మారనున్న డిస్కంలు | DISCOMs exercise on officers and staff appointments | Sakshi
Sakshi News home page

మారనున్న డిస్కంలు

Published Sun, Feb 27 2022 5:01 AM | Last Updated on Sun, Feb 27 2022 3:54 PM

DISCOMs exercise on officers and staff appointments - Sakshi

సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటు నేపధ్యంలో విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)ల్లోనూ మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. జిల్లాల పరిధుల మేరకు డిస్కంల పరిధులను కూడా మార్చాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యుత్‌ సంస్థలు కసరత్తు మొదలుపెట్టాయి. కొత్త జిల్లాల్లో సర్కిల్, డివిజన్, ఏఈ కార్యాలయాల ఏర్పాటుతో పాటు వాటికి అధికారులు, సిబ్బందిని నియమించడంపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు అనుగుణంగానే మార్పులు చేపట్టాలని డిస్కంలు నిర్ణయించాయి. 

కొత్తగా వ్యవసాయ డిస్కం : రాష్ట్రంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఉన్నాయి. కొత్తగా వ్యవసాయానికి పాతికేళ్ల పాటు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్‌ను ఉచితంగా అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ అగ్రికల్చర్‌ పవర్‌ సప్లై కంపెనీ లిమిటెడ్‌ (ఏపీఆర్‌ఏపీఎస్‌సీఎల్‌)ను ఏర్పాటు చేస్తోంది. దీంతో నాలుగు అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1,91,29,441 విద్యుత్‌ సర్వీసులు ఉన్నాయి. వీటిలో దాదాపు 18.37 లక్షల వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులున్నాయి. వీటిని ప్రత్యేకంగా వ్యవసాయ డిస్కం పరిధిలోకి తెస్తారు. ఈ డిస్కం కోసం ప్రత్యేకంగా కొందరు అధికారులు, సిబ్బందిని నియమించాలి.  

మారుతున్న పరిధులు 
ప్రస్తుతం ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలున్నాయి. ఎస్‌పీడీసీఎల్‌లో చిత్తూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం, కర్నూలు,  పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలున్నాయి. రాష్ట్ర విభజన తరువాత 2019లో ఏపీసీపీడీసీఎల్‌ పేరుతో మూడో డిస్కంను ఏర్పాటు చేశారు. దీని పరిధిలోకి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, సీఆర్‌డీఏ పరిధిలోని సర్వీసులను తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ మూడును నాలుగు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో వీటి పరిధిలోకి ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో కొత్త ప్రాంతాలు కొన్ని వస్తాయి. కొన్ని ప్రాంతాలు వేరుపడతాయి. దీంతో వీటి పరిధులూ మారతాయి.

వాటికి అనుగుణంగా కార్యాలయాలు, సిబ్బందిని మార్చాలి. మూడు డిస్కంలలో సుమారు 23 వేల మంది శాశ్వత సిబ్బంది ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) నేతృత్వంలో ఆపరేషన్‌ సర్కిల్‌ కార్యాలయం ఉంది. రెవెన్యూ డివిజన్ల వారీగా డివిజన్‌ ఇంజనీర్‌(డీఈ) కార్యాలయాలున్నాయి. ప్రతి డివిజన్‌లో నాగులుకు పైగా సెక్షన్‌ (ఏఈ) కార్యాలయాలున్నాయి. పునర్వ్యవస్థీకరణతో మొత్తం జిల్లాల సంఖ్య 26 అవుతుంది.

వీటికి అనుగుణంగా ఎస్‌ఈ, డీఈ, ఏఈ కార్యాలయాలను కూడా డిస్కంలు పునర్వ్యవస్థీకరించాలి. ప్రస్తుతం 13 ఉన్న ఎస్‌ఈ స్థాయి అధికారుల సంఖ్య 26 అవుతుంది. వీటన్నింటికీ ఎస్‌ఈ స్థాయి అధికారులను నియమించాలి. దీంతోపాటు డీఈ, ఏఈ కార్యాలయాల్లోనూ మార్పులు రానున్నాయి. దీని కోసం డిస్కంలు కసరత్తు మొదలుపెట్టాయి. అర్హులైన వారికి ప్రమోషన్‌ ఇచ్చి కొత్త జిల్లాలకు పంపాలని డిస్కంలు భావిస్తున్నట్లు సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement