
సాక్షి, అమరావతి: జనరల్ మేనేజర్ స్థాయి అధికారి, మరో అధికారి తమను వేధిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లోని ముగ్గురు మహిళా ఉద్యోగులు ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తమను రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలోనే ఉంచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విధి నిర్వహణలో ఉండగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని లేఖలో వారు పేర్కొన్నారు. పరస్పర అంగీకార బదిలీలకూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
ఇదే జనరల్ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక గతంలో విశాఖ సర్కిల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారని, ఈ ఘటనలో జనరల్ మేనేజర్‌పై కేసు నమోదైందని, మరో అధికారిపై కూడా రాజమండ్రి, విశాఖపట్నంలో వేధింపుల ఫిర్యాదులు ఉన్నాయని వారు గుర్తు చేశారు. సీజీఎం స్థాయి అధికారి వారికి వత్తాసు పలుకుతుండటం తమను మరింతగా బాధిస్తోందని, తమను గానీ, వారిని గానీ బదిలీ చేసి ఈ వేధింపుల నుంచి విముక్తి కలిగించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని వారు సీఎండీని, ఇతర ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. డిస్కంలో అధికారుల వేధింపులపై తమకు అందిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు విచాణకు ఆదేశించినట్లు ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజర్ కర్రి వెంకటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment