తుర్కపల్లి (నల్లగొండ జిల్లా) : అధికారుల వేధింపులతో భయాందోళనలకు గురైన ఒక వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే...మాదాపూర్ గ్రామానికి చెందిన కీల లింగం(46) అనే వ్యక్తి గ్రామంలోని ఇసుక ఫిల్టర్ల వద్ద కూలీగా పని చేస్తున్నాడు. అయితే గ్రామ వీఆర్‌ఏ ఇసుక ఫిల్టర్లను సందర్శించి వాటిని నిలిపివేయాలని కోరాడు.
ఈ క్రమంలోనే వీఆర్‌ఏ.. లింగం తనను తిట్టాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు లింగంను ఆదివారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించారు. తిరిగి సోమవారం కూడా విచారణకు హాజరుకావాలని కబురు పంపారు.ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన లింగంకు గుండెపోటు వచ్చింది. విషయం తెలిసిన బంధువులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. లింగం మరణంతో ఆగ్రహించిన గ్రామస్తులు వీఆర్వో, వీఆర్‌ఏలపై ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.