సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే అధికారులకు శంకరగిరిమాన్యాలు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. కార్యకర్తలను వేధిస్తున్న అధికారుల పేర్లను రాసి పెట్టుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారందరిపై చర్యలు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి బహుమతిగా ఇవ్వాలన్నారు. ప్రజా కూటమి అధికారంలోకి వచ్చిన నెలలోపే లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ప్రాజెక్టులు, మిషన్ భగీరథకు సంబంధించిన కాంట్రాక్టర్లనుంచి ఆరు శాతం కమీషన్‌లు తీసుకున్న కేసీఆర్, అది అబద్ధమని నిరూపించుకోవడానికి 48 గంటల సమయం ఇస్తున్నానని అన్నారు.
1200 మంది బిడ్డల ఆత్మబలిదానాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు విలాస జీవితాన్ని గడుపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం దోపిడీదారుల గుప్పిట్లో ఉందన్నారు. కేసీఆర్‌కు ఉన్న ధైర్యం.. మూటలు, ముఠాలు మాత్రమేనని, అలాంటి ముఠాలు, మూటలకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కృతజ్ఞతలు చాటుకోవాలన్నారు. ఈ సభలో భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నాయకులు గూడురు నారాయణరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment