జర్నలిస్టు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంతో రాజీవ్ రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
రోడ్డుప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
సిద్దిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద విషయం తెలియగానే సీఎం చంద్రశేఖర్ రావు దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందజేయాలని అధికారులకు ఆదేశాంచారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు. ఈ ఘటనపై రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి దర్యాప్తునకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment