officials harassment
-
విద్యుత్ శాఖలో వేధింపులు!
సాక్షి, అమరావతి: జనరల్ మేనేజర్ స్థాయి అధికారి, మరో అధికారి తమను వేధిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లోని ముగ్గురు మహిళా ఉద్యోగులు ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. తమను రాత్రి 11 గంటల వరకు కార్యాలయంలోనే ఉంచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, విధి నిర్వహణలో ఉండగా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని లేఖలో వారు పేర్కొన్నారు. పరస్పర అంగీకార బదిలీలకూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇదే జనరల్ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక గతంలో విశాఖ సర్కిల్ కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశారని, ఈ ఘటనలో జనరల్ మేనేజర్‌పై కేసు నమోదైందని, మరో అధికారిపై కూడా రాజమండ్రి, విశాఖపట్నంలో వేధింపుల ఫిర్యాదులు ఉన్నాయని వారు గుర్తు చేశారు. సీజీఎం స్థాయి అధికారి వారికి వత్తాసు పలుకుతుండటం తమను మరింతగా బాధిస్తోందని, తమను గానీ, వారిని గానీ బదిలీ చేసి ఈ వేధింపుల నుంచి విముక్తి కలిగించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని వారు సీఎండీని, ఇతర ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు. డిస్కంలో అధికారుల వేధింపులపై తమకు అందిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు విచాణకు ఆదేశించినట్లు ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజర్ కర్రి వెంకటేశ్వరరావు తెలిపారు. -
వేధించే అధికారులకు శంకరగిరిమాన్యాలే
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే అధికారులకు శంకరగిరిమాన్యాలు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. కార్యకర్తలను వేధిస్తున్న అధికారుల పేర్లను రాసి పెట్టుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారందరిపై చర్యలు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలన్నారు. ప్రజా కూటమి అధికారంలోకి వచ్చిన నెలలోపే లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ప్రాజెక్టులు, మిషన్ భగీరథకు సంబంధించిన కాంట్రాక్టర్లనుంచి ఆరు శాతం కమీషన్లు తీసుకున్న కేసీఆర్, అది అబద్ధమని నిరూపించుకోవడానికి 48 గంటల సమయం ఇస్తున్నానని అన్నారు. 1200 మంది బిడ్డల ఆత్మబలిదానాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు విలాస జీవితాన్ని గడుపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం దోపిడీదారుల గుప్పిట్లో ఉందన్నారు. కేసీఆర్‌కు ఉన్న ధైర్యం.. మూటలు, ముఠాలు మాత్రమేనని, అలాంటి ముఠాలు, మూటలకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కృతజ్ఞతలు చాటుకోవాలన్నారు. ఈ సభలో భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నాయకులు గూడురు నారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల వేధింపులతో వ్యక్తి మృతి
తుర్కపల్లి (నల్లగొండ జిల్లా) : అధికారుల వేధింపులతో భయాందోళనలకు గురైన ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...మాదాపూర్ గ్రామానికి చెందిన కీల లింగం(46) అనే వ్యక్తి గ్రామంలోని ఇసుక ఫిల్టర్ల వద్ద కూలీగా పని చేస్తున్నాడు. అయితే గ్రామ వీఆర్ఏ ఇసుక ఫిల్టర్లను సందర్శించి వాటిని నిలిపివేయాలని కోరాడు. ఈ క్రమంలోనే వీఆర్ఏ.. లింగం తనను తిట్టాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు లింగంను ఆదివారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించారు. తిరిగి సోమవారం కూడా విచారణకు హాజరుకావాలని కబురు పంపారు.ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన లింగంకు గుండెపోటు వచ్చింది. విషయం తెలిసిన బంధువులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. లింగం మరణంతో ఆగ్రహించిన గ్రామస్తులు వీఆర్వో, వీఆర్ఏలపై ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.