బస్సే.. చిచ్చు పెట్టింది..  | Negligent Driving, 11 people died In Siddipet Road Accident | Sakshi
Sakshi News home page

బస్సే.. చిచ్చు పెట్టింది.. 

Published Sun, May 27 2018 2:20 AM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM

Negligent Driving, 11 people died In Siddipet Road Accident - Sakshi

సాక్షి, గజ్వేల్‌: అతి వేగమే.. ప్రాణాలు తీసింది. దూకుడుగా వెళ్లిన ఆర్టీసీ బస్సు లారీని ఓవర్‌టేక్‌ చేయబోయి ఢీకొట్టి బోల్తా కొట్టడం.. దీంతో లారీ డివైడర్‌ దాటి కుడివైపునకు దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న క్వాలిస్‌ను, మరో కంటైనర్‌ లారీని ఢీకొట్టడంతో ఘోరమైన ప్రమాదం జరిగింది. 11 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. మొత్తం ప్రమాదానికి మూలం మంచిర్యాల డిపోకు చెందిన రాజ«ధాని బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమేనని స్పష్టమవుతోంది. ప్రమాదానికి కారణమైన ఈ బస్సు శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సికింద్రాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి బయలుదేరింది.

సుమారు గంట తర్వాత గజ్వేల్‌ మండలం రిమ్మనగూడకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. వాస్తవానికి ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సులను 75–80 కిలోమీటర్ల గరిష్ట వేగానికి లాక్‌ చేస్తారని చెబుతున్నారు. కానీ ప్రమాద సమయంలో బస్సు చాలా వేగంతో ప్రయాణిస్తున్నట్టు అందులో ఉన్న ప్రయాణికులు అంటున్నారు. బస్సు లారీని ఢీకొట్టిన తర్వాత.. డ్రైవర్‌ ఒక్కసారిగా పక్కకు తిప్పడంతోనే బొల్తా కొట్టిందని చెబుతున్నారు. 

మృత్యువును జయించిన చిన్నారి 
ఒక్కసారిగా దభేలుమనే శబ్దం.. బోల్తాపడిన బస్సు.. ఒకరిపై ఒకరు పడిపోయి ఊపిరాడని పరిస్థితి.. హాహాకారాలు.. ఆర్తనాదాలు.. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి.. కానీ ఈ ఘోర ప్రమాదం నుంచి శ్రీవల్లి అనే 11 నెలల చిన్నారి సురక్షితంగా, ఎలాంటి గాయాలు లేకుండా బయటపడింది. బస్సులో వారంతా గాయపడి, షాక్‌లో ఉండటం, క్వాలిస్‌లోని వారంతా మరణించడంతో... తొలుత ఈ చిన్నారి ఎవరనేది తెలియలేదు. మూడు నాలుగు గంటల పాటు గజ్వేల్‌ ఆస్పత్రి సిబ్బంది వద్దే ఉంది. వారే ఆమెకు పాలు, నీళ్లు అందించి లాలించారు. ఘటనలో పాప తరఫు బంధువులు, తల్లికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు నిర్ధారించారు. చిన్నారి తల్లి తూప్రాన్‌ మండలం వెంకట రత్నాపూర్‌కు చెందిన లక్ష్మిగా గుర్తించి.. వారి బంధువులకు అప్పగించారు. 

పన్నెండేళ్ల తర్వాత... 
గజ్వేల్‌: రాజీవ్‌ రహదారిపై గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ ప్రాంతంలో పన్నెండేళ్ల కింద ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2006 మే 13న కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు అప్పటి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరేందుకు స్కూల్‌ బస్సులో హైదరాబాద్‌కు వెళ్తుండగా.. ప్రజ్ఞాపూర్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అందులోని 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం చికిత్స పొందుతూ మరికొందరు ప్రాణాలు విడిచారు. ఆ దుర్ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఘటనా స్థలాన్ని అప్పటి డీజీపీ స్వరణ్‌జిత్‌సేన్‌ కూడా సందర్శించారు. రాజీవ్‌ రహదారి ఇరుకుగా ఉండటం, క్రమంగా వాహనాల ట్రాఫిక్‌ పెరుగుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అప్పట్లో రాజీవ్‌ రహదారి డబుల్‌ రోడ్డుగా ఉండగా.. ప్రస్తుతం నాలుగు లేన్లుగా విస్తరించారు. కానీ రహదారిపై మలుపులు సరిచేయకపోవడం, వాహనాలు అతివేగంగా ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో శనివారం ప్రజ్ఞపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

అయ్యో చిన్నారులు! 
గజ్వేల్‌/గజ్వేల్‌రూరల్‌/రాయపోలు: అప్పటిదాకా అమ్మానాన్న, అత్తామామ, అమ్మమ్మ తాతయ్యలతో సంతోషంగా గడిపారు. వేములవాడ, కొండగట్టు, యాదాద్రి, కొమురవెల్లి జాతరల్లో.. ‘మాకు ఆ బొమ్మ కావాలి.. ఈ వస్తువు కావాలి..’ అని మారాం చేశారు. కానీ అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. శనివారం నాటి ప్రమాదంలో క్వాలిస్‌లో ప్రయాణిస్తున్న గొర్ల లక్ష్మణ్‌ కుమార్తె నిహారిక, ఆయన బావమరిది కుమారులు శ్రీనివాస్, ఓంకార్‌లు మృతిచెందారు. గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రిలో నిహారిక, శ్రీనివాస్‌ మృతదేహాలను చూసినవారందరూ ‘అయ్యో.. దేవుడా..’ అంటూ కంటతడిపెట్టారు. అటు ఓంకార్‌ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

కళ్ల ముందే భార్య మరణంతో.. 
ఒకరికొకరు తోడూ నీడగా నిలిచిన దంపతులు వారు. కానీ విధికి వారిపై కన్నుకుట్టింది. భర్త కళ్ల ముందే భార్య కన్నుమూసింది. అది తట్టుకోలేని భర్త అచేతనంగా మారిపోయాడు. కనీసం ఏం జరిగిందో కూడా గుర్తించలేని అయోమయంలో పడిపోయాడు. కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డ ప్రాంతానికి చెందిన మాపం రఘు పరిస్థితి ఇది. ఆయన తన భార్య సింధూజతో కలసి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. వారు శనివారం కరీంనగర్‌కు వచ్చేందుకు హైదరాబాద్‌ జూబ్లీ బస్‌స్టేషన్‌లో మంచిర్యాల డిపో రాజధాని బస్సు ఎక్కారు. కానీ ప్రజ్ఞాపూర్‌ సమీపంలో జరిగిన ప్రమాదంలో రఘు గాయపడగా.. సింధూజ తీవ్రగాయాలతో మృతి చెందింది. కళ్లముందే భార్య మృతి చెందడాన్ని చూసిన రఘు చాలా సేపు అచేతనంగా ఉండిపోయాడు. తానెవరినో గుర్తుకు రావడం లేదని, ఏం జరిగిందని ఆయన అంటుండటం అందరినీ కన్నీరు పెట్టించింది. 

బతుకుతామనుకోలేదు 
బస్సులో ప్రయాణించినవారి మనోగతం 
భళ్లున శబ్దం.. అప్పటివరకు బాగానే ప్రయాణించిన బస్సు కన్నుమూసి తెరిచే లోపే బోల్తా కొట్టింది. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. ఒకరిపై ఒకరు పడిపోయి ఊపిరాడని పరిస్థితిలో కొందరు.. ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియక మరికొందరు.. అసలు బతుకుతామనే అనుకోలేదని ప్రమాదం నుంచి బయటపడిన వారు చెబుతున్నారు. 

ఊపిరి ఆగిపోయినంత పనైంది.. 
‘‘బస్సు చివరి సీట్లో ఎడమ వైపు కిటికీ పక్కన కూర్చున్న. ఇంతలోనే బస్సు లారీని ఓవర్‌ టేక్‌ చేసి బోల్తా పడ్డది. అందరి కంటే చివరిలో ఉన్న నాకు ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయినంత పనైంది. ధైర్యం చేసుకొని అద్దం పగలగొట్టి బయటకు వచ్చిన. నాతో పాటు మరికొందరు కూడా బయటకు వచ్చారు. 
    – తిరుపతిరెడ్డి, మంచిర్యాల

ఏం జరుగుతోందో తెలియలేదు 
‘‘బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టగానే అసలు ఏం జరుగుతోందో తెలియలేదు. కళ్లు చీకట్లు కమ్మినయి. బస్సు బాగా వేగంగా వచ్చింది. అందువల్లే అదుపుతప్పినట్టుంది..’’     
    – ప్రదీప్, ఐటీ ఉద్యోగి,  మంచిర్యాల 

మాకిది పునర్జన్మే.. 
‘‘ఇంత ఘోరమైన ప్రమాదం నుంచి బయటపడటం నిజంగా పునర్జన్మే. గంటసేపు షాక్‌ నుంచి బయటపడలేదు. ఎవరేమడిగినా సమాధానం చెప్పలేకపోయా..’’ 
    – జయసాగర్‌రావు, న్యాయవాది, మంచిర్యాల

దద్దరిల్లిన గాంధీ 
మరో చిన్నారి, మహిళ పరిస్థితి విషమం 
హైదరాబాద్‌: బస్సు ప్రమాదంలో గాయపడినవారి రోదనలతో గాంధీ ఆస్పత్రి దద్దరిల్లింది. ఈ ఆస్పత్రిలో ఏడుగురు చిన్నారులు సహా 14 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో శ్రీకాంత్‌ (10), లక్ష్మీ (27) పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి తల, ముఖంపై గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు రిజర్వేషన్‌ చార్టు ప్రకారం గుర్తించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీలో మెడికల్‌ ఎమర్జెన్సీ ప్రకటించి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. 

క్షతగాత్రుల వివరాలివీ... 
సురేష్‌ చంద్రరెడ్డి (54), శ్రీకాంత్‌ (10), శ్రీనాధ్‌ (06), రేవతి (03), శ్రీకర్‌ (12), రామయ్య (50), వినయ్‌ (10) ఉమేష్‌ (08), పుష్పలక్ష్మీ (38), నరసయ్య (40), లక్ష్మీ (27). మరో ఇద్దరి వివరాలు తెలియరాలేదు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement