అనంతపురం శ్రీకంఠంసర్కిల్/ఆత్మకూరు: రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన కానిస్టేబుల్ సతీమణి అనిత ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నట్లు బెంగళూరు వైద్యులు తెలిపారు. ఆమెకు ఆపరేషన్ చేస్తే కోలుకునే అవకాశం ఉందని, రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఇంటి పెద్ద కిరణ్ చనిపోవడంతో వారి పిల్లలు చిన్నారులు కావడంతో చేతిలో డబ్బులు లేక ఆ కుటుంబం చేయూత కోసం ఎదురుచూస్తోంది.
రూ.3 లక్షలు సాయం చేసిన ఎస్పీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్‌కుమార్ కుటుంబానికి ఎస్పీ కంచి శ్రీనివాసరావు అండగా నిలిచారు. కానిస్టేబుల్ భార్య అనిత చికిత్స నిమిత్తం రూ.3 లక్షలు చెక్కును అనిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ప్రత్యేకంగా కానిస్టేబుల్‌ను నియమించి అనితకు వైద్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు.
కరుణించిన ఖాకీలు
ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ మృతిని పోలీసుశాఖ జీర్ణించుకోలేకపోయింది.. చాలా మందితో సన్నిహితంగా మెలిగిన కిరణ్‌కుమార్ ప్రమాదంలో మృతిచెందడంతో కన్నీరు పెట్టుకోని ఖాకీలేడు. ఈ క్రమంలోనే అతని భార్య అనిత ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు చేయి చేయి కలిపి సాయం చేసేందుకు ముందుకు కదిలారు. ఇందులో భాగంగానే పీటీసీలో పనిచేస్తున్న డీఎస్పీ మల్లికార్జున వర్మ రూ.25 వేలు ఆర్థిక సహాయం చేశారు. కియా పోలీసు స్టేషన్ సిబ్బంది రూ.10 వేలు సహాయం చేశారు. ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా గంటల వ్యవధిలోనే రూ.2.50 లక్షలను పంపి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment